Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: సెలబ్రిటీలకు AI పెళ్లిళ్ల‌ ముప్పు

అభిమానుల కోరిక మేరకు సృష్టించే ఈ ఫోటోలు ఒక్కోసారి అనవసరమైన రూమర్లకు దారితీస్తున్నాయి.

By:  Sivaji Kontham   |   20 March 2026 9:00 PM IST
ట్రెండీ టాక్: సెలబ్రిటీలకు AI పెళ్లిళ్ల‌ ముప్పు
X

టెక్నాలజీ పెరిగేకొద్దీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు భద్రత కరువవుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సృష్టిస్తున్న ఫోటోలు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ముప్పుగా మారాయి. ముఖ్యంగా సెల‌బ్స్ కి ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మించాయి. వారి కుటుంబ సభ్యులను సైతం తప్పుదారి పట్టిస్తున్నాయి. ఇటీవల హాలీవుడ్ నటి జెండయా తన పెళ్లి ఫోటోల విషయంలో ఎదుర్కొన్న చేదు అనుభవం ఇందుకు ఒక ఉదాహరణ. భారతీయ చిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి ఏఐ మాయాజాలం అనేక జంటలను చిక్కుల్లో పడేసింది.

సౌత్ సినీ పరిశ్రమలో ఏఐ బాధితులు:

దక్షిణాదిలో ఇటీవల అత్యంత చర్చనీయాంశమైన విషయం ధనుష్ - మృణాల్ ఠాకూర్ ఏఐ వెడ్డింగ్ ఫోటోలు. ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మృణాల్‌తో కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అవి ఎంత సహజంగా ఉన్నాయంటే అంతా నిజమేనని నమ్మేలా ఈ జంట ఫోటోలు ఉన్నాయి. అలాగే ప్రభాస్ - అనుష్క శెట్టి జంటకు సంబంధించి కూడా ఎన్నో ఏఐ వెడ్డింగ్ ఫోటోలు నిరంతరం వైరల్ అవుతూనే ఉంటాయి. అభిమానుల కోరిక మేరకు సృష్టించే ఈ ఫోటోలు ఒక్కోసారి అనవసరమైన రూమర్లకు దారితీస్తున్నాయి.

బాలీవుడ్‌లో ఏఐ మాయాజాలం:

ఉత్తరాదిలో కూడా సెలబ్రిటీ జంటలకు ఏఐ ముప్పు తప్పడం లేదు. పెళ్లికి ముందు విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్, అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ జంటలకు సంబంధించిన నకిలీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకున్నట్లుగా కూడా ఏఐ ఫోటోలు సృష్టించి ఫ్యాన్స్‌ను ఫూల్ చేస్తున్నారు. వీటివల్ల ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితి నెలకొంది.

జెండయా ఆవేదన..

హాలీవుడ్ స్టార్ జెండయా తన ఏఐ వెడ్డింగ్ ఫోటోలపై స్పందిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక క్లిక్‌తో సెలబ్రిటీల ముఖాలను వేరే వ్యక్తుల శరీరాలకు తగిలించి తప్పుదారి పట్టిస్తున్నారని జెండ‌యా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పెళ్లి ఫోటోలను చూసి తన కుటుంబ సభ్యులు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయారని.. టెక్నాలజీ ఇంత భయంకరంగా మారుతుండటం బాధాకరమని ఆమె పేర్కొన్నారు.

సాంకేతికతను సృజనాత్మకత కోసం ఉప‌యోగించుకోవాలి తప్ప.. ఇతరుల జీవితాలతో ఆడుకోవడానికి కాదని జెండయా హితవు పలికారు. ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి విషయాన్ని కళ్లు మూసుకుని నమ్మేయకూడదని, అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలని అభిమానులకు సూచించారు. డీప్‌ఫేక్ టెక్నాలజీ భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని.. సోషల్ మీడియా వినియోగదారులు బాధ్యతాయుతంగా ఉండాలని ఆమె కోరారు.

ఈరోజుల్లో సాంకేతిక విప్లవం ఒకవైపు సౌకర్యాలను తెస్తుంటే.. మరోవైపు ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేస్తూ సెలబ్రిటీల ప్రైవసీని దెబ్బతీస్తోంది. జెండయా ఇచ్చిన క్లారిటీతో ప్రస్తుతానికి ఈ సెల‌బ్రిటీ పెళ్లి పుకార్లకు తెరపడినా.. ఏఐ సృష్టించే ఇలాంటి ముప్పు భవిష్యత్తులో ఇంకా ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.