'సెన్సార్ సర్టిఫికెట్ మార్చండి'.. హైకోర్టుకు కూలీ మేకర్స్
ఆ తర్వాత రెండు రోజులు సెలవులు కావడంతో సాలిడ్ వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్ స్టార్ట్ అయ్యాక కలెక్షన్స్ తగ్గాయి.
By: M Prashanth | 20 Aug 2025 11:27 AM ISTకూలీ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో ఉన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. ఆగస్టు 14వ తేదీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. వార్-2 మూవీతో బిగ్ క్లాష్ ఎదురైనా.. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది.
ఆ తర్వాత రెండు రోజులు సెలవులు కావడంతో సాలిడ్ వసూళ్లు రాబట్టింది. వీక్ డేస్ స్టార్ట్ అయ్యాక కలెక్షన్స్ తగ్గాయి. అయితే కూలీ మూవీకి సెన్సార్ బోర్డు అధికారులు ఏ సర్టిఫికెట్ జారీ చేసిన విషయం తెలిసిందే. 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు చూడకూడదనే నిబంధనతో సర్టిఫికెట్ ఇచ్చింది.
అదే ఏ సర్టిఫికెట్ తో కూలీ మూవీని రిలీజ్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన వారం రోజులకు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. సెన్సార్ బోర్డును తమ సినిమా సర్టిఫికెట్ ను యూ/ఏగా అప్డేట్ చేయమని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. సాధారణంగా రజినీకాంత్ నటించిన చాలా చిత్రాలకు యూ/ఏ లేదా యూ సర్టిఫికెట్లు వచ్చాయి.
కానీ అధిక యాక్షన్ సన్నివేశాలు ఉండడం వల్ల కూలీ మూవీకి మాత్రం సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ ఇచ్చి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఇప్పుడు హింస, రక్తపాతం ఎక్కువగా ఉన్న సినిమాలకు యూ/ఏ ఇచ్చారని, కానీ వైలెన్స్ తక్కువ ఉన్నా తమకు ఏ ఇచ్చారని కోర్టుకు కూలీ మేకర్స్ పిటిషన్ లో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇక్కడ మరో విషయమేమిటంటే.. మేకర్స్ ఈ పని రిలీజ్ కు ముందు చేసి ఉండాలి. అప్పుడు కాస్త అయినా పనికొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో థియేట్రికల్ రన్ కంప్లీట్ అవుతుంది. దీంతో సెన్సార్ సర్టిఫికెట్ పై కోర్టుకు వెళ్లినా పెద్దగా లాభం లేదు. మరి మేకర్స్ ఎందుకు అలా చేశారో వారికే తెలియాలి.
ఇక సినిమా విషయానికొస్తే.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. రజినీ కాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సాబిన్ సాహిర్, సత్యరాజ్, అమిర్ ఖాన్, శ్రుతి హాసన్, మహేంద్రన్ వంటి స్టార్ నటీనటులు కనిపించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. మరి ఇప్పుడు మద్రాస్ హైకోర్టు.. కూలీ మేకర్స్ అభ్యర్థనపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
