సినీ మాఫియా- ప్రభుత్వం కలిసి లూటీ చేస్తున్నాయి: సీపీఐ నారాయణ
సినిమా నిర్మాతలకు సిగ్గు లేదు.. ప్రభుత్వానికి తెలివి లేదు! అని ఘాటుగా విమర్శించారు సీపీఐ నారాయణ. సినిమా నిర్మాతలు అడగ్గానే టికెట్ ధరల్ని పెంచి ప్రభుత్వాలు ప్రజలపై భారం పెనుమోపుతున్నాయని తూర్పారబట్టారు.
By: Sivaji Kontham | 11 Jan 2026 8:30 PM ISTసినిమా నిర్మాతలకు సిగ్గు లేదు.. ప్రభుత్వానికి తెలివి లేదు! అని ఘాటుగా విమర్శించారు సీపీఐ నారాయణ. సినిమా నిర్మాతలు అడగ్గానే టికెట్ ధరల్ని పెంచి ప్రభుత్వాలు ప్రజలపై భారం పెనుమోపుతున్నాయని తూర్పారబట్టారు.
సంక్రాంతి సినిమాలకు టికెట్ ధరలు పెంచడాన్ని ఆయన నిరసిస్తున్నారు. ఇది సినిమా వాళ్లు, ప్రభుత్వం కలిసి ప్రజల్ని దోపిడీ చేయడమేనని అభిప్రాయపడ్డారు. కోట్లు పెట్టి సినిమాలు తీసి ప్రజలపై భారం మోపుతారా? అని ప్రశ్నించారు. థియేటర్ కి వెళితే మంచి నీళ్లు, స్నాక్స్ తీసుకెళ్లనివ్వరు. అక్కడ అధిక ధరలకు అమ్ముతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆశించాలి కానీ, ఇలా దోపిడీ చేయకూడదని నారాయణ అన్నారు. థియేటర్లలో అధిక ధరలకు విక్రయించడం సినీమాఫియా, ప్రభుత్వం కలిసి కట్టుగా లూటీ చేయడమేనని అభిప్రాయపడ్డారు.
సంక్రాంతి సినిమాలైన `మన శంకరవరప్రసాద్ గారు`, `ది రాజా సాబ్` చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి కోరడంపై కూడా ఆయన మండిపడ్డారు. నిర్మాతలు హీరోలకు వందల కోట్లు ఇస్తారు, కానీ ఆ భారాన్ని సామాన్య ప్రేక్షకులపై వేస్తారు. ధరలు పెంచడం అంటే పేదవాడి జేబులు కొట్టడమే! నని అన్నారు. సినిమా పరిశ్రమ కేవలం ధనవంతుల కోసం మాత్రమే అన్నట్లుగా తయారైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల భారం తగ్గించేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వాలు ధనవంతులకు దోచి పెట్టే పనులు చేస్తున్నాయన విమర్శించారు.
అలాగే సినిమా వాళ్ల వ్యక్తిగత విషయాలను కూడా సినిమాలాగా ఆర్భాటంగా చూపిస్తున్నారని కూడా సీపీఐ నారాయణ విరుచుకుపడ్డారు. ఇటీవలి ధనుష్- నయనతార గొడవను ఆయన ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేసారు.
``తెలుగు సినిమా నిర్మాతలకు అసలు సిగ్గు ఉందా? సెలబ్రిటీల ప్రైవసీని వ్యాపారం చేసుకుంటున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం పడి చచ్చే వీరు, నటీనటుల రక్షణ గురించి ఎందుకు ఆలోచించడం లేదు?`` అని ప్రశ్నించారు. ఇటీవల విమానాశ్రయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో జరిగిన మాబింగ్ ఘటనలను నారాయణ ప్రస్థావిస్తూ ప్రశ్నలు కురిపించారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి హోదాలో నారాయణ పేదల తరపును తన గళం విప్పుతున్నారు. గతంలో కూడా `బిగ్ బాస్` షోపై, అలాగే టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలపై గొంతు ఎత్తే రాజకీయ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. టికెట్ రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారని, దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాల్సింది సినీపెద్దలే అని కూడా ఆయన గతంలో సూచించారు.
నారాయణ వ్యాఖ్యలపై నిర్మాతలు ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. సినిమాలకు పెరిగిన బడ్జెట్లు, వీఎఫ్ఎక్స్ భారం వగైరా అంశాలను ప్రస్థావిస్తున్నారు.
