దసరా బరిలో ఎవరి రేంజ్ ఎంత?
2026 దసరా బాక్సాఫీస్ క్లాష్ ఈసారి దాదాపు రెండు వారాల పాటు సాగబోతోంది. అక్టోబర్ 9 నుంచి 16 వరకు చిన్న సినిమాలు, తెలుగు స్టార్ సినిమా, రెండు పెద్ద డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.
By: M Prashanth | 18 Sept 2026 11:18 AM IST2026 దసరా బాక్సాఫీస్ క్లాష్ ఈసారి దాదాపు రెండు వారాల పాటు సాగబోతోంది. అక్టోబర్ 9 నుంచి 16 వరకు చిన్న సినిమాలు, తెలుగు స్టార్ సినిమా, రెండు పెద్ద డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటి క్రేజ్ చూస్తే రజనీకాంత్ ‘జైలర్ 2’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ముందున్నాయి. అయితే మధ్యలో శ్రీ విష్ణు సినిమా కూడా తనకంటూ వేరే ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.
అక్టోబర్ 15న వచ్చే ‘జైలర్ 2’కు మంచి క్రేజ్ ఉంది. 2023లో ‘జైలర్’ తెలుగులోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. మరోవైపు అనిరుధ్ కాంబినేషన్ ఉండటంతో ఈసారి కూడా సాంగ్స్ తోనే కావలసిన బజ్ తొందరగానే రావచ్చు. బుక్‌మైషోలో ప్రస్తుతం 78 వేల మందికి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. డబ్బింగ్ సినిమా అయినా తెలుగు రాష్ట్రాల్లో స్క్రీన్స్ విషయంలో డామినేట్ చేసే అవకాశం ఉంది.
జైలర్ 2 తర్వాత రోజు అంటే అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ వస్తోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 1870ల నేపథ్యంతో రూపొందిన ఈ పీరియడ్ యాక్షన్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. విజయ్ రష్మిక జోడీ మళ్లీ కనిపించడం, భారీ స్కేల్‌లో సినిమా చేయడం వంటి అంశాలు ఫోకస్ తీసుకొచ్చాయి. బుక్‌మైషోలో 17 వేల మందికి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అదే అక్టోబర్ 16న ధనుష్ ‘ఓం: చాప్టర్ 1 ఉధిరం’ కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా లాంటి పెద్ద కాస్టింగ్ ఉంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు బుక్‌మైషోలో 52 వేల మందికి పైగా ఇంట్రెస్ట్ ఉంది. తెలుగు సినిమా కాకపోయినా కాస్టింగ్ వల్ల ఇక్కడ కూడా మంచి రిలీజ్ దక్కే అవకాశం ఉంది.
అక్టోబర్ 9 దగ్గర మాత్రం లెక్క వేరు. శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఇప్పటికే బయటకు వచ్చింది. 1992 ఆంధ్ర ఒడిశా బోర్డర్, నక్సల్ నేపథ్యం, థియేటర్ ఓనర్‌గా శ్రీ విష్ణు పాత్రతో కథను సెటప్ చేశారు. అదే రోజు ‘ఇట్లు అర్జున’ కూడా వస్తోంది. అనస్వర రాజన్ హీరోయిన్‌గా, వెంకీ కుడుముల నిర్మాతగా, తమన్ సంగీతంతో వస్తున్న ఈ సినిమాలో సాయి అనీష్ హీరో. ‘బా బా బ్లాక్ షీప్’ కూడా ఇప్పుడు అక్టోబర్ 9కే ఫిక్స్ అయింది;
ఇక ఈ దసరా రేసులో ముందుగా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచే వాళ్ళపై ఫోకస్ ఎక్కువగా పడుతుంది. ‘జైలర్ 2’ నుంచి ఇప్పటికే అనిరుధ్ మ్యూజిక్‌పై మంచి బజ్ ఉండగా, ‘రణబాలి’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌లోకి వెళ్లింది. అక్టోబర్ మొదటి వారం నుంచే ఈ రెండు సినిమాల ట్రైలర్లు, పాటలు వరుసగా వస్తే స్క్రీన్ డిమాండ్ కూడా అప్పుడే క్లియర్ అవుతుంది. మరోవైపు కామ్రేడ్ కళ్యాణ్, ఇట్లు అర్జున చిన్న సినిమాలు కావడంతో రిలీజ్‌కు ముందు ప్రీమియర్స్ లేదా స్పెషల్ షోలపై వెళ్లే అవకాశం ఉంది.
