సల్మాన్ హీరోయిన్‌ని టచ్ చేసిన సౌత్ నిర్మాత ఎవరు?
ఈ జాబితాలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు చేరగా తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ డైసీషా చేరింది.
By: Ravindar Gorantla | 17 April 2026 6:00 PM ISTఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో బయటపెడుతూ తమకు ఎదురైన చేదు అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ సంచలన విషయాల్ని వెల్లడిస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పటికే చాలా మంది హీరోయిన్‌లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు చేరగా తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ డైసీషా చేరింది. అయితే దక్షిణాది దర్శక నిర్మాతలపై ఆరోపణలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దక్షిణాది చిత్రాల్లో నటించడం.. ఆ తరువాత కొన్నేళ్లకు అవకాశాలు తగ్గడంతో అక్కడి వారిపై విమర్శలు చేయడం బాలీవుడ్ హీరోయిన్‌లకు ఈ మధ్య అలావాటుగా మారింది.
ఆ మధ్య రాధికా ఆప్టే, తాప్సీ దక్షిణాదిపై విమర్శలు చేయడం తెలిసిందే. అయితే డైసీషా మాత్రం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో నటించిన డైసీ షా హేట్ 3 సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకుంది. అయితే ఓ దక్షిణాది సినిమా ఆడిషన్ టైమ్‌లో తనకు చేదు అనుభవం ఎదురైందని తెలిపి షాక్ ఇచ్చింది.
దక్షిణాది చిత్ర నిర్మాతలలో ఒకరు నన్ను దారుణంగా తాకారు. కాస్టింగ్ కోసం ముంబై వచ్చిన ఆయన హీరోయిన్‌ల ఎంపిక కోసం కొంత మందిని ఆడిషన్ కోసం రమ్మన్నారు. దాంతో ఆరు నుంచి ఏడుగురు అమ్మాయిలం ఆయన ఆడిషన్ కోసం వెళ్లాం. ఈ క్రమంలో ఆయన మాలోని ఒక్కొక్కరిని ఆయన విడి విడిగా కలుస్తున్నారు. ఆ సమయంలో నేను కూడా లోపలికి వెళ్లాను. ఆడిషన్ పేరుతో ఆయన నన్ను తాకడం, చేయి పట్టుకోవడం నాకు నచ్చలేదు` అని తెలిపింది డైసీషా.
నన్ను ఎవరైనా తాకితే నాకు భయంగా ఉంటుంది. నేను మసాజ్‌లు చేయించకోకపోవడానికి కారణం నన్ను మరొకరు తాకడం ఇష్టం లేకనే. ఒక మహిళ తాకినా నాకు నచ్చదు. ఇక పురుషులు తాకితే అంతే. అందుకే నాకు ఆయన తాకడం నచ్చలేదు. ఆడిషన్ తరువాత నేను ఆయనకు మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి వచ్చేశాను. ఆ తరువాత ఆయనకు ఫోన్ చేయలేదు` అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇన్‌ఫ్లూయెన్సర్ కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడం, టాలీవుడ్ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.
