Begin typing your search above and press return to search.

DPIFF Awards 2026: ధురంధర్‌కు అవార్డుల పంట.. రణ్‌వీర్ సింగ్, అనీత్ పడ్డా నుంచి టేలర్ స్విఫ్ట్ వరకు విజేతలు వీరే!

2026 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ‘ధురంధర్’ సత్తా చాటింది. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా, రణ్‌వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడిగా, ఆదిత్య ధర్‌కు ఉత్తమ దర్శకుడిగా అవార్డులు దక్కాయి. ‘సైయారా’తో అనీత్ పడ్డా ఉత్తమ నటిగా నిలవగా, ‘కాంతార: చాప్టర్ 1’ క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. ఇళయరాజాకు ప్రత్యేక గౌరవం లభించింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   21 Nov 2026 12:01 PM IST
DPIFF Awards 2026: ధురంధర్‌కు అవార్డుల పంట.. రణ్‌వీర్ సింగ్, అనీత్ పడ్డా నుంచి టేలర్ స్విఫ్ట్ వరకు విజేతలు వీరే!
X

2026 దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్‌లో పలువురు సినీ ప్రముఖులు సత్తా చాటారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు, ఓటీటీ నుంచి అంతర్జాతీయ సినిమా రంగం వరకు ఎన్నో విభాగాల్లో ప్రతిభ చూపిన నటీనటులు, దర్శకులు, సంగీత కళాకారులకు ఈ వేడుకలో పురస్కారాలు అందాయి. నవంబర్ 20న ముంబైలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమంలో ధురంధర్, సైయారా, కాంతార: చాప్టర్ 1 సినిమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును రణ్‌వీర్ సింగ్ సొంతం చేసుకున్నారు. ధురంధర్ సినిమాలో ఆయన నటనకు ఈ గుర్తింపు లభించింది. ఇదే సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు కూడా దక్కింది. దర్శకుడు ఆదిత్య ధర్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఒకే సినిమాతో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు వంటి కీలక అవార్డులను అందుకోవడం విశేషం.

మరోవైపు సైయారా సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన అనీత్ పడ్డా ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. కాంతార: చాప్టర్ 1 కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు క్రిటిక్స్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు లభించగా, రిషబ్ శెట్టి క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్‌గా నిలిచారు. హక్ సినిమాలో నటనకు యామీ గౌతమ్ ధర్ క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్నారు.

ఇక ధురంధర్లో ప్రతినాయకుడి పాత్రలో ఆకట్టుకున్న అక్షయ్ ఖన్నాకు బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ పురస్కారం దక్కింది. ఛావా సినిమాకు గాను వినీత్ కుమార్ సింగ్ ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు. హౌస్‌ఫుల్ 5లో కామెడీతో అలరించిన రితేశ్ దేశ్‌ముఖ్ ఉత్తమ హాస్య నటుడి అవార్డును గెలుచుకున్నారు.

ఓటీటీ విభాగంలోనూ పలువురు విజేతలుగా నిలిచారు. పాతాళ్ లోక్ 2లో నటనకు జైదీప్ అహ్లావత్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఢిల్లీ క్రైమ్ 3లో నటనకు షెఫాలీ షా ఉత్తమ నటిగా, హ్యూమా ఖురేషీ నెగటివ్ రోల్ విభాగంలో గుర్తింపు పొందారు.

అంతర్జాతీయ విభాగంలో అవతార్: ఫైర్ అండ్ యాష్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. సిన్నర్స్ సినిమాకు మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడిగా, హ్యామ్‌నెట్కు జెస్సీ బక్లీ ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు.

సంగీత విభాగంలో సైయారా టైటిల్ సాంగ్‌కు సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ధురంధర్కు సంగీతం అందించిన శాశ్వత్ సచ్‌దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ఫహీమ్ అబ్దుల్లా ఉత్తమ నేపథ్య గాయకుడిగా, ఇర్షాద్ కామిల్ ఉత్తమ గేయ రచయితగా నిలిచారు. సంగీత రంగానికి చేసిన సేవలకు ఇళయరాజాకు ప్రత్యేక గౌరవం దక్కింది.