కూలీ బ్యాడ్జి నెంబర్ '1421' పెట్టడం వెనుక ఓ ఎమోషనల్ కథ...రజినీ సర్ అడిగే వరకు చెప్పలేదు
సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 4 Aug 2025 4:09 PM ISTకోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తోన్న సినిమా కూలీ. సౌత్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. లియో తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడం, అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించనుండటం వల్ల మొదటి నుంచి ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంది.
వివిధ భాషలకు చెందిన స్టార్లు
దానికి తోడు ఈ సినిమాలో వివిధ భాషల నుంచి పలు నటులను తీసుకోవడంతో ఆ బజ్ ఇంకాస్త పెరిగింది. అందులో భాగంగానే విలన్ పాత్రలో నాగార్జున నటిస్తుండగా, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్ ను కూడా చేయించి కూలీపై అంచనాలను ఆకాశాన్నంటేలా చేశారు.
ఆ నెంబర్ వెనుక అసలు కారణం
అయితే కూలీ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ గా రిలీజైన పోస్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో రజినీకాంత్ చేతిలో 1421 అనే కూలీ బ్యాడ్జి నెంబర్ ఉంటుంది. సినిమాలో రజినీ బ్యాడ్జికి పర్టిక్యులర్ గా అదే నెంబర్ ను పెట్టడం వెనుక ఓ ఎమోషనల్ కథ దాగి ఉందనే విషయం ఇప్పుడు బయటికొచ్చింది. కూలీలో ఆ నెంబరే పెట్టడానికి కారణం తన తండ్రి అని లోకేష్ వెల్లడించారు.
ఎందుకు చెప్పలేదన్నారు
తన తండ్రి ఓ బస్ కండక్టర్ అని, ఆయన కూలీ బ్యాడ్జి నెంబర్ 1421 అని, తన తండ్రికి గుర్తుగా అదే నెంబర్ ను తాను సినిమాలో వాడానని, ఇది తన తండ్రికి తానిచ్చే గౌరవమని లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని రజిని సర్ కు చెప్పినప్పుడు మీ తండ్రి కండక్టర్ అని నాకెందుకు చెప్పలేదని అడిగారని, తన తండ్రి విషయాన్ని నేరుగా తానే చెప్పకూడదనుకుని దాచానని, ఆయన అడిగినప్పుడు చెప్తే అది బాగా గుర్తుండిపోతుందనే ఆలోచనతోనే అలా చేశానని లోకేష్ వెల్లడించారు.
