8 కోట్ల మంది వీక్షించిన `యానిమల్` లాంటి ట్రైలర్!
పంజాబీ చిత్ర పరిశ్రమ నుండి సరికొత్త సంచలనం సృష్టిస్తూ.. ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న తాజా చిత్రం `దస్తార్` (DASTAAR) అధికారిక ట్రైలర్ విడుదలైంది.
By: Sivaji Kontham | 5 July 2026 7:45 AM ISTపంజాబీ చిత్ర పరిశ్రమ నుండి సరికొత్త సంచలనం సృష్టిస్తూ.. ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న తాజా చిత్రం `దస్తార్` (DASTAAR) అధికారిక ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ నటుడు తర్సేమ్ జస్సర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం కేవలం పంజాబీ ప్రేక్షకులనే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. ధైర్యం, త్యాగం, ఆత్మగౌరవం వంటి పవర్‌ఫుల్ అంశాల నేపథ్యంతో అమర్ హుండల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
ఈ చిత్రం తర్సేమ్ జస్సర్ సిగ్నేచర్ స్టైల్‌లో సాగుతూ..శిక్కుల ఆత్మగౌరవ ప్రతీక అయిన దస్తార్ (తలపాగా) చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన కథాంశంతో రూపొందింది. ఒకప్పుడు విదేశాలలో పంజాబీలు - శిక్కులపై జరిగిన వర్ణవివక్ష (రేసిజమ్).. వారు ఎదుర్కొన్న అణచివేతపై తిరగబడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్.. నటీనటుల గంభీరమైన నటన.. హాలీవుడ్ స్థాయి సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తూ రోమాంచితం చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ చూసిన సినీ విమర్శకులు.. నెటిజన్లు దీని మేకింగ్ స్టైల్‌ను బ్లాక్‌బస్టర్ చిత్రం `యానిమల్` .. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన `పీకీ బ్లైండర్స్` సిరీస్‌తో పోల్చుతున్నారు. ముఖ్యంగా ఇందులోని శిక్కు బ్యాక్‌డ్రాప్.. యాక్షన్ ఎపిసోడ్స్.. ఇంటెన్స్ నరేషన్ చూస్తుంటే బాలీవుడ్‌లో భారీ వసూళ్లు సాధించిన `యానిమల్` తరహాలోనే హై-వోల్టేజ్ డ్రామా గుర్తుకొస్తోందని కామెంట్లు పెడుతున్నారు. పంజాబీ సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని మలిచారంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది.
రొటీన్ కామెడీ, రెగ్యులర్ ఫ్రాంచైజీ కథలతో సాగిపోతున్న పంజాబీ చిత్ర పరిశ్రమలో ఇలాంటి ఒక వినూత్నమైన .. బాధ్యతాయుతమైన కథతో రావడంపై ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం వినోదం కోసమే కాకుండా చరిత్రను, సమాజంలోని సమస్యలను ధైర్యంగా చూపించే ప్రయత్నం చేసినందుకు హీరో తర్సేమ్ జస్సర్‌ను .. చిత్ర బృందాన్ని నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఈ సినిమా కేవలం పంజాబీలోనే కాకుండా హిందీ, తమిళం, తెలుగు వంటి ఇతర భారతీయ భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయాలని పలు రాష్ట్రాల ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.
8 కోట్ల వీక్షణలతో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా ట్రైలర్ దూసుకుపోతోంది. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు ఒక మర్చిపోలేని సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తన ఉనికి కోసం.. గౌరవం కోసం పోరాడని వారు కాలగర్భంలో కలిసిపోతారు! అనే పవర్‌ఫుల్ సందేశంతో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో చూడాలంటే జూలై 17 వరకు వేచి చూడాల్సిందే.
