నయా ట్రెండ్ షురూ.. కూలీ మాస్టర్ ప్లాన్ అదుర్స్!
అసలు విషయంలోకి వెళ్తే ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతోందంటే ఆడియో వేడుకలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా అవి రూపాంతరం చెందాయి.
By: Madhu Reddy | 12 Aug 2025 12:09 PM ISTఒక సినిమా విడుదలవుతోంది అంటే ఆ సినిమా ప్రజలలోకి వెళ్లడానికి చిత్ర బృందం ప్రమోషన్స్ పేరిట ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని చేసేస్తూ ఉంటారు. ముఖ్యంగా కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త ప్లాన్స్ వేస్తూ సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అసలే స్టార్ కాస్ట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ను మాత్రమే బేస్ చేసుకొని సినిమా థియేటర్ కి వెళ్తున్న ప్రేక్షకుడిని.. సినిమా థియేటర్ కి రప్పించాలి అంటే ఇప్పుడు కత్తి మీద సాములా మారిపోయింది. అందుకే భారీ స్థాయిలో అంచనాలు పెంచేసి ఎలాగైనా సరే థియేటర్ కి ప్రేక్షకుడిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఇప్పుడు ఇలాంటి వినూత్న ఎన్నో ప్రయోగాలతో 'కూలీ' సినిమా కూడా అంచనాలు భారీగా పెంచేస్తోంది. ఇప్పటికే అమెజాన్ ఈ - కామర్స్ తో చేతులు కలిపి డెలివరీ ఐటమ్స్ పై కూలీ సినిమాను ప్రమోట్ చేసిన చిత్ర బృందం .. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతోంది అని సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే ఒకప్పుడు సినిమా రిలీజ్ అవుతోందంటే ఆడియో వేడుకలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లుగా అవి రూపాంతరం చెందాయి. కానీ తమిళంలో మాత్రం ఇప్పటికీ ఆడియో వేడుకలే చేస్తున్నారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రమైన కూలీకి మాత్రం చిత్ర బృందం కాస్త భిన్నంగా ఆలోచించింది. 'కూలీ అన్ లీష్డ్' పేరుతో ఒక ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ ఆడియో వేడుకకు కొంచెం భిన్నంగా భారీగానే జరిగింది.. ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ ఎప్పటిలాగే ఈవెంట్ కి యూట్యూబ్ లైవ్ ఇవ్వలేదు.. వేరే ఛానల్ కి కూడా ఫీడ్ కూడా ఇవ్వలేదు. తమ సన్ టీవీ ఛానల్ లో మాత్రమే ఎక్స్క్లూజివ్గా దానిని ప్రసారం చేశారు.
అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే.. ఈ కూలీ ఈవెంట్ ఇప్పుడు తెలుగులో కూడా ప్రసారం కాబోతోంది. సినిమా విడుదలైన మరుసటి రోజు నుంచి మూడు రోజులు వరుసగా సెలవులు కావడంతో అటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యేలా.. ఆగస్టు 15వ తేదీన రాత్రి 9:30 గంటలకు ఈ ఈవెంట్ ను తెలుగులో ప్రసారం చేయడానికి టైం లాక్ చేశారు. సన్ నెట్వర్క్ లో భాగమైన జెమినీ టీవీలో మాత్రమే ఈ ఈవెంట్ తెలుగులో ప్రసారం కాబోతోంది. వాస్తవానికి తమిళ్ సినిమాలకు తెలుగులో ప్రెస్ మీట్ లు పెట్టడం, చిన్న చిన్న ఈవెంట్లు చేయడం మామూలే. అయితే ఇలా చెన్నైలో తమిళంలో జరిగిన ఈవెంట్ ను తొలిసారి తెలుగులో ప్రసారం చేయడం అరుదు. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తమిళంలో పాడిన పాటలకు బదులుగా కూలీ తెలుగు సాంగ్స్ కూడా ఇక్కడ వినిపించనున్నారట. అలాగే తమిళ్ స్పీచ్ లకి కూడా తెలుగు వాయిస్ ఓవర్ చేస్తున్నట్లు సమాచారం.
దీన్ని బట్టి చూస్తే.. ఇప్పటివరకూ.. తెలుగులో తమిళ్ డబ్బింగ్ చిత్రాలు చూశాము.. కానీ ఇప్పుడు ఈవెంట్లు కూడా డబ్బింగ్ చేయడం ఇదే తొలిసారి.. ఈ సినిమా నయా ట్రెండ్ సెట్ చేస్తోంది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా చిత్ర బృందం ప్లాన్స్ భారీగా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా.. నాగార్జున, ఉపేంద్ర , అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
