ఫ్రాంఛైజీ క్రేజ్‌తో హారర్ సినిమా హవా
అయితే వీటిలో సూపర్ డూపర్ హిట్ ఫ్రాంఛైజీ `కాంజురింగ్` (హాలీవుడ్) నుంచి వస్తున్న కొత్త సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడం ఆలోచింపజేస్తోంది.
By: Sivaji Kontham | 4 Sept 2025 5:00 AM ISTజమానా కాలం నుంచి హాలీవుడ్ లో ఫ్రాంఛైజీ సినిమాలు హవా సాగిస్తూనే ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలు, స్పై యూనివర్శ్ లు, సూపర్ హీరో సినిమాలు, కాప్ డ్రామాలు .. జానర్ ఏదైనా కానీ ఒకసారి క్రేజ్ వచ్చిందంటే ఆ తర్వాత ఆ ఫ్రాంఛైజీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తారు.
హాలీవుడ్ లో ఈ ట్రెండ్ చాలా కాలంగా ఉంది. బాలీవుడ్ లో రెండు దశాబ్ధాల కాలంలో ఫ్రాంఛైజీ కల్చర్ బాగా ఉధృతమైంది. సౌత్ లో బాహుబలి ఫ్రాంఛైజీ సంచలన విజయం సాధించిన తర్వాత ఫ్రాంఛైజీ కల్చర్ అంతకంతకు విస్త్రతమైంది. ఫ్రాంఛైజీలో మొదటి సినిమా సక్సెసైతే, ఆ తర్వాత వచ్చే సినిమాల కోసం ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తారు కాబట్టి ఈ ఫార్ములా బాక్సాఫీస్ కి బాగా కలిసొస్తోంది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప, కాంతార దీనికి పెద్ద ఎగ్జాంపుల్.
ఈ సెప్టెంబర్ మొదటి వారంలో రెండు ఫ్రాంఛైజీ చిత్రాలతో పాటు ఒక వివాదాస్పద చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే వీటిలో సూపర్ డూపర్ హిట్ ఫ్రాంఛైజీ `కాంజురింగ్` (హాలీవుడ్) నుంచి వస్తున్న కొత్త సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం చెలాయించడం ఆలోచింపజేస్తోంది. హారర్ జానర్ ఫ్రాంఛైజీల్లో కాంజురింగ్ కి అసాధారణమైన క్రేజ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అద్భుత వసూళ్లను సాధించిన ఫ్రాంఛైజీ ఇది. అందువల్ల ఇప్పుడు ఇండియాలోను ఈ సినిమా భారీ వసూళ్లను నమోదు చేయబోతోంది.
అదే సమయంలో టైగర్ ష్రాఫ్ భాఘి 4 , వివేక్ అగ్నిహోత్రి వివాదాస్పద చిత్రం `ది బెంగాళ్ ఫైల్స్` ముందస్తు బుకింగుల్లో వెనకబడడం చర్చగా మారింది. ది కాంజురింగ్- లాస్ట్ రైట్స్ సినిమాకి జాతీయ చైన్ లలో 34000 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో పోలిస్తే కేవలం 7000 టికెట్ల అమ్మకాలతో భాఘి 4 రేసులో చాలా వెనకబడింది. ఇక `ది బెంగాళ్ ఫైల్స్` చిత్రం వివాదాల కారణంగా ముందస్తు బుకింగులు అంతగా లేవు. కంటెంట్ బావుందని టాక్ వస్తే ఆ తర్వాత వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. భాఘి 4 ట్రైలర్ అధిక రక్తపాతం, దారుణమైన సన్నివేశాలతో జుగుప్స పుట్టించడంతో ఫ్యామిలీ ఆడియెన్ థియేటర్లకు వెళ్లడం కష్టం. కిల్, మార్కో తరహాలో ఏదో సంథింగ్ ఉంది! అనిపిస్తేనే భాఘి 4 సినిమా చూడటానికి జనం థియేటర్లకు వెళ్లే ఛాన్సుంటుంది. రొటీన్ గా ఉంటే ఎవరూ పట్టించుకోరు.
ఏది ఏమైనా హాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలు ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ ని శాసిస్తున్నాయి. ఇంతకుముందు ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంఛైజీలో కొత్త సినిమాతో పాటు, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ చివరి సినిమా కూడా భారత దేశంలో వసూళ్ల పరంగా హవా సాగించాయి. ఆ సమయంలో విడుదలైన భారతీయ సినిమాలను డామినేట్ చేసాయి. ఇప్పుడు ఈ శుక్రవారం బాక్సాఫీస్ రేస్ లో కాంజురింగ్ హవా కొనసాగుతోంది.
