దాసరి దేవదాస్ మోజు...అక్కినేనికి హిట్ ఇచ్చిందా ?
దర్శకరత్న దాసరి నారాయణరావు పేరు చెబితే చాలు చలన చిత్ర సీమలో ఎన్నో గొప్ప చిత్రాలు కళ్ల ముందు కదలాడుతాయి.
By: Satya P | 23 March 2026 11:05 PM ISTదర్శకరత్న దాసరి నారాయణరావు పేరు చెబితే చాలు చలన చిత్ర సీమలో ఎన్నో గొప్ప చిత్రాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఆయన ఏకంగా 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు. అంతే కాదు కధ మాటలు పాటలు స్క్రీన్ ప్లే నటన ఇలా అనేక రంగాలలో తన ప్రావీణ్యత చాటుకున్నారు. బడ్జెట్ చిత్రాల నుంచి భారీ చిత్రాల దాకా నిర్మించిన ఘనత ఆయనదే. సాంఘిక చిత్రాలతో పాటు చారిత్రాత్మక చిత్రాలకు కూడా దర్శకత్వం వహించి తనకు సాటి ఎవరూ లేరని చాటారు.
అక్కినేని అంటే అభిమానం :
స్కూల్ డేస్ నుంచే అక్కినేని నాగేశ్వరరావు అంటే దాసరికి అభిమానం. తన ఫేవరెట్ హీరో ఆయనే అని పరిశ్రమకు వచ్చి లెజెండరీ డైరెక్టర్ గా మారినా ఎన్నో సార్లు ఆయన చెబుతూ వచ్చారు. తాతా మనవడు తో తొలి హిట్ కొట్టిన దాసరి ఆ తరువాత అనేక బడ్జెట్ చిత్రాలను తీసి వరసగా హిట్లు కొట్టారు. ఆయనకు నాటి అగ్ర హీరోలలో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే చాన్స్ మొదట వచ్చింది. అలా మనుషులంతా ఒక్కటే మూవీని దాసరి తీసి సూపర్ హిట్ కొట్టారు. అదే సమయంలో అక్కినేనికి దర్శకత్వం వహించే చాన్స్ వెంటనే వచ్చింది.
మళ్ళీ పుట్టాడు అంటూ :
అయితే అక్కినేని అంటే దాసరికి దేవదాస్ గుర్తుకు వస్తారు. అంతలా ఆ సినిమాలో అక్కినేని జీవించారు. దాంతో తాను అక్కినేనితో తీసే మొదటి సినిమా దేవదాస్ లాంటిదే కావాలనుకున్నారు. తన క్రియేటివిటీతో సరికొత్త కధ అల్లారు. అలా వచ్చిందే దేవదాస్ మళ్లీ పుట్టాడు. ఈ కధ అయితే చాలా నావల్టీగానే ఉంటుంది. పునర్జన్మల కధ అన్న మాట. దేవదాస్ మూవీలో ఆఖరులో దేవదాస్ చనిపోతాడు. అయితే పార్వతి బతికే ఉంటుంది. అలాగే చంద్రముఖికి దేవదాస్ ఒక మాట ఇస్తాడు. వచ్చే జన్మలో తాను ఆమెని పెళ్ళి చేసుకుంటాను అని. అలా దేవాస్ మళ్లీ పుట్టాడు కధ తయారు చేసుకున్నారు.
భారీ స్టార్ కాస్టింగ్ తో :
ఇక అక్కినేని పక్కన జయప్రద, అలాగే చంద్రముఖిగా వాణిశ్రీ, పాత దేవదాస్ లో ఉన్నట్లుగా ఇంకా బతికే ఉన్న పార్వతిగా సావిత్రిని తీసుకుని కధను బాగానే ప్రిపేర్ చేశారు అప్పటికి అది చాలా అడ్వాన్సుడ్ స్టోరీ. ఇక ఈ సినిమాకు సంగీతం ప్రదానం కావడంతో ఎస్ రాజేశ్వరరావుని తీసుకున్నారు. అక్కినేనికి పాటలను అప్పటికే ఎస్పీ బాలు పాడుతున్నారు. ఆయనకు జనామోదం కూడా లభించింది. అయినా సరే ఘంటసాలని పోలిన గొంతుక అని భావించి రామక్రిష్ణతో అన్ని పాటలు పాడించారు. ఇలా టెక్నికల్ గా ఎంతో ఖర్చు పెట్టి మరీ భారీ స్థాయిలో తీసిన దేవదాసు మళ్లీ పుట్టాడు మీద ఎన్నో అంచనాలు ఉండేవి. సినిమా సెట్స్ మీద ఉన్నపుడే అటు ఫ్యాన్స్ ఇటు పరిశ్రమ వర్గాలు కూడా ఎంతగానో ఎదురు చూసిన సినిమాగా చెప్పుకున్నారు.
ఆడియన్స్ రియాక్షన్ :
ఇక అన్నీ పూర్తి చేసుకుని 1978 మార్చి 23న అంటే ఇప్పటికి సరిగ్గా 48 ఏళ్ళ క్రితం దేవదాసు మళ్ళీ పుట్టాడు ఎంతో అట్టహాసంగా రిలీజ్ అయింది. తొలి రోజు తొలి షోకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే సినిమా చాలా లెంగ్తీగా ఉండడంతో పాటు స్లోగా ఉండడంతో జనాలు పెదవి విరిచారు. ఈ మూవీతో భారీ హిట్ కొట్టాలనుకున్న దాసరి ఆశలు అయితే ఫలించలేదు. ఏవరేజ్ టాక్ తో మూవీ నడచింది. అయితే దేవదాస్ స్పూర్తితో 1981లో దాసరి తీసిన ప్రేమాభిషేకం మాత్రం సూపర్ డూపర్ హిట్ అయి ఆయన కలలను సాకారం చేసింది. మొత్తం మీద చూస్తే దేవదాసు మళ్ళీ పుట్టాడు అన్నది ఒక మంచి ప్రయోగంగా మిగిలిపోయింది అని చెప్పాలి.
