కూలీ - తెలుగు ప్రేక్షకుల్లో ఒక అసంతృప్తి
సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
By: M Prashanth | 30 July 2025 10:00 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమిర్ ఖాన్, శృతి హాసన్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ‘పవర్ హౌస్’ అనే ట్రాక్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. పవర్ ప్యాక్డ్ ట్యూన్, బీట్స్‌తో ఈ పాట యూత్‌లో పాపులర్ అయింది. అయితే తెలుగు ఆడియెన్స్ లో ఇప్పుడు ఒక నెగిటివ్ టాక్ వైరల్ అవుతోంది.
తెలుగు వెర్షన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
ఇటీవల చిత్రబృందం ‘పవర్ హౌస్’ పాటను తెలుగులో విడుదల చేశారు. అయితే ఈ తెలుగు వెర్షన్ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది. వాస్తవానికి, తమిళ వెర్షన్ విడుదలైనప్పుడు తెలుగు ఆడియన్స్ కూడా పాటను తమ ప్లేలిస్ట్‌లో చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు విడుదలైన తెలుగు వెర్షన్ మాత్రం ప్రేక్షకుల్లో అసంతృప్తిని కలిగించింది. ముఖ్యంగా, పాటకు రాసిన లిరిక్స్ ఒరిజినల్ వెర్షన్‌కి సరిపోలడం లేదని, సాంగ్ మూడ్ తగ్గిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. తెలుగు వర్షన్ వినిపించగానే పవర్ హౌస్ మాస్ ఎనర్జీ మిస్ అయ్యిందని, అసలు పాట వదిలేసి ఈ రీ మేక్ అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
తమిళ పాటల మాజిక్, తెలుగు మార్కెట్ లో పాఠాలు
ఇది తొలిసారి కాదు. ‘మాస్టర్’, ‘లియో’ వంటి సినిమాల్లోనూ తమిళ పాటలు వైరల్ అవగా, వాటి తెలుగు వర్షన్‌లు మాత్రం ఫ్లాట్ అయ్యాయి. ప్రస్తుతం కూలీ మూవీ తెలుగు పాటపై వచ్చిన నెగిటివిటీతో మేకర్స్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ డైరెక్ట్‌గా ‘‘తమిళ వర్షన్‌ను ఉంచండి, తెలుగు వర్షన్ అవసరం లేదు’’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. తమిళ వర్షన్ మూడ్‌ని, పవర్‌ని, లిరిక్స్‌ను మిస్ కాకుండా ఇకపై మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
తెలుగు మార్కెట్ ఎంత పెద్దదో తెలిసిన తర్వాత కూడా, తమిళ బిగ్ మూవీస్ విషయంలో పాటల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి రియాక్షన్స్ తప్పవు. ఇకపై తెలుగు వెర్షన్ పక్కా అనిపించాలంటే, మంచి లిరిక్స్, వాయిస్, మ్యూజిక్‌లో ఒరిజినల్ ఎనర్జీ ని మిస్ కాకుండా పని చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే తమిళ ట్రాక్‌ను ఉంచి, ఆ మేజిక్‌ని కొనసాగించడమే ఉత్తమమన్న అభిప్రాయం మొదలైంది.
కూలీ - వెయ్యి కోట్ల కల సాధ్యమేనా?
ఇక మరోవైపు, 'కూలీ' బాక్సాఫీస్‌పై ఒక టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. తమిళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా వెయ్యి కోట్ల గ్రాస్ రాలేదు. కానీ రజనీకాంత్, లోకేష్, అనిరుధ్ కాంబినేషన్‌తో ఉన్న హైప్, పాన్ ఇండియా మార్కెట్‌తో ‘కూలీ’ తొలి వెయ్యి కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందా అనే ఉత్సుకత ట్రేడ్ సర్కిల్స్‌లో ఉంది. డిసెంబర్‌లో రిలీజయ్యే 'కూలీ'కి అంత స్థాయిలో వసూళ్లు సాధ్యమా అనే దానిపై పరిశ్రమ మొత్తం చూస్తోంది.
