సేల్స్ గర్ల్‌ని ప్రేమించి ఐదుగురిని కన్న ఫుట్‌బాల్ స్టార్ రొనాల్డో.. ఎట్టకేలకు పెళ్లితో క్లైమాక్స్!
ప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో .. మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ జార్జినా రోడ్రిగ్జ్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు.
By: Sivaji Kontham | 12 Aug 2026 11:54 PM ISTప్రపంచ ప్రసిద్ధ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో .. మోడల్, ఇన్‌ఫ్లుయెన్సర్ జార్జినా రోడ్రిగ్జ్ ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. తమ ఐదుగురు పిల్లలతో కలిసి పోర్చుగల్‌లోని కాస్కైస్‌లో అత్యంత నిరాడంబరంగా, తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ వేడుకను జరుపుకున్నారు. వీరిద్దరూ తమ వివాహ ఉంగరాల ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ C లవ్ G అని క్యాప్షన్ ఇవ్వగా అది క్షణాల్లో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వేడుక ఆగస్టు 11న చాలా ప్రత్యేకమైన వాతావరణంలో జరిగింది. సరిగ్గా ఏడాది క్రితం.. అదే రోజున జార్జినా తమ నిశ్చితార్థాన్ని ప్రకటించడం విశేషం. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ పెళ్లికి కొద్దిరోజుల ముందే రొనాల్డో మదీరాలోని ఒక కేథడ్రల్‌లో పెళ్లి చేసుకుంటున్నాడని భావించి అభిమానులు అక్కడకు చేరుకోగా.. అది మరొకరి పెళ్లి అని తెలిసి సరదా గందరగోళం నెలకుంది.
ఈ వివాహ వార్త సోషల్ మీడియాలో రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ప్రముఖుల నుండి శుభాకాంక్షల వెల్లువ కురిసింది. పదేళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తర్వాత వీరు పెళ్లి పీటలెక్కడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే సోషల్ మీడియా కామెంట్లలో రొనాల్డో ఫుట్‌బాల్ కెరీర్.. వరల్డ్ కప్ సాధించడంపై ట్రోల్స్, మీమ్స్ వేస్తూ ఫుట్‌బాల్ ప్రేమికులు తమదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేశారు.
2016లో మాడ్రిడ్‌లోని గుస్సీ బ్రాండ్ స్టోర్‌లో జార్జినా సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో రొనాల్డోతో పరిచయం ఏర్పడింది. మొదటి చూపులోనే ప్రేమలో పడిన ఈ జంట ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ జంటలలో ఒకటిగా మారింది. తమ ప్రయాణంలో ఎన్నో ఆనందాలను.. అలాగే 2022లో తమ చిన్న కుమారుడు ఏంజెల్‌ను కోల్పోవడం వంటి తీవ్రమైన విషాదాలను కలిసి ఎదుర్కొని.. తమ బంధాన్ని మరింత దృఢం చేసుకున్నారు.
ప్రస్తుతం రొనాల్డో, జార్జినా దంపతులు తమ ఐదుగురు పిల్లలు క్రిస్టియానో జూనియర్, కవలలు ఈవా-మాటియో, అలనా, బెల్లాల బాధ్యతలను చూసుకుంటున్నారు. రొనాల్డో సౌదీ అరేబియాలో తన ఫుట్‌బాల్ కెరీర్‌ను కొనసాగిస్తూనే.. మీడియా ప్రచారానికి దూరంగా కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
