Begin typing your search above and press return to search.

ముంబైని ఊపేసిన పాప్ కల్చర్ హంగామా!

ఇటీవలి కాలంలో యువతను ఎంతగానో ఆకర్షిస్తున్న పాప్ కల్చర్ ఉత్సవాలు ముంబై నగరంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   22 Jun 2026 1:33 PM IST
ముంబైని ఊపేసిన పాప్ కల్చర్ హంగామా!
X

ఇటీవలి కాలంలో యువతను ఎంతగానో ఆకర్షిస్తున్న పాప్ కల్చర్ ఉత్సవాలు ముంబై నగరంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అందులో భాగంగానే నిర్వహించిన `సి.ఓ.ఆర్.ఇ` వేడుక నగర వాసులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ ఈవెంట్ యువతకు, కళాకారులకు, క్రీడా ప్రేమికులకు అద్భుతమైన వేదికగా నిలిచింది. వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. డిజిటల్ ప్రపంచంలో స్క్రీన్‌లకే పరిమితమైన అనుభవాలను నిజ జీవితంలోకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో `సి.ఓ.ఆర్.ఇ` ఉత్సవాన్ని రూపొందించారు. వర్చువల్‌గా చూసే విషయాలను నేరుగా తాకడం, అనుభవించడం , తోటి అభిమానులతో పంచుకోవడం వంటి సరికొత్త కాన్సెప్ట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా నిజమైన అనుభూతులను పంచేలా ఈ ప్రదర్శనలు సాగాయి.

ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది యానిమేష‌న్ గేమింగ్ , కాస్‌ప్లే ప్రదర్శనలు. తమకు ఇష్టమైన కామిక్, యానిమేషన్ పాత్రల వలే ముస్తాబై యువతీ యువకులు స్టేజ్ పై సందడి చేశారు. వీటికి తోడు నేటి తరం యువతను విపరీతంగా ఆకర్షిస్తున్న స్ట్రీట్‌వేర్ , స్నీకర్ కల్చర్ కు సంబంధించిన ప్రత్యేక స్టాల్స్ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచాయి. అరుదైన కలెక్టబుల్స్, ఆర్ట్ పీస్‌లు ఉత్సవంలో హాట్ కేకుల్లా అమ్ముడ‌య్యాయి.

ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఈవెంట్ మ్యూజిక్ - లైవ్ ఆర్ట్ ఇన్‌స్టాలేషన్స్‌తో హోరెత్తిపోయింది. దేశంలోని ప్రముఖ డీజేలు, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్టులు ప్రదర్శనలతో ప్రేక్షకులను డ్యాన్స్ ఫ్లోర్‌పై ఉర్రూతలూగించారు. స్థానిక కళాకారులు అక్కడికక్కడే వేసిన గ్రాఫిటీలు, మోడ్రన్ ఆర్ట్ పెయింటింగ్స్ పాప్ కల్చర్ సారాంశాన్ని ప్రతిబింబించాయి. ఈ తరహా ఈవెంట్లు వినోదాన్ని మాత్రమే కాకుండా బలమైన కమ్యూనిటీ భావనను పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడతాయని తెలుస్తోంది. ఒకే రకమైన ఆస‌క్తి, అభిరుచి ఉన్న వ్యక్తులు ఒకే చోట తమ ఆలోచనలను పంచుకోవడానికి ఇదొక చక్కని వేదికగా మారింది. ముంబై లాంటి మెట్రో నగరంలో ఇలాంటి భారీ పాప్ కల్చర్ పండుగలు జరగడం తో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ యువత ప్రతిభకు, మార్కెట్‌కు ఉన్న డిమాండ్ స్పష్టంగా అర్థమవుతోంది.

`సి.ఓ.ఆర్.ఇ` ఈవెంట్ ముంబై సాంస్కృతిక ముఖచిత్రంలో మైలురాయిగా నిలిచిపోతుంది. కేవలం వినోదం కోసమే కాకుండా సృజనాత్మకతకు, స్వీయ వ్యక్తీకరణకు పట్టం కట్టిన ఈ ఉత్సవం భవిష్యత్తులో మరిన్ని సరికొత్త ప్రయోగాలకు నాంది పలికింది. యువత నుంచి వచ్చిన అపూర్వ స్పందన చూస్తుంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో పాప్ కల్చర్ పరిశ్రమ మరింత విస్తరించడం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.