Begin typing your search above and press return to search.

పేరు కాదు.. కంటెంట్ ముఖ్యం

ఒక సినిమాకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే స్టార్ పవర్ చాలా ముఖ్యం అనడంలో సందేహం లేదు.

By:  Garuda Media   |   22 Nov 2025 10:25 PM IST
పేరు కాదు.. కంటెంట్ ముఖ్యం
X

ఒక సినిమాకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే స్టార్ పవర్ చాలా ముఖ్యం అనడంలో సందేహం లేదు. పెద్ద స్టార్ల సినిమాల విషయానికి వస్తే వాళ్ల కోసమే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెద్ద సంఖ్యలోనే ఉంటుంది. కాబట్టే వాళ్ల సినిమాలకు ఓపెనింగ్స్ బాగుంటాయి. ఐతే రాను రాను స్టార్ పవర్‌కు ఉన్న విలువ తగ్గుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓవైపు పెద్ద సినిమాల బడ్జెట్లు పెరిగిపోతుండగా.. ఓపెనింగ్స్ తగ్గుతున్నాయి.

స్టార్లు ఉంటే మినిమం వసూళ్లు ఉంటాయనే గ్యారెంటీ ఉండట్లేదు. ఇక చిన్న, మిడ్ రేంజ్ సినిమాల విషయానికి వస్తే.. హీరోను బట్టి టికెట్లు తెగడం అన్నది పాత కథ. సినిమాలో కంటెంట్ ఆకర్షణీయంగా లేకపోతే స్టార్లను కూడా పట్టించుకోవట్లేదు. పేరున్న హీరోలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. గత నెలలో మాస్ రాజా రవితేజ చిత్రం ‘మాస్ జాతర’కు వచ్చిన ఓపెనింగ్స్, ఓవరాల్ కలెక్షన్లు స్టార్ పవర్ ఎలా కరిగిపోతోందో చెప్పడానికి ఉదాహరణ.

ఇక వర్తమానంలోకి వస్తే.. ఈ వారం నాలుగు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో కొంతమేర స్టార్ అట్రాక్షన్ ఉన్నది ‘12 ఏ రైల్వే కాలనీ’కే. ఒకప్పుడు కామెడీ హీరోగా వైభవం చూసిన అల్లరి నరేష్ ఇందులో హీరో. కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తే పరిస్థితి ఘోరంగా ఉంది. రిలీజ్ ముంగిట బజ్ క్రియేట్ కాలేదు. తొలి రోజు థియేటర్లలో జనం చాలా పలుచనగా కనిపించారు. ఇక ఈ ఏడాది ‘కోర్ట్’తో విజయాన్నందుకున్నప్పటికీ ‘మిత్రమండలి’తో బోల్తా కొట్టిన ప్రియదర్శి ఇప్పుడు ‘ప్రేమంటే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దానికీ తొలి రోజు స్పందన అంతంతమాత్రం. రాజ్ తరుణ్ మూవీ ‘పాంచ్ మినార్’ పర్వాలేదు మంచి టాక్ తోనే నడుస్తుంది.. క్రైమ్ కామెడీ బాగుంది అని క్రిటిక్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

కానీ వీటితో పోలిస్తే కొత్త నటీనటులు లీడ్ రోల్స్ చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ అద్భుతమైన స్పందన తెచ్చుకుంటోంది. శుక్రవారం ఇదే బాక్సాఫీస్ లీడర్‌గా నిలిచింది. ట్రైలర్, సాంగ్ మంచి బజ్ క్రియేట్ చేయడం.. ఈ మూవీ క్లైమాక్స్ గురించి ముందే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరగడం.. పెయిడ్ ప్రిమియర్స్‌కు పాజిటివ్ టాక్ రావడం కలిసొచ్చి శుక్రవారం ఈవెనింగ్, నైట్ షోలు మంచి ఆక్యుపెన్సీలతో నడిచాయి. ఓవైపు కాస్త పేరున్న హీరోలు చేసిన మిగతా మూడు సినిమాల థియేటర్లు వెలవెలబోతుంటే.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రం జనాలతో కళకళలాడింది. ‘బుక్ మై షో’లో మిగతా మూడు చిత్రాలకు కలిపి గంటలో బుక్ అవుతున్న టికెట్ల కంటే ‘రాజు వెడ్స్ రాంబాయి’కి తెగుతున్న టికెట్లే ఎక్కువ ఉండడం విశేషం. 12 ఏ రైల్వే కాలనీ, ప్రేమంటే చిత్రాలకు పూర్తిగా నెగెటివ్ టాక్ రాగా.. ‘పాంచ్ మినార్’ కాస్త పాజిటివ్ టాకే తెచ్చుకుంది. కాకపోతే రాజ్ తరుణ్ ఫ్లాపుల పరంపర వల్ల ఈ సినిమా జనాల దృష్టిలో పడలేకపోతోంది.