పెద్ద తెరైనా బుల్లితెరైనా 'కంటెంటే కింగ్'.. ఇదిగో ఇదే ప్రూఫ్!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ల ఆదరణ క్రమంగా తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం అందులో నాణ్యమైన కంటెంట్ లేకపోవడమే.
By: Sivaji Kontham | 27 July 2026 9:26 AM ISTసినిమా రంగంలో లేదా వినోద ప్రపంచంలో ఎంతమంది అగ్రతారలు ఉన్నా.. భారీ విజువల్ వండర్స్ సృష్టించినా అంతిమంగా విజయాన్ని నిర్ణయించేది `కంటెంట్` మాత్రమేనని ట్రేడ్ నిపుణులు బలంగా చెబుతున్నారు. పెద్ద తెర (థియేటర్లు), ఓటీటీ, లేదా బుల్లితెర (టీవీ) రంగం ఏదైనా సరే.. నాణ్యమైన కథ, కథనాలు ఉన్నప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం ఇటీవలి పరిణామాలతో మరోసారి స్పష్టమైంది. రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమాల కాలం చెల్లి, జానర్ బ్లెండ్ - వైవిధ్యమైన ప్రయోగాత్మక కంటెంట్ కు ప్రేక్షకులు పట్టంకడుతున్నారు. సరైన కంటెంట్ వస్తే ప్రేక్షకులు థియేటర్ల బాట పడతారని ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో విజయవంతమైన చిత్రాలు నిరూపించాయి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ల ఆదరణ క్రమంగా తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణం అందులో నాణ్యమైన కంటెంట్ లేకపోవడమే. కోవిడ్ సమయంలో ఊపందుకున్న స్ట్రీమింగ్ రంగానికి ఇప్పుడు క్రియేటివ్ కంటెంట్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇందుకు నిదర్శనంగా అంతర్జాతీయ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షేరు ధర గత 12 నెలల్లో ఏకంగా 42 శాతానికి పడిపోయి.. అంటే 126 డాలర్ల నుండి 70 డాలర్లకు పడిపోవడాన్ని నిపుణులు ఎత్తి చూపుతున్నారు. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకునే ఒక్క పెద్ద ఒరిజినల్ వెబ్ సిరీస్ లేదా సినిమాను తేలేకపోవడం.. క్రమం తప్పకుండా రొటీన్ కంటెంట్‌ను తీసుకురావడమే ఓటీటీ సంస్థల పతనానికి.. ఈ పరిశ్రమలోని మాంద్యానికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఓటీటీ రంగంలో క్రియేటివ్ ఒరిజినల్ సిరీస్ లు మాత్రమే తిరిగి ఉత్సాహాన్ని తేగలవు అని కూడా నిపుణులు చెబుతున్నారు.
అయితే ఓటీటీలో కొత్తదనం కరువవ్వడం పరోక్షంగా థియేటర్ రంగానికి కొత్త ఊపిరిపోసింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్ బిజినెస్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటోంది. కేవలం రూ. 10 కోట్ల లోపు అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన `అబ్సెషన్` 4000 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లను సాధించి.. కంటెంట్ బాగుంటే చిన్న-పెద్ద తేడా లేకుండా థియేటర్లకు జనం వస్తారు! అని చాటిచెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్ల పరిస్థితి మెరుగై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇటీవల విడుదలైన `ది ఒడిస్సీ` తో పాటు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, ఇతర పొరుగు భాషా అనువాద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన దురంధర్, బ్లాస్ట్ వంటి చిత్రాలు సాధించిన భారీ వసూళ్లు థియేట్రికల్ రన్ ప్రాముఖ్యతను నిరూపించాయి. ఓటీటీలలో చూడటానికి ఏమీ లేకపోవడం, థియేటర్లలో పవర్ ఫుల్ కంటెంట్ లభించడంతో ప్రేక్షకులు మళ్లీ గొప్ప అనుభూతిని పొందేందుకు థియేటర్ల వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు.
కేవలం థియేటర్లు.. ఓటీటీలకే పరిమితం కాకుండా బుల్లితెర (టీవీ) రంగం సక్సెస్ కావాలన్నా కంటెంటే కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఓటీటీలు వెనుకబడటానికి థియేట్రికల్ కంటెంట్ మెరుగుపడటంతో పాటు టీవీ సీరియళ్లు, రియాలిటీ షోలు సరికొత్త రూపురేఖలు సంతరించుకోవడం కూడా ఒక ముఖ్య కారణం. బుల్లితెర వినోద రంగంలో మూస పద్ధతులకు స్వస్తి చెప్పి.. నవతరం దర్శకరచయితలు సరికొత్త కంటెంట్ మార్పు కోసం ప్రయత్నాలు చేయడం ఆసక్తికర పరిణామం. మొత్తం మీద వినోద మాధ్యమం ఏదైనా సరే.. ప్రేక్షకుడిని కట్టిపడేసే సత్తా ఉన్న `కంటెంటే ఎప్పుడూ అసలైన కింగ్` అని తాజా పరిణామాలు గట్టిగా చాటిచెబుతున్నాయి.
