డెకాయిట్ కొత్తగా ఉంది.. బ్లాక్ బస్టర్ హిట్ పక్కా!: వెంకీ
ఆ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమా టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
By: M Prashanth | 8 April 2026 10:45 AM ISTటాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ డెకాయిట్ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త దర్శకుడు షానియల్ డియో ఆ చిత్రంతో పరిచయం అవుతుండగా, అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా ఉన్నారు. ఏప్రిల్ 10న ప్రపంచ
వ్యాప్తంగా విడుదల కానున్న ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా గ్రాండ్ గా జరిగింది.
ఆ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. సినిమా టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. 'అందరూ నేను సుప్రియ కోసం వచ్చానని అనుకుంటున్నారు కానీ, నిజానికి సురేంద్ర మావయ్య కోసం వచ్చాను. ఆయన నాకు చాలా స్పెషల్. సుప్రియ ఆ బ్యానర్ లో ఇంత మంచి సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని సినిమాలు మొదలైనప్పుడు మంచి ఫీలింగ్ ఇస్తాయి. డెకాయిట్ అలాంటి సినిమా. టీమ్ లోని ప్రతి ఒక్కరు ప్యాషన్‌తో పని చేశారు. మంచి సినిమా చేయాలనే తపన అందరిలో కనిపిస్తోంది' అన్నారు.
అది కొత్తగా ఉంది!
అడివి శేష్ పై వెంకటేష్ ప్రత్యేకంగా స్పందిస్తూ, 'పంజా సినిమా నుంచి శేష్ ప్రతిభ కనిపించింది. తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. డెకాయిట్ కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇది మృణాల్ కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని నమ్ముతున్నా' అని చెప్పారు. ట్రైలర్ చూసినప్పుడే సినిమా హిట్ అవుతుందని భావించానని, లవ్ స్టోరీలో ఇంత యాక్షన్ యాడ్ చేయడం చాలా కొత్తగా ఉందని పేర్కొన్నారు.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. సినిమా కోసం టీమ్ చేసిన కష్టాన్ని వివరించారు. 'డెకాయిట్ నా హృదయానికి దగ్గరైన ప్రాజెక్ట్. సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. డైరెక్టర్ షానియల్ ఇంకా పని చేస్తూనే ఉన్నారు. ఓవర్సీస్ ప్రింట్ పంపడానికి కూడా చివరి నిమిషం వరకు పనిచేస్తున్నారు. ఇది మా ఇద్దరి కల. ఈ ప్రయాణంలో సుప్రియ గారి సపోర్ట్ ఎంతో కీలకం' అని చెప్పారు.
ఇంటర్వెల్ బ్లాక్ లో హైలైట్!
తాను ఐదు సినిమాలు చేసి ఆగిపోవాలనుకున్న సమయంలో ప్రేక్షకుల ప్రేమ తనను ఇక్కడికి తీసుకొచ్చిందని శేష్ అన్నారు. 'సినిమాలో మేమెంత ప్రేమ పెట్టామో ప్రేక్షకులు చూస్తారు. రెండు సంవత్సరాల కష్టానికి ఇది ఫలితం. ఏప్రిల్ 10న మీరందరూ ఒక నిజాయితీ గల సినిమా చూస్తారు' అని తెలిపారు. మృణాల్ పాత్ర ఇంటర్వెల్ బ్లాక్ లో హైలైట్ అవుతుందని, ఆ ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ, 'సినిమా చేయడానికి ప్రధాన కారణం కథ. సరస్వతి పాత్ర నా కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుంది. శేష్ తో పని చేయడం అద్భుతమైన అనుభవం. డైరెక్టర్ షానియల్ ఎంతో కష్టపడ్డారు. సుప్రియ గారు చాలా కేరింగ్ ప్రొడ్యూసర్. వెంకటేష్ గారి ముందు మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నా' అని తెలిపారు.
సుప్రియ చాలా కష్టపడే వ్యక్తి: సుమంత్
హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, 'శేష్ సినిమా అంటే మన అందరి సినిమా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ చిత్రంతో కొత్త స్టాండర్డ్ సెట్ చేశారు. మృణాల్ నటన ఎంతో నిజాయితీగా ఉంటుంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. అనురాగ్ కశ్యప్ ను ప్రేరణగా అభివర్ణించారు. హీరో సుమంత్ మాట్లాడుతూ, 'సుప్రియ చాలా కష్టపడే వ్యక్తి. సినిమా కోసం ఆమె తన బెస్ట్ ఇచ్చింది. శేష్ నా బెస్ట్ ఫ్రెండ్. అతని సినిమాలంటే నాకు ఎంతో నమ్మకం' అన్నారు. మృణాల్ కు ఇది సీతారామం తరహాలో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందని అభిప్రాయపడ్డారు.
నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ, 'మా బ్యానర్‌లో మరో మంచి సినిమా తీయాలనే కోరికతో డెకాయిట్ ప్రారంభించాను. సినిమా కోసం రెండు సంవత్సరాలు కష్టపడ్డాం. మా కుటుంబ భావోద్వేగాలతో లోగో డిజైన్ చేశాం' అని వివరించారు. సుమంత్ డెకాయిట్ చిత్రానికి సైలెంట్ ప్రొడ్యూసర్ గా సహకరించారని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ, 'నా కెరీర్ లో కీలక మలుపులు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే ప్రారంభమయ్యాయి. శేష్ గారి అభ్యర్థనతో ఈ సినిమాలో పనిచేశాను. పాటలు అద్భుతంగా వచ్చాయి' అని అన్నారు.
ఇతర నిర్మాతలు, దర్శకులు కూడా సినిమా పై విశ్వాసం వ్యక్తం చేశారు. రాహుల్ రవీంద్ర మాట్లాడుతూ.. సినిమా ఇప్పటికే చూశానని, ఇది కచ్చితంగా హిట్ అవుతుందని చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని, శశికిరణ్ తిక్క, శౌర్యువ్ తదితరులు కూడా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి, డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా పై భారీ అంచనాలు మరింత పెంచింది. టీమ్ మొత్తం చూపిస్తున్న నమ్మకం, ప్యాషన్ చూస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
