100 కోట్ల విజయం: ఆ ముగ్గురికీ ఓకే కానీ వామికకు BMW నజరానా లేదా?
ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ ఏడాదిలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.
By: Sivaji Kontham | 11 Sept 2026 7:27 AM ISTప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం `డీసీ` (DC) బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను, విమర్శకులను విశేషంగా ఆకట్టుకుని సంచలన వసూళ్లను రాబట్టింది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ ఏడాదిలోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.
ఈ గ్రాండ్ సక్సెస్‌ను పురస్కరించుకుని చిత్ర నిర్మాత కళానిధి మారన్ చిత్ర యూనిట్‌కు ఊహించని రీతిలో భారీ బహుమతులు అందజేశారు. సినిమా విజయానికి ముఖ్య కారకులైన హీరో లోకేశ్ కనగరాజ్, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ లను నేరుగా కలిసి అభినందించారు. అంతేకాకుండా ఆ ముగ్గురికీ అత్యంత ఖరీదైన బ్రాండ్ న్యూ బిఎమ్‌డబ్ల్యూ (BMW) లగ్జరీ కార్ల ను కానుకగా అందించారు. దీనికి సంబంధించిన వీడియోను సన్ పిక్చర్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
దర్శకుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న లోకేశ్ కనగరాజ్.. ఈ చిత్రంలో దేవదాస్ అనే పాత్రలో మొదటిసారి నటుడిగా సరికొత్త అవతారంలో కనిపించి అందరినీ మెప్పించారు. రా అండ్ రస్టిక్ యాక్షన్ అంశాలతో పాటు ఉత్కంఠభరితమైన కథనంతో దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా మలచగా.. రాక్ స్టార్ అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్- పాటలు సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాయి. ఈ ముగ్గురి శ్రమ ఫలితంగానే చిత్రం ఈ స్థాయిలో విజయం సాధించిందని సినీ వర్గాలు కొనియాడుతున్నాయి.
గతంలో కూడా సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ తన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించినప్పుడు చిత్ర బృందానికి ఖరీదైన బహుమతులు అందించే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. `జైలర్` సినిమా సక్సెస్ సాధించిన సమయంలో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్- దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్- అలాగే అనిరుధ్‌లకు లగ్జరీ కార్లతో పాటు భారీ చెక్కులను బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు `డీసీ` చిత్రంతో అనిరుధ్ మరోసారి సన్ పిక్చర్స్ నుండి లగ్జరీ కారును అందుకోవడం విశేషం.
ఈ విజయం తర్వాత లోకేశ్ కనగరాజ్ మళ్లీ తన తదుపరి భారీ ప్రాజెక్టులతో బిజీ కానున్నారు. అనిరుధ్ సంగీతం, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్, లోకేశ్ నటన కలసి `డీసీ`ని ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలబెట్టాయి. మరోవైపు ఈ చిత్రం సాధించిన విజయంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతుండటంతో పాటు సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ లార్జ్ హార్టెడ్ ఆటిట్యూడ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే డీసీ సినిమాలో తనదైన అద్భుత నటనతో కట్టి పడేసిన కథానాయిక వామిక గబ్బీకి బీఎండబ్ల్యూ కానుక అందకపోవడంపై నెటిజనులు నిర్మాత మారన్ ని ప్రశ్నిస్తున్నారు. తొలిసారి తెరకు నటుడిగా పరిచయం అవుతున్న లోకేష్ తడబడకుండా అతడికి ఎంతో అండగా నిలిచి మంచి ఔట్ పుట్ రావడానికి కారకురాలు వామిక గబ్బీ. తనకు అంత ప్రాధాన్యతనివ్వకపోవడం ఆశ్చర్యపరిచిందని కూడా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.
