Begin typing your search above and press return to search.

2026 డిసెంబర్ - కొత్త బ్లాక్‌బస్టర్ సీజన్!

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. ఒకప్పుడు వేసవి కాలం .. పండుగ సీజన్లకు మాత్రమే పరిమితమైన భారీ వసూళ్లు ఇప్పుడు డిసెంబర్ నెలలో కూడా సాధ్యమవుతున్నాయని పరిశ్రమ నమ్ముతోంది.

By:  Srikanth Kontham   |   2 July 2026 8:33 AM IST
2026 డిసెంబర్ - కొత్త బ్లాక్‌బస్టర్ సీజన్!
X

గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో ఓ ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. ఒకప్పుడు వేసవి కాలం .. పండుగ సీజన్లకు మాత్రమే పరిమితమైన భారీ వసూళ్లు ఇప్పుడు డిసెంబర్ నెలలో కూడా సాధ్యమవుతున్నాయని పరిశ్రమ నమ్ముతోంది. `పుష్ప: ది రైజ్`, `యానిమల్`, `సలార్` లాంటి చిత్రాలు డిసెంబర్ నెలలో విడుదలై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడంతో డిసెంబ‌ర్ ఇప్పుడు నిర్మాతల మొదటి ఎంపికగా మారుతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లకు డిసెంబర్ కొత్త కేరాఫ్ అడ్రస్ గా అవ‌త‌రిస్తోంది. ఈ సక్సెస్ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ 2026 డిసెంబర్ అత్యంత రసవత్తరంగా మారబోతోంది.

స్టార్ హీరోల సినిమాలు ఒకే సమయంలో రావడంతో ఈ ఏడాది చివరి నెల బాక్సాఫీస్ వద్ద భారీ పోటీని చూడబోతోంది. ఇప్పటికే కొన్ని సినిమాలు విడుదల తేదీలను ఖరారు చేసుకోగా మరికొన్ని సర్దుబాట్ల దిశగా పయనిస్తున్నాయి. ప్రేక్షకులు ఈ డిసెంబర్‌ను సినీ పండుగ గా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ న‌టిస్తోన్న భారీ చిత్రం `రౌడీ జనార్ధన` డిసెంబర్ బరిలో నిలవనుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ లో స్టార్ పవర్‌కు ప్రధాన ఆకర్షణ కానుంది.

అలాగే బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ చిత్రం కూడా డిసెంబర్ విడుదల కోసం లాక్ అయ్యింది. టాలీవుడ్ -బాలీవుడ్ తారల మధ్య ఈ పోరు పాన్-ఇండియా స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. ప్రభాస్ అభిమానులకు మరో శుభవార్త ఏమిటంటే? ఆయన న‌టిస్తోన్న `ఫౌజీ` కూడా డిసెంబర్ 3న విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ప్రభాస్ నుంచి రాబోయే ప్రతి సినిమాకు భారీ హైప్ ఉండటం, దానికి తోడు డిసెంబర్ సెంటిమెంట్ కలిసి రావడంతో `ఫౌజీ`పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో వస్తే డిసెంబర్ నెల మొత్తం థియేటర్ల వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇంతమంది అగ్ర కథానాయకుల చిత్రాలు ఒకే నెలలో విడుదల కావడం వల్ల థియేటర్ల కేటాయింపు, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఆసక్తికరమైన పోటీ త‌ప్ప‌దు. నిర్మాతలు తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురా వడానికి ప్లానింగ్ చేసుకుంటున్న తీరు బాక్సాఫీస్ వద్ద వ్యాపార అవకాశాలను మరింత పెంచుతోంది. వినోదాన్ని పంచడానికి భారీ చిత్రాలు వరుసకట్టడం ప్రేక్షకులకు మంచి విందు లాంటిద‌ని చెప్పొచ్చు. రిలీజ్ లు అన్ని స‌వ్యంగా జ‌రిగితే గ‌నుక 2026 డిసెంబర్ భారతీయ సినీ రంగంలో మరో మైలురాయిగా నిలవనుంది. వసూళ్ల పరంగానే కాకుండా కంటెంట్ , మేకింగ్ పరంగా కూడా ఈ చిత్రాలు సత్తా చాటుతాయని ఆశించొచ్చు. మ‌రి డిసెంబర్ అనే మాంత్రిక పదం బాక్సాఫీస్‌కు ఎంత వరకు కలిసొస్తుందో? చూడాలి.