రిలీజ్ పోస్ట్ పోన్ రూమర్లు.. కానీ 'కామ్రేడ్'కు అదే ప్లస్..
బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి అవసరమైన వసూళ్లను నాలుగు రోజుల్లోనే సాధించినట్లు మేకర్స్ తెలిపారు.
By: M Prashanth | 13 Oct 2026 4:30 PM ISTసినిమా రిలీజ్ కు ముందు వచ్చే కొన్ని వార్తలు.. ఒక్కోసారి ఆ మూవీకి పెద్ద ప్లస్ అవుతుంటాయి. యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన కామ్రేడ్ కళ్యాణ్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పొచ్చు. ఆ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ ప్రచారం జరిగినా.. మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది ఆ మూవీ.
నిజానికి శ్రీవిష్ణు సినిమాలంటే కామెడీకి మంచి ఇంపార్టెన్స్ ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఈసారి కూడా అదే నమ్మకంతో వచ్చిన కామ్రేడ్ కళ్యాణ్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఫన్నీ సీన్స్, నవ్వించే డైలాగ్స్, కథలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో మొదటి రోజు కంటే రెండో రోజు, మూడో రోజు వసూళ్లు పెరిగాయి. సోమవారం కూడా సినిమా మంచి వసూళ్లను కొనసాగించింది.
నిజానికి కామ్రేడ్ కళ్యాణ్ అక్టోబర్ 9న విడుదలవుతుందని మూవీ టీమ్ ముందుగానే ప్రకటించింది. అయితే అదే తేదీకి వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం కూడా విడుదల కావాల్సి ఉంది. పెద్ద హీరో సినిమా కూడా బరిలో ఉండటంతో థియేటర్ల విషయంలో పోటీ ఉంటుందనే చర్చ జరిగింది. ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే థియేటర్ల కేటాయింపులో ఇబ్బందులు రావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
అందుకే కామ్రేడ్ కళ్యాణ్ కూడా వాయిదా పడుతుందంటూ ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలకు భిన్నంగా సినిమా అనుకున్న తేదీకే విడుదలైంది. మరోవైపు ఆదర్శ కుటుంబం సినిమా వాయిదా పడింది. అక్టోబర్ 9న విడుదల కావాల్సిన ఆ చిత్రం పనులు పూర్తి కాకపోవడంతో వెనక్కి వెళ్లింది. దీంతో కామ్రేడ్ కళ్యాణ్ కు థియేటర్ల విషయంలో పోటీ తగ్గింది. దసరా సెలవులు కూడా కలిసి రావడంతో సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది.
ఆ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి అవసరమైన వసూళ్లను నాలుగు రోజుల్లోనే సాధించినట్లు మేకర్స్ తెలిపారు. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.13.19 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సినిమా లాభాల బాట పట్టింది. జానకీరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు.
స్టార్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ సమర్పించిన ఆ సినిమా విడుదలకు ముందు వచ్చిన వాయిదా ప్రచారం ఒకవైపు ఉంటే.. మరోవైపు ఆదర్శ కుటుంబం వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు కలిసొచ్చింది. దసరా సెలవుల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండటం, శ్రీవిష్ణు సినిమాలకు ఉన్న రెస్పాన్స్ వసూళ్లకు తోడయ్యాయి. ప్రస్తుతం మంచి వసూళ్లతో సాగుతున్న ఆ మూవీ.. ఫుల్ రన్ లో ఎంతటి కలెక్షన్సు సాధిస్తుందో వేచి చూడాలి.
