టాప్ స్టోరి: ఫిలింఛాంబర్ కొత్త అధ్యక్షుడికి సవాళ్లు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కొత్త అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు.
By: Sivaji Kontham | 29 Dec 2025 11:00 PM ISTతెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కొత్త అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఆయన సారథ్యంలోని కొత్త ఈసీ బాడీ అధికారం చేపట్టింది. ఈసారి ఎన్నికల్లో సీనియర్లు అయిన యాక్టివ్ నిర్మాతల ఆధిపత్యం కొనసాగింది. క్రియాశీల నిర్మాతలు ఇప్పుడు ఛాంబర్ పై పూర్తి పట్టు సాధించారు. పరిశ్రమకు ఏది అవసరమో అది అందించే నాయకత్వం కావాలని నిర్మాతలతో పాటు మొత్తం పరిశ్రమ కోరుకుంటున్న సమయంలో యాక్టివ్ గిల్డ్ (ప్రొగ్రెస్సివ్) నిర్మాతలకు పట్టంగట్టారు.
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు 2025 నుండి 2027 కాలానికి TFCC కొత్త అధ్యక్షుడిగా పలు సంస్కరణలు తీసుకుని వస్తారని నిర్మాతలు, పరిశ్రమ నాలుగు సెక్టార్ల సభ్యులు ఆశిస్తున్నారు. ఆయన అపార విజ్ఞానం, ప్రశాంతమైన నాయకత్వం, వృత్తిపరమైన అనుభవాలు అందరికీ ఉపకరిస్తాయని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తారని ఇప్పుడు పరిశ్రమ నమ్ముతోంది.
సినిమాల నిర్మాణం, పంపిణీ రంగం, ఎగ్జిబిషన్, స్టూడియోల నిర్వహణలో అపార విజ్ఞానం, అనుభవం ఉన్న డి.సురేష్ బాబుకు పరిశ్రమ సమస్యలు అన్నీ తెలుసు. అందువల్ల ఆయన స్పష్ఠమైన పరిష్కారం అందిస్తారనే బలమైన నమ్మకం పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తోంది. ఇండస్ట్రీకి దీర్ఘకాలంగా ఆయన చేసిన కృషికి తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప గౌరవాన్ని అందుకుంటున్నారు. పరిశ్రమలోని చాలా మంది ఆయనను న్యాయబద్ధమైన పారదర్శక నిర్ణయం తీసుకునే వ్యక్తిగా భావిస్తున్నారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యజమానులు, స్టూడియోల నిర్వాహకులు ఇప్పుడు సమస్యల పరిష్కార భారాన్ని ఆయనపై మోపారు.
ఈ ఎన్నికలలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ -మన ప్యానెల్ పోటీబరిలో నిలవగా కార్యనిర్వాహక కమిటీ ఫలితాల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన మెజారిటీని గెలుచుకుంది. ప్రోగ్రెసివ్ ప్యానెల్ 44 సీట్లలో 28 సీట్లను గెలుచుకుందని, మన ప్యానెల్ మిగిలిన సీట్లను గెలుచుకుందని కథనాలొచ్చాయి. ఈ ఎన్నికల్లో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఆయన కొత్త తరం నిర్మాతలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేటి జెన్ జెడ్ కంటెంట్ ఆధారిత చిత్రాలకు మద్దతునివ్వడం ద్వారా యువనిర్మాత వంశీకి పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. ఏడాది పొడవునా, వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ప్రముఖుడిగా వంశీకి ప్రత్యేక గౌరవం ఉంది. సినిమాల నిర్మాణం, మార్కెటింగ్, ప్రమోషన్స్ లో ఆయన నైపుణ్యంపై చాలా చర్చ సాగుతుంది. సమస్యల పరిష్కారానికి ఆయన చొరవ చూపగలరని నవతరం నిర్మాతలంతా భావిస్తున్నారు. అలాగే భరత్ చౌదరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వగా, జెమిని కిరణ్ స్టూడియో రంగం నుండి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన ఆఫీస్ బేరర్లలో కార్యదర్శిగా అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీలుగా మోహన్ వడ్లపట్ల, విజయేందర్ రెడ్డి, కోశాధికారిగా ముత్యాల రాందాస్ ఉన్నారు. కొత్త కార్యనిర్వాహక కమిటీ 2027 వరకు కొనసాగుతుంది.
పండగ సమయంలో సినిమాల రిలీజ్ ల సమయంలో థియేటర్ల సమస్యను కొత్త కమిటీ పరిష్కరించాల్సి ఉంటుంది. అలాగే ఓటీటీ, శాటిలైట్ రంగాల్లో వినూత్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాతలకు మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టికెట్ రేట్ల విషయంలో సరైన మార్గదర్శనంతో మెజారిటీ ప్రజలను థియేటర్లకు రప్పించేందుకు కొత్త వ్యూహాల్ని అనుసరించాల్సి ఉంటుంది. కార్మిక ఫెడరేషన్ తో కొన్ని సమస్యలున్నాయి. 24 శాఖల కార్మికుల భత్యాల పెంపు గురించిన పోరాటాల సమయంలో వారికి న్యాయం చేయాల్సి ఉంటుంది. కొత్త ఈసీ బృందం ఐక్యత, పారదర్శకతతో వ్యవహరిస్తూ, చిన్న చిత్రాలకు మద్దతునివ్వాలని కూడా కోరుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో మెరుగైన సమన్వయంపై దృష్టి సారించాలని భావిస్తున్నారు.
