Begin typing your search above and press return to search.

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

డఫ్నే కీన్ హాలీవుడ్‌లో బాలనటిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టారు. 11-13 ఏళ్ల వయసులో సినిమా పార్టీలకు వెళ్లినప్పుడు కొందరు తనకు కొకైన్ వంటి మత్తు పదార్థాలను ఆఫర్ చేశారని వెల్లడించారు. అయితే వాటిని తిరస్కరించి మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ‘లోగన్’ షూటింగ్ సమయంలో హ్యూ జాక్‌మన్ తనకు తండ్రిలా అండగా నిలిచి, ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు. బాలనటుల భద్రతపై ఆమె వ్యాఖ్యలు మరోసారి హాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి.

By:  Srikanth Kontham   |   6 Nov 2026 8:00 PM IST
ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!
X

హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాలనటులకు ఎదురయ్యే చీకటి కోణాలు, ఎదుగుతున్న వయస్సులో ఎదురయ్యే అనుభవాలపై ప్రముఖ నటి డఫ్నే కీన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 11 సంవత్సరాల చిన్న వయసులోనే హుగ్ జాక్మాన్ సరసన `లోగన్` చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న డఫ్నే తాజాగా ఓ పాడ్‌కాస్ట్ లో తాను ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్నారు. చిన్నతనంలోనే హాలీవుడ్ పార్టీలు ..సెలబ్రేషన్స్‌కు హాజరైనప్పుడు తనకు ఎదురైన విచిత్రమైన, దిగ్భ్రాంతికరమైన పరిస్థితులను బయటపెట్టారు.

డఫ్నే కీన్ మాట్లాడుతూ 11, 12, 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే పలు సినిమాల రాప్ పార్టీలకు వెళ్లినట్లు తెలిపారు. ఆ సమయంలో అక్కడ కొందరు తనకు కొకైన్ వంటి మత్తు పదార్థాలను ఆఫర్ చేశారని సంచలన నిజాలు వెల్లడించారు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో ఇలాంటి మాదకద్రవ్యాల సంస్కృతిని దగ్గరగా చూసినందువల్ల తనకు వాటిపై ఎప్పుడూ ఎలాంటి ఆసక్తి కలగలేదని స్పష్టం చేశారు. అదృష్టవశాత్తూ తాను అలాంటి వాటికి దూరంగా ఉంటూ వాటిని తిరస్కరించానని ఇప్పటికీ ఆల్కహాల్ లేదా ఇతర సబ్‌స్టాన్సెస్‌కు దూరంగానే ఉంటానని డఫ్నే పేర్కొన్నారు.

అయితే చిత్ర పరిశ్రమలో చిన్న వయసులోనే అడుగుపెట్టిన నటీనటులు ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొంటారో చెప్పడానికి ఈ ఉదంతం అద్దం పడుతోంది. చైల్డ్ ఆర్టిస్టులు రక్షణ లేని వాతావరణంలోకి వెళ్లినప్పుడు ఎలాంటి ప్రలోభాలకు గురయ్యే అవకాశాలుంటాయో డఫ్నే చేసిన వెల్లడి మరోసారి హాలీవుడ్‌లో చర్చకు దారితీసింది. ఎంతోమంది బాలనటులు సరైన మార్గదర్శకత్వం లేక ఇలాంటి వ్యసనాల బారిన పడుతున్న తరుణంలో డఫ్నే కీన్ చిన్న వయసులోనే పరిణతితో వ్యవహరించి వాటికి దూరంగా ఉండటం ప్రశంసనీయమని నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఈ క‌ష్ట‌మైన ప్రయాణంలో కో-స్టార్ హుగ్ జాక్మాన్ అందించిన మద్దతును ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. `లోగన్` చిత్ర షూటింగ్ సమయంలో హుగ్ జాక్మాన్ తనకు నిజమైన తండ్రిలా అండగా నిలిచారని భావోద్వేగంతో పంచుకున్నారు. సెట్స్‌లో పని వేళలు ఎవరూ దుర్వినియోగం చేయకుండా తాను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకున్నారని చెప్పారు. తెర వెనుక జరిగే ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు తన వరకు రాకుండా ఒక షీల్డ్ లాగా కాపాడారని.. ఆయనలాంటి కో-స్టార్ దొరకడం త‌న అదృష్టమని ప్రశంసించారు.

ప్రస్తుతం 21 సంవత్సరాల వయసున్న డఫ్నే కీన్ చిన్ననాటి ఆ చేదు అనుభవాలను దిగమింగుతూ కెరీర్‌లో విజ యవంతంగా ముందుకు సాగుతున్నారు. `డెడ్‌పూల్ అండ్ వోల్వెరిన్` చిత్రంలో మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె `ది అకలైట్`, `పెర్సీ జాక్సన్ అండ్ ది ఒలింపియన్స్` వంటి క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకు పోతున్నారు. చిన్నతనంలో మత్తు పదార్థాల ప్రలోభాలను ఎదుర్కొని వ్యక్తిగత విలువలను కోల్పోకుండా నిలబడిన ఆమె ప్రయాణం యువతకు ..బాలనటులకు స్ఫూర్తిదాయకం అని చెప్పొచ్చు.

హాలీవుడ్ గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే చీకటి కోణాలను డఫ్నే కీన్ నిస్సంకోచంగా బయటపెట్టడం చిత్ర పరిశ్రమలోని పెద్దలకు కనువిప్పు కలిగించే విషయం. బాలనటుల భద్రత, మానసిక ఆరోగ్యం ,వారిని రక్షించాల్సిన బాధ్యత మేకర్స్ ..సీనియర్ నటులపై ఎంతైనా ఉందని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. హుగ్ జాక్మాన్ లాంటి పెద్ద నటులు తోటి నటులకు రక్షణగా నిలిస్తే ఇండస్ట్రీలో చిన్న వయసులోనే అడుగుపెట్టే ఎంతో మంది ప్రతిభావంతులు సురక్షితంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.