స్టేట్మెంట్ కాదు.. కంటెంట్ ముఖ్యం బిగిలూ!
అయితే ఆ రెండు అంశాల కంటే ముఖ్యమైనది మాత్రం ఒక్కటే.. అది కంటెంట్.
By: M Prashanth | 28 March 2026 10:55 AM ISTసినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో హైప్ క్రియేట్ చేయడం ఇప్పటి ట్రెండ్ గా మారింది. టీజర్లు, ట్రైలర్లు, పాటలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో హీరోలు, దర్శకులు, నిర్మాతలు చేసే స్టేట్మెంట్స్ కూడా సినిమాపై ఆసక్తి పెంచే అంశాలుగా మారాయి. కొన్నిసార్లు ఆ ప్రమోషనల్ కంటెంట్ వల్ల సినిమాకు ముందే మంచి క్రేజ్ ఏర్పడుతుంది. మరికొన్ని చిత్రాలు విడుదలైన తర్వాత మౌత్ టాక్ తో ప్రేక్షకుల మనసులు గెలుస్తాయి.
అయితే ఆ రెండు అంశాల కంటే ముఖ్యమైనది మాత్రం ఒక్కటే.. అది కంటెంట్. సినిమా ఎంత హైప్ తో వచ్చినా, ఎంత పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చినా, చివరకు ప్రేక్షకులు నిర్ణయించే విషయం కంటెంట్. అది స్ట్రాంగ్ గా ఉంటే ముందు చెప్పిన మాటలు ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోతే, అదే స్టేట్మెంట్స్ ట్రోల్స్ కు కారణమవుతాయి.
ఇటీవల రచయిత, నిర్మాత కోన వెంకట్ విషయంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన రచయితగా, నిర్మాతగా వ్యవహరించిన బ్యాండ్ మేళం సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన పొందలేకపోయింది. మౌత్ టాక్ కూడా నెగెటివ్ గా రావడంతో సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా పడిపోయాయి.
ఈ నేపథ్యంలో విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కోన వెంకట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఈవెంట్ లో ఆయన 'ఈ సినిమా నచ్చకపోతే, నేను రాసిన తర్వాత సినిమాలు చూడకండి' అని చెప్పిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ స్టేట్మెంట్ సినిమాపై నమ్మకాన్ని చూపించినట్టుగా అనిపించినా, ఇప్పుడు అదే మాటలు ఆయనకు తిరిగి వస్తున్నాయి.
సినిమా ఫలితం నిరాశ కలిగించడంతో నెటిజన్లు ఆ స్టేట్మెంట్ ను ప్రస్తావిస్తూ వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. దీంతో మరోసారి స్టేట్మెంట్స్ కంటే కంటెంట్ ముఖ్యమని చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితులు గతంలో కూడా కనిపించాయి. నేచురల్ స్టార్ నాని ఒక సినిమా సమయంలో చేసిన స్టేట్మెంట్ అప్పట్లో చర్చనీయాంశమైంది.
అయితే ఆ తర్వాత ఆయన మంచి కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని మళ్లీ విజయాన్ని సాధించారు. అలాగే నటుడు ప్రియదర్శి విషయంలో కూడా ఇలాంటి చర్చలు జరిగాయి. ఆ ఉదాహరణలు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ లో చెప్పే మాటలు హైప్ తీసుకురాగలవు. కానీ ఆ హైప్ ను నిలబెట్టేది మాత్రం కంటెంట్ మాత్రమే. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని, స్ట్రాంగ్ కంటెంట్ ను కోరుకుంటారు. అది లేకపోతే ఎంత పెద్ద స్టార్లు ఉన్నా, ఎంత ప్రమోట్ చేసినా ఫలితం మారదు. అందుకే స్టేట్మెంట్ కాదు.. కంటెంట్ ముఖ్యం బిగిలూ అని అంతా గుర్తుంచుకోవాలని నెటిజన్లు అంటున్నారు.
