సౌకర్యాలు లేవు.. జైలు జీవితంపై దర్శన్ కామెంట్స్!
అయితే తాజాగా బెంగళూరు కోర్టులో దర్శన్ భావోద్వేగంగా మాట్లాడుతూ న్యాయమూర్తి ముందు విజ్ఞప్తి చేశారు.
By: Madhu Reddy | 26 Sept 2025 11:44 AM ISTకన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట దర్శన్ ని బెంగళూరులోని బళ్లారి జైల్లో ఉంచారు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోకి పంపించారు. పరప్పన అగ్రహార జైలుకి వెళ్లినప్పటి నుండి దర్శన్ తనని ఈ జైలు నుండి మునుపటి జైల్లోకి మార్చండి అని ఎన్నోసార్లు కోర్టులో మొర పెట్టుకున్నారు. కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా కోర్టు ఆయన మాటల్ని పట్టించుకోవడం లేదు. బళ్లారి జైలుకి మార్చడం లేదు.
అయితే తాజాగా బెంగళూరు కోర్టులో దర్శన్ భావోద్వేగంగా మాట్లాడుతూ న్యాయమూర్తి ముందు విజ్ఞప్తి చేశారు. ఆయన కోర్టులో మాట్లాడుతూ.. "జైలు లోపల నేను ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తున్నాను. పేద జీవన పరిస్థితుల కారణంగా నా ఆరోగ్యం క్షీణిస్తోంది. కోర్టుకి ఎన్నిసార్లు చెప్పినా కూడా జైలు అధికారులు తనకు ప్రాథమిక సౌకర్యాలు అందించడం లేదు. 57వ సిటీ సివిల్ అండ్ సెషన్ కోర్టు న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. నన్ను ఇప్పటికీ క్వారంటైన్ సెల్ లో ఉన్నట్టే ఉంచుతున్నారు. బహిరంగ ప్రదేశాలలో తిరగడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఎండ తగలని ఇరుకైన ప్రాంతంలో మాత్రమే నన్ను నడవమని అనుమతిస్తున్నారు.
కానీ ఎండ తగలని ప్రదేశంలో నడవడం వల్ల నాకు చర్మ అలర్జీ వచ్చి చేతుల్లో ఫంగస్ ఏర్పడుతోంది.. జైలు సిబ్బందికి మంచం, దిండు ఇవ్వాలని కోర్టు ఆదేశించినప్పటికీ కూడా వాళ్లు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నాకు మంచం, దిండు ఇవ్వడం లేదు. కోర్టు సూచనలను జైలు అధికారులు పాటించడం లేదు. దీనివల్ల నేను దాదాపు 20సార్లకు పైగా ఈ సమస్యను బయటికి చెప్పాల్సి వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా జైలు సిబ్బంది నన్ను పట్టించుకోవడం లేదు" అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. అయితే జైలు ఆవరణలో నడవడానికి అనుమతించాలని దర్శన్ తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారు.
కోర్టు దర్శన్ తరఫు న్యాయవాది చెప్పిన మాటలను అంగీకరించింది. కానీ జైలు సిబ్బంది మాత్రం కోర్టు ఇచ్చిన సూచనలను పాటించడం లేదని దర్శన్ మరోసారి కోర్టులో చెప్పారు. అలాగే ఈ హత్య కేసులో తన ప్రమేయం లేదు అని, తన పేరుని వెంటనే హత్యా కేసు నుండి తొలగించాలని కోరుతూ దర్శన్ ఒక పిటిషన్ ని దాఖలు చేశారు.ఇక ఈ పిటిషన్ పై విచారణని న్యాయమూర్తి అక్టోబర్ 9కి వాయిదా వేశారు. మరి అక్టోబర్ 9న ఏం జరగబోతుందో చూడాలి.
