దిండు, దుప్పటి, మంచంకు అనుమతి!
తాజాగా కోర్టు కొన్ని సౌకర్యాల విషయంలో దర్శన్ కు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
By: Srikanth Kontham | 11 Sept 2025 1:20 PM ISTఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ పేరు మళ్లీ నెట్టింట వైరల్ గా మారుతోన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో? దర్శన్ మళ్లీ జైలుకు పరిమి తమవ్వడం.. అక్కడ ఇమడలేని దర్శన్ తన గోడును న్యాయమూర్తుల ముందు విన్నవించుకోవడం తెలిసిందే. తాజాగా కోర్టు కొన్ని సౌకర్యాల విషయంలో దర్శన్ కు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. జైలు నిబంధనల ప్రకారం దర్శన్ కు ప్రాధమిక సౌకర్యాలు కల్పించాలని బెంగుళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు జైలు అధికారులను ఆదేశించింది.
దర్శన్ రోజువారి సౌకర్యాలకు సంబంధించి రోజు వాకింగ్ చేసుకునే వెసులు బాటు కల్పించింది. అలాగే దిండు, దుప్పటి , మంచం కూడా అనుమతించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బెంగుళూరు నుంచి బళ్లారి జైలుకు తరలించాలని అధికారులు కోర్టును కోరగా, అభ్యర్దనను కోర్టు నిరాకరించింది.దీంతో ప్రస్తుతం ఉన్న జైలులోనే దర్శన్ కి వెసులు బాటులు కల్పించాలని ఆదేశించింది. దర్శన్ అరెస్ట్ అయిన కొత్తలో జైలు లో కూడా దర్శన్ కు అధికారులు సకల సౌకర్యాలు కల్పించినట్లు కొన్ని ఫోటోలు లీకైన సంగతి తెలిసిందే.
జైలులోనే స్నేహితుల్ని కలవడం...పార్టీ చేసుకోవడం వంటి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. డబ్బు, పలుకబడి ఉంటే? జైలులో కూడా బయట ఉన్నట్లే ఉంటుందని లీక్డ్ ఫోటోల రూపంలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే దర్శన్ కు బెయిల్ మంజూరు అవ్వడంతో బయటకొచ్చేసాడు.
అనంతరం రెండవ సారి జైలు కెళ్లడంతో అసలైన జైలు జీవితం ఎలా ఉంటుందో? అధికారులు కొన్ని రోజుల్లోకే రుచి చూపించినట్లు దర్శన్ ఇటీవల కోర్టుకు తన బాధను విన్నవించుకోవడంతో బయటకు వచ్చింది. తదుపరి విచారణలో ఈ కేసుకు సంబంధించి సాక్షులను కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో దర్శన్ అండ్ కో కి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే.
