Begin typing your search above and press return to search.

ఏరు దాటక ముందు ఓడ మ‌ల్ల‌న్న‌..దాటిన త‌ర్వాత బోడి మ‌ల్ల‌న్న‌!

సినిమా రంగంలో ప్రయాణం అంత తేలికగా సాగదు. పరిశ్రమలోకి కొత్తగా ప్రవేశించినప్పుడు నటీమణులకు దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్ల సాయం ఎంతో అవసరం.

By:  Srikanth Kontham   |   24 July 2026 8:30 AM IST
ఏరు దాటక ముందు ఓడ మ‌ల్ల‌న్న‌..దాటిన త‌ర్వాత బోడి మ‌ల్ల‌న్న‌!
X

`ఏరు దాటక ముందు ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న` అనే నానుడి సమాజంలో చాలా సంద‌ర్భాల్లో క‌నిపిస్తుంది. అవసరం ఉన్నప్పుడు ఎదుటివారిని ఆకాశానికి ఎత్తడం, పని అయిపోయాక పట్టించు కోకపోవడం అనేది కేవ‌లం సామాజిక జీవితానికే పరిమితం కాలేదు. సినీ పరిశ్రమలోనూ ఈ పోలిక అక్షరాలా సరిపోతుంది. రైజింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆప్యాయంగా పలకరించే కొందరు నటీమణులు..స్టార్‌డమ్ రాగానే చుట్టూ ఉన్నవారిని.. ప్రారంభంలో సపోర్ట్ చేసిన వారిని మ‌ర్చిపోవ‌డం ఇండస్ట్రీలో క‌నిపిస్తూనే ఉంటుంది.

సినిమా రంగంలో ప్రయాణం అంత తేలికగా సాగదు. పరిశ్రమలోకి కొత్తగా ప్రవేశించినప్పుడు నటీమణులకు దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్ల సాయం ఎంతో అవసరం. ఆ సమయంలో వారితో వినయంగా ఉండి ప్రతి ఒక్కరి మద్దతు కోరుకుంటారు. ఆ స‌మ‌యంలో వారికి ఆ వ్యక్తులే దేవుడిలా కనిపిస్తారు. ఏ కష్టమొచ్చినా? వెన్నంటి నిలిచే ఆ వ్యక్తుల సహకారంతోనే అగ్ర నాయికలుగా అవతరిస్తారు. కానీ అనుకున్న స్థాయికి చేరుకుని పెద్ద ప్రాజెక్ట్‌లు, కోట్లలో రెమ్యూనరేషన్ వచ్చాక వారి ప్రవర్తనలో మార్పులు విస్మయానికి గురి చేస్తాయి.

స్టార్‌డమ్ రాగానే కొందరు నటీమణులు గతాన్ని.. ఎదుగుదలకు కారణమైన వారిని ఇట్టే మ‌ర్చిపోతుంటారు. ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం.. సెట్స్‌లో తోటి నటీనటులతో.. టెక్నీషియన్లతో అహంకారంతో ప్రవర్తించడం పరిపాటిగా మారుతుంది. తాము ఈ స్థాయికి రావడానికి కారణం ఆనాడు తమకు అవకాశం ఇచ్చిన మేకర్స్ అని గ్రహించలేక.. తమ సొంత టాలెంట్ వల్లే ఎదిగామ‌నే భ్రమలో బ్ర‌తుకుతుంటారు. అవసరం ఉన్నప్పుడు ఒకలా? అవసరం తీరిన తర్వాత మరోలా? ప్రవర్తించే నటీమణుల తీరు ఇండస్ట్రీలో చాలా మందిని బాధిస్తుంటుంది.

ఇలాంటి స్వార్థపూరిత ప్రవర్తన స్వల్పకాలికంగా ఎంత కీర్తిని తెచ్చిపెట్టినా? దీర్ఘకాలంలో మాత్రం కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందన్న‌ది అంతే నిజం. పరిశ్రమ అందం, అభినయం మీద మాత్రమే ఆధారపడి నడవదు. మంచి వ్యక్తిత్వం, తోటి వారితో సత్సంబంధాలు కూడా అంతే ముఖ్యం. గర్వంతో ఇతరులను చిన్నచూపు చూడటం ప్రారంభిస్తుందో? అప్పుడే పతనం కూడా మొదలవుతుంది. పరిశ్రమలో రోజులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు. సక్సెస్ తలకెక్కి ప్రవర్తిస్తే భవిష్యత్తులో కష్టకాలం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రారనేది అక్షర సత్యం.

అయితే అందరూ నటీమణుల‌ను ఒకేలా ఉండ‌రు. కొందరు ఎంత ఎత్తుకు ఎదిగినా? మూలాలను, సాయం చేసిన వారిని మరువరు. అలాంటి వారే పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోయే నిజమైన స్టార్స్‌గా నిలుస్తారు. కానీ కొద్దిమంది మాత్రం స్వార్థం కోసం ఎదుటివారిని వాడుకుని అటుపై గుర్తింపు ఇవ్వకుండా ప్రవర్తించడం తో పరిశ్రమలో చెడ్డ పేరు మూట గట్టుకుంటారు.

గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే ఈ చీకటి కోణం అప్పుడ‌ప్పుడు మానవ సంబంధాల్లో ముఖం చాటేయ‌డాన్ని కళ్లకు కడుతుంది. సక్సెస్, పవర్ అనేవి మనుషులను ఎలా మారుస్తాయో? చెప్పడానికి ఈ ఉదంతాలు అద్దం లాంటివి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే గుణం కోల్పోయిన నాడు ఎంతటి మహారాణి అయినా? కాలం కింద పడేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.