క్రియేటివ్ డిఫరెన్సెస్ కి అసలు కారణాలు ఇవేనా?
విభిన్న కళల సమాహారం కావడంతో ఇందులో భాగస్వాములయ్యే ప్రధాన వ్యక్తుల ఆలోచనా దృక్పథాల్లో వచ్చే తేడాలే ఈ విభేదాలకు ప్రాథమిక బీజం వేస్తాయి.
By: Srikanth Kontham | 28 Sept 2026 5:00 AM ISTపరిశ్రమలో తరచూ వినిపించే క్రియేటివ్ డిఫరెన్సెస్ (సృజనాత్మక విభేదాలు) అనే పదం నిశ్శబ్దంగా, గౌరవప్రదంగా అనిపించినా? దాని వెనుక ఎన్నో ఆశయాలు, కోట్లాది రూపాయల బడ్జెట్లు , నెలల తరబడి చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతాయి. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సినిమాలు, అగ్ర దర్శకులు-హీరోల కాంబినేషన్లు సగం షూటింగ్ పూర్తయ్యాక లేదా సెట్స్ పైకి వెళ్లే ముందు హఠాత్తుగా ఆగిపోవడానికి ప్రధాన కారణం ఇదే. సినిమా అనేది వ్యాపారమే కాదు. విభిన్న కళల సమాహారం కావడంతో ఇందులో భాగస్వాములయ్యే ప్రధాన వ్యక్తుల ఆలోచనా దృక్పథాల్లో వచ్చే తేడాలే ఈ విభేదాలకు ప్రాథమిక బీజం వేస్తాయి.
అసలు ఈ విభేదాలకు పునాది కథల చర్చల దశలోనే పడుతుంది. మొదట్లో దర్శకుడు చెప్పిన లైన్ నచ్చి ప్రాజె క్ట్‌కి ఓకే చెప్పిన హీరో లేదా నిర్మాత, స్క్రిప్ట్ పూర్తి స్థాయి రూపం దాల్చేసరికి అందులో అనేక మార్పులు కోరడం సాధారణంగా జరుగుతుంటుంది. దర్శకుడి దృష్టి అంతా కథలో భావోద్వేగాలు, కథనంలోని సహజత్వంపై ఉంటే! నిర్మాత దృష్టి బాక్సాఫీస్ లెక్కలు, బడ్జెట్ పరిమితులపై ఉంటుంది. మరోవైపు హీరో తన ఇమేజ్, మాస్ ఎలివేషన్లు, అభిమానుల అంచనాల చుట్టూ ఆలోచిస్తాడు. ఒకే కథను ఈ ముగ్గురు మూడు వేర్వేరు కోణాల్లో చూడటం ప్రారంభించినప్పుడే ఘర్షణ వాతావరణం మొదలవుతుంది.
దర్శకుడు-నిర్మాతల మధ్య తలెత్తే తేడాల్లో ప్రధానంగా ఆర్ట్ వర్సెస్ వాణిజ్యం యుద్ధం నడుస్తుంది. తాను అనుకున్న దృశ్యాన్ని అనుకున్నట్లే అత్యంత ఖరీదుగా తెరకెక్కించడానికి దర్శకుడు రాజీపడని ధోరణి ప్రదర్శిస్తే బడ్జెట్ పరిమితులు దాటిపోతున్నాయని నిర్మాత ఆందోళన చెందుతాడు. క్లైమాక్స్ మార్చాలని, సీన్ల నిడివి తగ్గించాలని లేదా అనవసర ఖర్చులు నియంత్రించాలని నిర్మాత కోరినప్పుడు అది తన సృజనాత్మక స్వేచ్ఛపై దాడిగా దర్శకుడు భావిస్తాడు. చిన్న విషయంతో మొదలైన ఈ నమ్మకలేమి క్రమంగా ఒకరిపై ఒకరికి అసంతృప్తిగా మారి సెట్స్ లో పరస్పర సహకారం కొరవడేలా చేస్తుంది.
ఇక స్టార్ హీరోలు వ్యవస్థను శాసిస్తున్న నేటి రోజుల్లో కథలో హీరో ప్రమేయం మరింత ఎక్కువైంది. కథలో ఇతర పాత్రలకు ప్రాధాన్యత పెరిగినా లేదా తన ఇమేజ్‌కి భంగం కలిగేలా సన్నివేశాలు ఉన్నా హీరోలు మార్పులు సూచిస్తుంటారు. దర్శకుడు తన విజన్‌ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే హీరో తన మార్కెట్ , అభిమానుల వర్గాన్ని కాపాడుకోవడానికి మొగ్గు చూపుతాడు. కథనంలో హీరో వేలు పెట్టడం దర్శకుడికి నచ్చకపోవచ్చు. దర్శకుడి మొండితనం హీరోకి మింగుడు పడకపోవచ్చు. ఇలాంటి సమయంలో ఒకరి భావాలను మరొకరు అంగీకరించకపోతే ప్రాజెక్ట్ దారి మళ్లుతుంది.
ఈ విభేదాలు ప్రాజెక్ట్ రద్దు వరకు వెళ్లడంలో అహం , ఆత్మాభిమానం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. దర్శకు డికి తన కథపై ఉండే నమ్మకం, కళాత్మక నిబద్ధత అనేది ఆత్మాభిమానం అయితే ఎవరి మాట వినకపోవడం, తనదే తుది నిర్ణయం అనడం అహం అవుతుంది. అలాగే నిర్మాత లేదా హీరో మేము చెప్పినట్లే జరగాలి అనుకోవడం అహానికి సంకేతం. చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన సమస్యల్లో అహం ప్రవేశించినప్పుడు కాస్త తగ్గడం అనేది ఓటమిగా భావిస్తారు. ఫలితంగా ఆత్మాభిమానం దెబ్బతినకూడదనే పట్టుదలతో ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే మేలనే నిర్ణయానికి వస్తారు.
ముగింపుగా చెప్పాలంటే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సినిమా ఆగడం అనేది ఆర్థికంగా నష్టమే అయినా? అరకొర రాజీలతో సగం మనసుతో సినిమా తీసి డిజాస్టర్ ఇచ్చే కంటే ఆపేయడమే మేలని సినీ వర్గాలు భావిస్తాయి. అయితే ప్రాజెక్టు ప్రారంభానికి ముందే పరిమితులు, బాధ్యతలపై స్పష్టమైన అవగాహన, తెరిచిన మనసుతో చేసుకునే సంభాషణలు ఒకరి నైపుణ్యాన్ని మరొకరు గౌరవించే సంస్కృతి ఉంటే ఈ విభేదాలను అధిగమించొచ్చు. వ్యక్తిగత అహాలను పక్కన పెట్టి సినిమా శ్రేయస్సే పరమావధిగా భావించినప్పుడే అద్భుతమైన కళాఖండాలు ఆవిర్భవి స్తాయన్నది కాదనలేని నిజం.
