Begin typing your search above and press return to search.

'స్టీవ్ జాబ్స్' బ‌యోపిక్‌లా క్యూరియాసిటీ పెంచే 'ఇంక్'

ఒక స‌ర‌ళ‌మైన క‌థ‌ను, రియ‌ల్ క‌థ‌ను అద్భుత‌మైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో చూపించ‌గ‌లిగే ప‌నిత‌నాన్ని ద‌ర్శ‌క‌త్వం అని నిర్వ‌చించ‌వ‌చ్చు.

By:  Sivaji Kontham   |   16 Nov 2025 8:00 PM IST
స్టీవ్ జాబ్స్ బ‌యోపిక్‌లా క్యూరియాసిటీ పెంచే ఇంక్
X

ఒక స‌ర‌ళ‌మైన క‌థ‌ను, రియ‌ల్ క‌థ‌ను అద్భుత‌మైన స్క్రీన్ ప్లే మాయాజాలంతో చూపించ‌గ‌లిగే ప‌నిత‌నాన్ని ద‌ర్శ‌క‌త్వం అని నిర్వ‌చించ‌వ‌చ్చు. అలాంటి నిర్వ‌చ‌నం డానీ బోయ్ లేకి వంద‌శాతం స‌రిపోతుంది. అత‌డు తెర‌కెక్కించిన `స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్` దానికి చ‌క్క‌ని ఉదాహ‌రణ‌. ముంబై మురికివాడ‌ల‌లో జీవించే పిల్ల‌ల ధైన్యం- ముష్ఠి మాఫియాను, అమితాబ్ హోస్టింగ్ చేస్తున్న కేబీసీకి ముడిపెట్టి ఈ సినిమాని అద్భుత‌మైన స్క్రీన్ ప్లేతో మ‌లిచిన తీరు ర‌క్తి క‌ట్టిస్తుంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆడియెన్ దీనిని వోన్ చేసుకుని ప్ర‌శంసించేంత‌గా తెరపైకి ఒక క‌థ‌ను తెచ్చారు డానీ బోయ్‌లే. దీనికి ఏ.ఆర్.రెహ‌మాన్ లాంటి ట్యాలెంట్ యాడైతే మ్యాజిక్ చేయ‌వ‌చ్చ‌ని ప్రూవ్ అయింది.

`స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్` త‌ర్వాత కూడా క్లాసిక్స్ ని ఎన్నిటినో తెర‌కెక్కించారు డానీ బోయ్‌లే. లేటెస్ట్ మూవీ `28 ఇయర్స్ లేటర్` ఈ కేట‌గిరీనే. ఈ సినిమా విజయం తర్వాత, డానీ బోయిలే వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక జర్నలిజం డ్రామాను తెర‌కెక్కించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. 1960లలో సాగే క‌థ‌తో రూపొందించ‌నున్న ఈ సినిమాకి `ఇంక్` అనే యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న టైటిల్ ని ఎంచుకున్నాడు. ఇది రూపెర్ట్ ముర్డోక్ మీడియా సామ్రాజ్యం- బ్రిటిష్ వార్తాపత్రిక `ది స‌న్‌`ఎడిటర్ లారీ లాంబ్ చుట్టూ తిరిగే నాటకీయ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సినిమా. ఇందులో మీడియా జ‌ర్న‌లిజంలో గొప్ప హైట్స్ ని చూసిన `ది స‌న్` ఉత్థాన‌ప‌త‌నాల చుట్టూ క‌థ తిరుగుతుంది. `ది స‌న్`ను రూప‌ర్డ్ మ‌ర్ధోక్ (గై పియ‌ర్స్ న‌టిస్తున్నారు) ఎలా స్వాధీనం చేసుకున్నాడు? రూప‌ర్డ్- క్లైర్ ఫోయ్- జాక్ ఓ కానెల్ (ఎడిట‌ర్ లాంబ్ పాత్ర‌ధారి) మ‌ధ్య క‌థ‌నం ఎలా సాగిందో తెర‌పై చూపిస్తున్నారు.

తాజాగా నిర్మాణ సంస్థ ఎడిట‌ర్ లాంబ్ పాత్ర‌ధారిగా న‌టించిన‌ కోనెల్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించింది. హౌస్ ప్రొడక్షన్స్, మీడియా రెస్, డెసిబెల్ ఫిల్మ్స్ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జేమ్స్ గ్రాహం ఈ చిత్రానికి స్క్రిప్టు రాసారు. ఇంక్ - కొత్త రకమైన వార్తల కోసం ఆలోచించే దార్శనికులు, అదే స‌మ‌యంలో అసమర్థుల గ్రూప్ పోరాటాల‌కు సంబంధించిన భావోద్వేగా మెలో డ్రామాతో సాగే చిత్ర‌మ‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నారు.

ఆపిల్ లెజెండ్ బయోపిక్ అయిన `స్టీవ్ జాబ్స్` తరహాలో `ఇంక్` కూడా బ‌యోపిక్ కేట‌గిరీకే చెందుతుంద‌ని ఒక అంచ‌నా. దీని కోసం స్క్రీన్ రైటర్ ఆరోన్ సోర్కిన్ స‌హ‌కారం తీసుకుంటున్నారు డానీ బోయ్‌లే. స్టీవ్ జాబ్స్ చిత్రానికి ప‌ని చేసిన సినిమాటోగ్రాఫర్ ఆల్విన్ హెచ్. కుచ్లర్ `ఇంక్` చిత్రానికి కూడా ప‌ని చేస్తుండడం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.