టాలీవుడ్ (X) బాలీవుడ్: అవినీతి జాఢ్యం ఎక్కడ ఎక్కువ?
భారతదేశంలో అవినీతి జాఢ్యం లేని రంగం ఏదైనా ఉందా?.. ఈ ప్రశ్నకు కచ్ఛితమైన సమాధానం చెప్పగలిగితే మిలియన్ డాలర్ బహుమతిని అందించవచ్చు.
By: Sivaji Kontham | 5 Aug 2025 8:00 AM ISTభారతదేశంలో అవినీతి జాఢ్యం లేని రంగం ఏదైనా ఉందా?.. ఈ ప్రశ్నకు కచ్ఛితమైన సమాధానం చెప్పగలిగితే మిలియన్ డాలర్ బహుమతిని అందించవచ్చు. కానీ దీనికి సరైన సమాధానం లేదు. అన్ని రంగాల్లోను అవినీతి నెలకొని ఉంది. రెవెన్యూ శాఖ, విద్యా శాఖ, పరిశ్రమలు, వ్యాపారాలు.. రంగం ఏదైనా.. ప్రతి చోటా లంచాలు లేనిదే పని పూర్తి కాదు.
బాలీవుడ్ లో ముసలం:
ఇప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ లోని అవినీతి గురించి సినీప్రముఖుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల హిందీ చిత్రసీమ దారుణ వైఫల్యాలపై సమీక్షా సమావేశాలను నిర్వహించగా అక్కడ జరిగే అవినీతి కూడా సినీపెద్దల్లో ప్రస్థావనకు వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ లో రచయితలు ఉసురుపోసుకోవడం వల్ల సరైన కథలు రాలేదని, కథలు కొట్టేసి లేదా గొప్ప రచయితలను ఘోస్ట్ లుగా వాడుకుని విసిరేయడం వల్ల వారంతా రచనా రంగం వదిలి పెట్టి, వేరే వేరే రంగాలకు తరలిపోతున్నారని కూడా విశ్లేషించారు. మధ్యవర్తుల చేతిలో పడిన స్క్రిప్టు సినిమాగా రూపాంతరం చెందాక తెరపై టైటిల్ కార్డ్స్ లో రచయిత పేరు కూడా మారిపోతోంది. సినీరంగంలోని ఇలాంటి దారుణ పరిస్థితుల్ని తట్టుకోలేక సిసలైన రచయితలు నిజాయితీగా తమ వంతు ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు. ఇది పరిశ్రమకు పెద్ద డ్యామేజ్ చేసిందని, సరైన కథలు రాసేవాళ్లు లేక పొరుగు భాషల్లో హిట్టయిన సినిమాలను రీమేక్ చేయాల్సి వస్తోందని కూడా హిందీ చిత్రసీమలో విశ్లేషించారు. సమీక్షా సమావేశంలో ప్రొడక్షన్‌లో డబ్బు సరైన విధానంలో ఖర్చు అవుతోందా లేదా? క్రియేటర్ల ప్రాధాన్యత ఎలా ఉంది? అనే అంశాలపైనా చర్చ సాగింది.
టాలీవుడ్‌లోను ఈ తరహా:
ఇప్పుడు తెలుగు చిత్రసీమలోను ఈ తరహాలో డిబేట్ రన్ అవుతోంది. ప్రస్తుతం నిర్మాతలు కాస్ట్ ఫెయిల్యూర్స్ కారణంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రొడక్షన్ లో అవకతవకలు వగైరా అంశాలపైనా ఇప్పుడు లోతుగా ఆరాలు తీస్తున్నారని తెలిసింది. సక్సెస్ లేక ఫైనాన్స్ చేసేవాళ్లు కూడా తగ్గిపోవడం నిర్మాతలకు బొప్పి కట్టిస్తోంది. అలాగే పెద్ద నిర్మాతలు ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టులను లైనప్ లో పెడుతూ ఉన్నా అన్ని ప్రాజెక్టులపైనా సరిగా ఫోకస్ చేయలేకపోతున్నారు. ప్రొడక్షన్ వ్యవహారాలు సహా దిగువ స్థాయిలో పనులు ఎలా జరుగుతున్నాయి? ఖర్చులు ఎలా చేస్తున్నారు? అనే అంశాలను ఆరా తీసే పరిస్థితి ఉండటం లేదు. అయితే డబ్బు ఖర్చు విషయంలో తమ వారు, నమ్మకమైన వ్యక్తులు లేకపోవడం వల్ల కూడా అవినీతి ఎక్కువగా జరుగుతోంది. ప్రతిరోజూ సెట్‌లలో జరిగే అవినీతిని నియంత్రించలేకపోవడానికి నమ్మకస్తులు లేకపోవడం ఒక కారణం.
దిగువ స్థాయిలో లోతైన పరిశీలన అవసరం:
స్టార్ హీరోలు, దర్శకులకు భారీ ప్యాకేజీలు ఎలా ముట్టజెప్పాలి? అని తర్జన భర్జన పడే నిర్మాతలకు దిగువ స్థాయి వ్వవహారాలను చక్కబెట్టుకునే పరిస్థితి ఉండటం లేదు. నిర్మాతల టెన్షన్ పూర్తిగా వేరే విషయాలపై ఉంటుంది. దీనిని అదనుగా తీసుకుని అవినీతికి పాల్పడేవారు పుట్టి ముంచుతున్నారు. కాస్ట్ ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం ప్రొడక్షన్ నిర్వహణా భారాన్ని గుడ్డిగా ఒకరిని నమ్మి అప్పగించడమేనని కూడా విశ్లేషిస్తున్నారు. అయితే ఇలాంటి పరిణామాలపై తెలుగు చిత్రసీమలో ఇటీవల ఫోకస్ పెరుగుతోందని సమాచారం.
అదొక్కటే ఊరట:
అయితే బాలీవుడ్‌తో పోలిస్తే కాస్ట్ ఫెయిల్యూర్ లేదా అవినీతి వ్యవహారాల్లో టాలీవుడ్ కొంత బెటర్ అనే మాట కొంతలో కొంత ఊరట.
