టాప్ స్టోరి: ఇండస్ట్రీ ఓల్డ్ ఉమెన్ హనీ ట్రాప్ కథలు
కేవలం మగాళ్లనే మృగాళ్లుగా చిత్రించే క్రమంలో మహిళలు చేసే తప్పులను సైతం సమర్థించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
By: Sivaji Kontham | 15 March 2026 7:00 AM ISTసినిమా అనేది సమాజంపై బలమైన ప్రభావం చూపే శక్తివంతమైన సాధనం. గతంలో సామాజిక కట్టుబాట్లుగా ఉన్న ఎన్నో విషయాలను వెండితెరపై నార్మలైజ్ చేస్తూ చూపించడం ఇటీవలే పెద్ద చర్చగా మారింది. అయితే ప్రస్తుత చిత్రాల్లో ఫెమినిజం (మహిళా సాధికారత) పేరుతో కొన్ని ప్రమాదకరమైన ధోరణులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అనైతిక పనులను, మోసాలను సైతం మహిళా స్వేచ్ఛగా ఆవిష్కరించడం సమాజంలోని ఆరోగ్యకరమైన ఆలోచనా దృక్పథాన్ని దెబ్బతీస్తోంది. కేవలం మగాళ్లనే మృగాళ్లుగా చిత్రించే క్రమంలో మహిళలు చేసే తప్పులను సైతం సమర్థించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మహిళా సాధికారత ముసుగులో జరుగుతున్న `హనీ ట్రాపింగ్` అంశాన్ని బాలీవుడ్ చిత్రం `లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా` వంటివి తెరపైకి తెచ్చాయి. ఈ సినిమాలో ఒక వృద్ధురాలు యువతిలా నటిస్తూ ఓ యువకుడిని శృంగార సంభాషణలతో బుట్టలో వేసుకుంటుంది. తీరా నిజం తెలిసినప్పుడు ఆ యువకుడు అసహ్యించుకుంటే సదరు వృద్ధురాలినే బాధితురాలిగా చిత్రించడం విడ్డూరం. ఒక 60 ఏళ్ల మహిళకు వ్యక్తిగత వాంఛలు ఉండటంలో తప్పు లేకపోయినా ఎదుటివారిని మోసం చేయడం ఏ రకమైన ఫెమినిజం అవుతుంది? ఇదే పని ఒక వృద్ధుడు చేస్తే సమాజం `మృగం` అని ముద్ర వేస్తుంది కదా..రి మహిళకు ఒక న్యాయం.. పురుషుడికి ఒక న్యాయమా? ఇలాంటి `బ్లడీ స్కేప్ గోట్స్`గా మగాళ్లను మార్చడం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పాకుతోంది.
ఈ బాలీవుడ్ ప్రభావం ఇప్పుడు టాలీవుడ్‌పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగులో ఏడు చేపల కథ, డిగ్రీ కాలేజ్ వంటి చిత్రాల నుంచి రీసెంట్ గా `మంగళవారం` లేదా కొన్ని వెబ్ సిరీస్‌ల వరకు గమనిస్తే మహిళా పాత్రలు తప్పుదారి పట్టడాన్ని లేదా వారి అనైతిక ప్రవర్తనను క్యాష్ చేసుకునే ధోరణి పెరిగింది. పాత కాలపు తెలుగు సినిమాల్లో మహిళా విలన్లను లేదా తప్పు చేసే పాత్రలను నెగటివ్‌గా చూపించేవారు. కానీ ఇప్పుడు ఒక మహిళ తన భర్తను మోసం చేసినా లేదా హనీ ట్రాప్ వంటి అనైతిక పనులకు పాల్పడినా ఆమె నేపథ్యానికి ఒక సెంటిమెంట్ రంగు పూసి ఆమెను సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పరోక్షంగా యువతను తప్పుదారి పట్టిస్తోంది.
అనైతికతను సమర్థించే ధోరణి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్‌లోని సిరీస్‌లలోనూ కనిపిస్తోంది. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. నిశ్చితార్థం జరుగుతుండగానే ప్రియుడితో గడపడం వంటి పనులను గొప్పవిగా చూపిస్తున్నారు. పురుషులు ఇటువంటి పనులు చేస్తే వారిని విలన్లుగా చూపే చిత్ర పరిశ్రమ క్రియేటర్లు మహిళలు చేస్తే మాత్రం వారిని బో*ల్డ్ లేదా ఇండిపెండెంట్ మహిళలుగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారో అర్థం కాదు. తప్పు చేసిన వారిని బాధితులుగా చూపిస్తూ కథలు అల్లడం వల్ల సమాజంలో నైతిక విలువల పతనం సంభవించే ప్రమాదం ఉంది.
ఆధునిక చిత్రాల్లో బో*ల్డ్ ఉమెన్ అంటే కేవలం శృంగారం చుట్టూ తిరిగే పాత్రలుగానే మారిపోయాయి. మహిళలకు శృంగారం మించి వేరే ప్రపంచం లేదన్నట్లుగా వారి మేధస్సును, ధైర్యాన్ని కేవలం లైంగిక కోణంలోనే ఎందుకు చూపిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. పురుషుడు ధైర్యవంతుడైతే పోరాటాలు చేయాలి కానీ మహిళ బోల్డ్ అయితే మాత్రం కేవలం శృంగారంలో పాల్గొనాలా? ఈ రకమైన విజువల్ చొరవ మహిళా సాధికారతకు ఏమాత్రం గౌరవం తీసుకురాదు.. పైగా సగటు మహిళా ప్రతిభను కించపరచడమే అవుతుంది. టాలీవుడ్ దర్శకులు సైతం గ్లామర్ , వివాదాస్పద అంశాల కోసం ఇలాంటి పాత్రలనే ఆశ్రయించడం విచారకరం.
నిజమైన ఫెమినిజం అంటే ఏమిటో క్వీన్, థాప్పడ్, పింక్, నామ్ షబానా వంటి సినిమాలు నిరూపించాయి. ఆత్మగౌరవం కోసం నిలబడటం, నో అంటే నో అని కచ్చితంగా చెప్పడమే అసలైన మహిళా సాధికారత. అటువంటి విలువలు ఉన్న పాత్రలను మనం ఆదర్శంగా తీసుకోవాలి కానీ తన స్వార్థం కోసం ఎదుటివారిని వాడుకుని మోసం చేసే పాత్రలను గొప్ప నారీమణులుగా చూడకూడదు. బాధ్యతాయుతమైన చిత్ర నిర్మాణం ద్వారానే భవిష్యత్ తరానికి సరైన సందేశం అందుతుంది. శృంగార వాంఛలు సహజమైనవే అయినా.. దాని కోసం మోసం చేయడం లేదా హనీ ట్రాప్ వంటి పనులను నార్మలైజ్ చేయడం ఏ సమాజానికి క్షేమకరం కాదు.
