Begin typing your search above and press return to search.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం!

ఈ ఇన్ఫెక్షన్లు ముదిరి సెప్టిక్ సమస్యలకు దారితీయడంతో శరీరం చికిత్సకు సహకరించక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   18 Jun 2026 4:09 PM IST
చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం!
X

హాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. `ది రింగ్` లో సమర మోర్గాన్ పాత్రతో ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టించిన నటి డేవీ చేజ్ (35) కన్నుమూశారు. భయానక పాత్రలకే పరిమితం కాకుండా.. డిస్నీ చిత్రం `లిలో అండ్ స్టిచ్ లిలో పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల మనసులను గెలుచుకున్న చేజ్ మరణవార్త సినీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె హఠాన్మరణంతో అభిమానులు, సహ నటీనటులు శోకసముద్రంలో మునిగిపోయారు. డేవీ చేజ్ మరణానికి గల కారణాలను ఆమె ప్రియుడు రోయ్ హెర్నాండెజ్ మీడియాకు వెల్లడించారు. గత కొంతకాలంగా ఆమె మెనింజైటిస్ -తీవ్రమైన రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు తెలిపారు.

ఈ ఇన్ఫెక్షన్లు ముదిరి సెప్టిక్ సమస్యలకు దారితీయడంతో శరీరం చికిత్సకు సహకరించక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. పోషకాహార లోపం కారణంగా ఆమె ఈ నెల ప్రారంభంలో లాస్ ఏంజిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ విషాద సమయంలో డేవీ చేజ్ వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ఆమె భాగస్వామి రోయ్ హెర్నాండెజ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. రోయ్ హెర్నాండెజ్ హాలీవుడ్‌లో అంతగా పరిచయం లేని వ్యక్తి అయినా? ఇండస్ట్రీలో `గీషా ఆఫ్ డెత్`, `చైన్ మెయిల్` వంటి కొన్ని ప్రాజెక్టులతో ముడిపడి ఉన్నారు.

డేవీ చేజ్ స్టార్డమ్‌కు దూరంగా ఇద్ద‌రు తమ వ్యక్తిగత సంబంధాన్ని మీడియా కంట పడకుండా ఎంతో ప్రైవేట్‌గా ఉంచుకున్నారు. కష్ట సమయాల్లో ఆమెకు అండగా ఉంటూ చివరి శ్వాస వరకు ఆమెను కాపాడుకోవడానికి రోయ్ ఎంతో ప్రయత్నించారు. డేవీ చేజ్ కెరీర్ చూస్తే.. ఆమె బాలనటిగానే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో విడుదలైన `ది రింగ్` చిత్రంలో ఆమె పోషించిన సమర పాత్ర ఇప్పటికీ హారర్ సినీ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచిపోతుంది. దీనికి గాను ఆమె ఎంటీవీ మూవీ అవార్డును కూడా గెలుచుకున్నారు.

అటుపై `డోనీ డార్కో` సినిమాతో పాటు, హెచ్‌బీఓ సిరీస్ బిగ్ లవ్ లో ఐదు సీజన్ల పాటు 32 ఎపిసోడ్‌లలో రొండా వోల్మర్ గా చేసిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. డేవీ చేజ్ అనారోగ్య సమస్యలతో పోరాడుతున్న సమయంలో ఆమెకు ఆర్థికంగా, మానసికంగా మద్దతు ఇవ్వడానికి రోయ్ హెర్నాండెజ్ నిధుల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ప్రచార వివరాలలో ఆయన డేవీ జీవితంలోని చీకటి కోణాలను పంచుకున్నారు. వెండితెరపై ఎంతో మందిని అలరించిన డేవీకి బాల్యం చాలా కష్టంగా గడిచిందని.. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాల వల్ల ఆమె ఒంటరిదైందని తెలిపారు. లాస్ ఏంజిల్స్ నగరంలో నివసిస్తున్న సమయంలో ఆమె తీవ్రమైన వేధింపులను, భద్రతా లేమిని ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

తనను కలిసినప్పుడు డేవీని కంటికి రెప్పలా కాపాడుకుంటానని.. ఆమెకు దక్కాల్సిన ప్రేమను అందిస్తానని రోయ్ మాట ఇచ్చారు. వారిద్దరి ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ కలిసి ఉన్నంత కాలం ఆనందాన్ని, కొత్త ఆశలను వెతుక్కున్నట్లు రోయ్ ఎమోషనల్‌గా గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను అనుభవించి..చివరికి ప్రాణాంతక వ్యాధితో పోరాడి కన్నుమూసిన డేవీ చేజ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా? ఆమె పోషించిన అద్భుతమైన పాత్రల ద్వారా హాలీవుడ్ ప్రేక్షకులలో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు.