Begin typing your search above and press return to search.

దసరాకి కొత్త చిత్రాల హడావిడి.. మెగాస్టార్ మొదలు రౌడీ హీరో..

టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

By:  Madhu Reddy   |   30 Sept 2025 11:05 AM IST
దసరాకి కొత్త చిత్రాల హడావిడి.. మెగాస్టార్ మొదలు రౌడీ హీరో..
X

టాలీవుడ్ సినీ పరిశ్రమకు సంక్రాంతి ఎంత పెద్ద పండుగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే సంక్రాంతి తర్వాత అంతే పెద్ద పండుగగా పేరు దక్కించుకుంది దసరా. ఈ పండుగకు ఏకంగా ప్రభుత్వం నుండి 10 రోజుల సెలవులు లభిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. అందుకే ఈ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలని స్టార్ హీరోలను మొదలుకొని యంగ్ హీరోలు కూడా తమ సినిమాలను రిలీజ్ చేస్తూ సక్సెస్ దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. ఇంకొంతమంది దుర్గామాత ఆశీర్వాదాలతో తమ సినిమా పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభించి కొత్త సినిమాలను ప్రకటిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది దసరాకు బాక్సాఫీస్ వద్ద ఎన్ని చిత్రాలైతే విడుదలవుతున్నాయో.. అదే రేంజిలో పలువురు స్టార్ హీరోలు కూడా తమ కొత్త సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరకు ఇలా చాలామంది హీరోలు ఈ దసరా సందర్భంగా తమ కొత్త సినిమా అనౌన్స్మెంట్ చేయడమే కాకుండా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించబోతున్నారు. మరి ఎవరు? ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు? ఆ చిత్రాల దర్శకులు ఎవరు? నిర్మాతలు ఎవరు..? సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

చిరంజీవి - బాబీ..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ' మన శంకర వరప్రసాద్ గారు' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. అలాగే ఈ సినిమా కంటే ముందు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ' విశ్వంభర' చేశారు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాలవల్ల వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడింది. ఈ రెండు చిత్రాల తర్వాత ఈయన యంగ్ డైరెక్టర్ బాబీకి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. దసరా సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కెవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. ఇకపోతే బాబీ - చిరంజీవి కాంబినేషన్లో ఇదివరకే 'వాల్తేరు వీరయ్య' సినిమా వచ్చి మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో అంచనాలు పెరిగిపోయాయి.


నాని - సుజీత్:

నేచురల్ స్టార్ నాని, ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో విడుదల కాబోతోంది. మరొకవైపు సుజీత్ ఇటీవల పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమా చేసి మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో నాని ఒక కొత్త సినిమా చేయనున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతోంది.. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ నిర్మాతలు ఇదివరకే నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేసి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలను దసరా రోజున నిర్వహించనున్నారు.. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కాబోతోంది.


విజయ్ దేవరకొండ - రవి కిరణ్ కోలా:

ప్రముఖ నిర్మాత దిల్ రాజు .. విజయ్ దేవరకొండ తో సినిమా కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రానికి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా దసరా పండుగ రోజు చాలా గ్రాండ్గా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది.