ట్రెండీ స్టోరి: భారతదేశంలో మొసలి వేట నేపథ్య సినిమాలు
ఇప్పుడే ప్రత్యేకంగా మొసలి నేపథ్య సినిమా గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరమేంటి? అంటే... బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక ప్రయోగం జరుగుతోంది.
By: Sivaji Kontham | 11 Feb 2026 7:00 AM ISTకొలనులో మొసలి ఆకలితో క్రూరంగా ఎదురు చూస్తుంటుంది... ఆ సమయంలో పొరపాటున కొలనులో జారి పడినా లేదా ఎవరైనా తోసేసినా, ఇంకేదైనా ప్రమాద వశాత్తూ మనుషులు నీళ్లలో పడి దానికి చిక్కితే ఏమవుతుందో ఊహిస్తున్నారా? పెంచి పోషించి శిక్షణనిచ్చిన గురువునే మొసలి క్రూరంగా చంపి తిన్న ఘటన గురించి గతంలో కథనాలొచ్చాయి. మొసళ్ల భారిన పడి మరణించేవారి సంఖ్య గురించి అధికారిక లెక్కలు కూడా ఉన్నాయి.
అయితే మొసలి వేట నేపథ్యంలో సినిమాలు వచ్చి ప్రేక్షకులను రంజింపజేసిన చరిత్ర కూడా మనకు ఉంది. ముఖ్యంగా యాక్షన్ కింగ్ అర్జున్ తన కెరీర్ తొలి నాళ్లలో నటించిన క్రొకడైల్ (మొసలి) నేపథ్య సినిమా అప్పట్లో తమిళం, తెలుగులో బంపర్ హిట్ కొట్టింది. ఆ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్, తన చెల్లిని చంపిన మొసలిని అంతమొందించాలనుకునే కథానాయకుడి కథ రక్తి కట్టించాయి.
ఇప్పుడే ప్రత్యేకంగా మొసలి నేపథ్య సినిమా గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరమేంటి? అంటే... బాలీవుడ్ లో చాలా కాలం తర్వాత ఇలాంటి ఒక ప్రయోగం జరుగుతోంది. నటవారసురాలు సనయ కపూర్- ఆదర్శ్ గౌరవ్ జంటగా నటించిన `యు యా మైన్` మొసలి నేపథ్య కథతో రక్తి కట్టించబోతోందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
మొసలి (క్రొకొడైల్) వేట, సర్వైవల్ థ్రిల్లర్ల నేపథ్యం భారతీయ సినిమాల్లో చాలా అరుదు. కానీ కొన్ని గుర్తుండిపోయే చిత్రాలు వచ్చాయి. యాక్షన్ కింగ్ అర్జున్ కన్నడలో నటించిన `మళె బంతు మళె` (1984) సినిమాలో ఒక భారీ మొసలితో పోరాడే సన్నివేశం చాలా కాలం ఆడియెన్ ని వెంటాడింది. ఎంతగా అంటే కలలో కూడా భయపడేంతగా. ఇందులో మొసలిని చంపడానికి అర్జున్ చేసే సాహసాలు హైలైట్. ఆ తర్వాత ఆయన నటించిన పలు యాక్షన్ సినిమాల్లోనూ ఇలాంటి జంతువులతో పోరాటాల్ని తెరకెక్కించారు. తెలుగులోను ఈ సినిమా అనువాదమై విడుదలైంది.
బాలీవుడ్‌లో మొసలి నేపథ్య సినిమాలు**
బాలీవుడ్‌లో మొసలి ప్రధాన పాత్రలో కనిపించే సినిమాలు కొన్ని ఉన్నాయి. రేఖ నటించిన `ఖూన్ భరీ మాంగ్` (1988) మొసలి దాడి కథతో రూపొందింది. భర్త ఆమెను మొసళ్లు ఉన్న నీటిలో నెట్టేయడం, ఆమె ముఖం పాడైపోవడం, ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీతో తిరిగి వచ్చి రివెంజ్ తీర్చుకోవడం ఈ సినిమా కథ. ఆ తర్వాత షాన్ అనే చిత్రం 1990లో వచ్చింది. ఇందులో విలన్ షాకాల్ తన శత్రువులను చంపడానికి కోటలోని ఒక కొలనులో మొసలిని పెంచుతుంటాడు. మొహెంజో దారో (2016) చిత్రంలో హృతిక్ రోషన్ ప్రారంభ సన్నివేశంలో ఒక భారీ మొసలిని వేటాడే సీన్ గ్రాఫిక్స్‌తో అద్భుతంగా ఉంటుంది.
ఇప్పుడు షానాయా కపూర్ - ఆదర్శ్ గౌరవ్ సినిమా `తు యా మైన్` మొసలి నేపథ్య థ్రిల్లర్ సినిమా. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు (షనాయా - మిస్ వానిటీ, ఆదర్శ్ గౌరవ్ - మారుతి కడమ్) కలిసి ఒక అడ్వెంచర్ కొలాబ్ కోసం వెళ్తారు. కానీ అనుకోకుండా ఒక పాడుబడిన స్విమ్మింగ్ పూల్ .. అక్కడ మారుమూల ప్రాంతంలో ఒక భయంకరమైన మొసలి బారిన పడతారు. ఆ క్రూర మృగం నుండి వారు ఎలా తప్పించుకున్నారు అనేదే ఈ సినిమా కథ. షైతాన్, వజీర్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించిన బిజోయ్ నంబియార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ నిర్మాతలు. ఫిబ్రవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.
ఇటీవల కాలంలో ఇండియన్ స్క్రీన్ పై క్రియేచర్ ఫీచర్ (జంతువుల చుట్టూ తిరిగే) సినిమాలు రాలేదు. హాలీవుడ్ సినిమా `బ్లాక్ వాటర్`, `క్రాల్` తరహాలో పూర్తిస్థాయి సర్వైవల్ థ్రిల్లర్ కథతో ఇది ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఇది ఒక మంచి థ్రిల్లిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నారు.
హాలీవుడ్ క్లాసిక్ చూసారా?
హాలీవుడ్ సినిమా `బ్లాక్ వాటర్` కథ వివరాల్లోకి వెళితే... ఈ చిత్రం 2007లో వచ్చిన ఆస్ట్రేలియన్ సర్వైవల్ హారర్ ఫిలిం. ఉత్తర ఆస్ట్రేలియాలోని చిత్తడి నేలల్లో ఒక భారీ మొసలి బారిన పడిన ముగ్గురు వ్యక్తుల కథ. ఇది వాస్తవ ఘటనల ఆధారంగా తీశారు. షనాయా కపూర్ సినిమా కూడా ఇలాంటి ఉత్కంఠభరితమైన `మ్యాన్ వర్సెస్ వైల్డ్` థీమ్‌తో ఉండబోతోందని సమాచారం.
