హాలీవుడ్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్..!
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఈ సినిమా సిరీస్ అంటే వేగవంతమైన కార్లు.. భారీ యాక్షన్ సన్నివేశాలు.. అలాగే కుటుంబ బంధాలపై బలమైన మెసేజ్ గుర్తుకు వస్తాయి.
By: Priya Chowdhary Nuthalapti | 19 Dec 2025 11:09 AM ISTహాలీవుడ్ సినిమాలు అంటే కేవలం అక్కడే కాదు మన ఇండియాలో కూడా ఎంతో పాపులారిటీ ఉంది. ముఖ్యంగా కొన్ని సినిమా సిరీస్ లకు ఇక్కడ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందులో ఒకటి
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఈ సినిమా సిరీస్ అంటే వేగవంతమైన కార్లు.. భారీ యాక్షన్ సన్నివేశాలు.. అలాగే కుటుంబ బంధాలపై బలమైన మెసేజ్ గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఈ పాపులర్ ఫ్రాంచైజ్ మరోసారి.. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. ఫుట్‌బాల్ ప్రపంచంలో లెజెండ్‌గా.. నిలిచిన క్రిస్టియానో రొనాల్డో అధికారికంగా ఫాస్ట్ ఎక్స్: పార్ట్ 2 సినిమాలో చేరడం దీనికి ప్రధానమైన కారణం.
ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే.. అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడాకారుల్లో ఒకరు అన్న విషయం తెలిసిందే. వివిధ దేశాల్లో కోట్లాది మంది ఆయనకు అభిమానులు ఉన్నారు.
అలాంటి స్టార్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టడం.. అది కూడా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి భారీ ఫ్రాంచైజ్‌లో చేరడం ఒక చారిత్రక సంఘటనగా చెప్పొచ్చు. అయితే ఆయన ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయం ఇంకా బయటకు రాలేదు. అయినప్పటికీ అభిమానులు ఇప్పటికే రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.
ఈ సిరీస్‌లో చాలాకాలంగా నటిస్తున్న నటుడు టైరీస్ గిబ్సన్ సోషల్ మీడియాలో.. తన ఆనందాన్ని పంచుకున్నారు. రొనాల్డోను ‘ఫాస్ట్ ఫ్యామిలీ’లోకి స్వాగతిస్తూ.. ఇది ఫ్రాంచైజ్‌కు చాలా పెద్ద మైలురాయిగా చెప్పుకొచ్చారు. షూటింగ్ సెట్ నుంచి వచ్చిన ఒక ఫోటోలో క్రిస్టియానో రొనాల్డో, విన్ డీజిల్, డ్వేన్ జాన్సన్, జేసన్ స్టాథమ్, మిషెల్ రోడ్రిగ్స్, లుడాక్రిస్ వంటి స్టార్‌లు కనిపించడంతో అది వెంటనే వైరల్‌గా మారింది.
ఫ్రాంచైజ్‌కు ముఖచిత్రంగా నిలిచిన విన్ డీజిల్ కూడా రొనాల్డో పాత్ర గురించి స్పందించారు. రొనాల్డో కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్‌ను రాసినట్టు ఆయన వెల్లడించారు. నిబద్ధత, బలం, టీమ్ వర్క్ వంటి విలువలతో నడిచే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ప్రపంచానికి రొనాల్డో అద్భుతంగా సరిపోతాడని డీజిల్ చెప్పారు.
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ 2001లో స్ట్రీట్ రేసింగ్ కథగా మొదలైంది. కాలక్రమంలో ఇది ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న భారీ యాక్షన్ సిరీస్‌గా మారింది. ఇప్పటివరకు 10 ప్రధాన సినిమాలు, కొన్ని స్పిన్-ఆఫ్ చిత్రాలు విడుదలయ్యాయి. మొత్తం మీద ఈ ఫ్రాంచైజ్ 7 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది.
ఫాస్ట్ ఎక్స్: పార్ట్ 2 ఈ ప్రధాన కథకు చివరి భాగంగా ఉండనుందని సమాచారం. ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
