టాలీవుడ్ లో 'నవ్వు' కరువు.. ఆ లోటును ఎవరు తీరుస్తారు?
ఈవీవీ సత్యనారాయణ, జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి కాలం నుంచి చూస్తే శ్రీను వైట్ల, వినాయక్ వరకు ఒక స్పష్టమైన కామెడీ ట్రాక్ ఉండేది.
By: M Prashanth | 8 Dec 2025 10:38 AM ISTఒకప్పుడు సినిమా అంటే కేవలం హీరో ఫైట్లు, హీరోయిన్ పాటలు మాత్రమే కాదు. కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా అందులో ప్రధాన భాగంగా ఉండేది. టికెట్ కొన్న ప్రేక్షకుడికి మూడు గంటల పాటు వినోదం పంచడంలో కమెడియన్స్ పాత్ర హీరోతో సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారింది. థియేటర్ నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుడు "సినిమా బాగుంది కానీ నవ్వు మిస్ అయ్యాం" అని ఫీలవుతున్నాడు. అసలు మన సినిమాల్లో ఆ పాత కాలపు కామెడీ ఎందుకు కనుమరుగైంది? బ్రహ్మానందం లాంటి లెజెండ్స్ స్క్రీన్ మీద కనిపించడం తగ్గించాక, ఆ స్థానాన్ని భర్తీ చేసేవారు మనకు లేరా?
ఈవీవీ సత్యనారాయణ, జంధ్యాల, ఎస్వీ కృష్ణారెడ్డి కాలం నుంచి చూస్తే శ్రీను వైట్ల, వినాయక్ వరకు ఒక స్పష్టమైన కామెడీ ట్రాక్ ఉండేది. ప్రస్తుత జనరేషన్లో అనిల్ రావిపూడి లాంటి వాళ్లు ఉన్నప్పటికీ అది సరిపోవడం లేదు. కథ సీరియస్ గా వెళ్తున్నా, మధ్యలో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి వారు ఎంట్రీ ఇస్తే థియేటర్ దద్దరిల్లేది. వీరికి సపరేట్ గా సీన్లు రాసేవారు. హీరోతో సంబంధం లేకుండా కూడా వీరి కామెడీ ట్రాక్ సినిమాను బ్లాక్ బస్టర్ చేసిన సందర్భాలు కోకొల్లలు. 'దూకుడు', 'రెడీ', 'బాద్షా', 'కిక్' వంటి సినిమాల విజయాల్లో సగం క్రెడిట్ బ్రహ్మానందం ఖాతాలోకే వెళ్తుంది.
కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. "పాన్ ఇండియా" మోజులో పడి మన మేకర్స్ కామెడీని పక్కన పెట్టేశారు. కేవలం గూస్ బంప్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ల మీదే దృష్టి పెడుతున్నారు. కామెడీ రాస్తే సినిమా సీరియస్ నెస్ తగ్గుతుందేమో, కథలో ల్యాగ్ అవుతుందేమో అనే భయం దర్శకుల్లో పెరిగిపోయింది. అందుకే సపరేట్ కామెడీ ట్రాక్స్ ఇప్పుడు పూర్తిగా మాయమయ్యాయి. ఏదో హీరో పక్కన స్నేహితుడిగా ఉంటూ, టైమ్ కి ఒక పంచ్ వేయడం తప్ప, ఒక పూర్తి స్థాయి హాస్య పాత్రను మనం చూడలేకపోతున్నాం.
ప్రస్తుతం మన దగ్గర టాలెంట్ కి కొదవ లేదు. వెన్నెల కిషోర్, సత్య, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి అద్భుతమైన నటులు ఉన్నారు. ముఖ్యంగా సత్య, వెన్నెల కిషోర్ తమ టైమింగ్ తో సినిమాలను నిలబెడుతున్నారు. కానీ సమస్య వారికి పడుతున్న క్యారెక్టర్లలో ఉంది. పాత సినిమాల్లో బ్రహ్మికి రాసినట్లుగా 'భట్టు', 'గజాల', 'కిల్ బిల్ పాండే' లాంటి ఐకానిక్ పాత్రలు వీరికి రైటర్స్ రాయలేకపోతున్నారు. కేవలం సిచువేషనల్ కామెడీ పేరుతో ఏదో మమ అనిపిస్తున్నారు తప్ప, ఆ పాత్ర ప్రేక్షకుడితో ట్రావెల్ అయ్యేలా డిజైన్ చేయడం లేదు.
దీనికి ప్రధాన కారణం రచయితల్లో హ్యూమర్ సెన్స్ తగ్గిపోవడమా? లేక జనాల అభిరుచి మారిపోవడమా? అనేది ఆలోచించాల్సిన విషయం. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్ వచ్చాక ఆడియెన్స్ చాలా షార్ట్ కామెడీకి అలవాటు పడ్డారు. నిమిషంలో నవ్వించే కంటెంట్ ఫోన్ లోనే దొరుకుతున్నప్పుడు, థియేటర్లో అంతకు మించిన కామెడీని ఆశిస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి జోకులు వేస్తే జనం మొహం మీదే తిప్పికొడుతున్నారు. అందుకే 'జాతిరత్నాలు', 'సామజవరగమన' లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. అంటే వారికి నవ్వాలని ఉంది, కానీ నవ్వించే కంటెంట్ రావడం లేదు.
మరోవైపు బ్రహ్మానందం వయసు రీత్యా సినిమాలు తగ్గించడం ఇండస్ట్రీకి తీరని లోటు. మరో సీనియర్ కమెడియన్స్ అలీ, బాబు మోహన్ ఉన్నా వాళ్లు కూడా గతంలో మాదిరిగా కనిపించే పరిస్థితి లేదు. ఏదేమైనా బ్రహ్మీ స్క్రీన్ ప్రెజెన్స్, ఆ ఎక్స్ ప్రెషన్స్ ను రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు. ఆయన లేని లోటు ప్రతి పెద్ద సినిమాలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సినిమా ప్లాప్ అయినా, కేవలం బ్రహ్మానందం కామెడీ కోసమే రిపీట్ ఆడియెన్స్ వెళ్లేవారు. ఇప్పుడు ఆ సౌలభ్యం నిర్మాతలకు లేదు. సినిమా బాగుంటేనే చూస్తున్నారు లేకపోతే లేదు.
నిజానికి ఏడ్పించడం చాలా సులభం, కానీ నవ్వించడం చాలా కష్టం అంటారు. ఇప్పుడున్న దర్శకులు ఆ కష్టాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు అనిపిస్తోంది. యాక్షన్ సీన్ తీయడానికి చూపించే శ్రద్ధలో సగం, కామెడీ సీన్ రాయడానికి చూపిస్తే ఫలితాలు వేరేలా ఉంటాయి. కేవలం హీరోని గ్లోరిఫై చేయడం మాత్రమే కాదు, ప్రేక్షకుడిని రిలాక్స్ చేయడం కూడా సినిమా బాధ్యతే.
