ప్రముఖ కమెడియన్ కన్నుమూత
తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన రోబో శంకర్ తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు.
By: Ramesh Palla | 19 Sept 2025 1:24 PM ISTతమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన రోబో శంకర్ తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా తుది శ్వాస విడిచారు. బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యి, సుదీర్ఘ కాలం పాటు టీవీ షో లు చేయడంతో పాటు, నటిస్తూ మెప్పించాడు. బుల్లి తెర ద్వారా వచ్చిన పాపులారిటీ కారణంగా కోలీవుడ్‌లోనూ ఆఫర్లు వచ్చాయి. వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకున్న శంకర్ కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. చూడ్డానికి కాస్త సీరియస్‌గా ఉన్నప్పటికీ ఆయన కామెడీకి మంచి స్పందన వచ్చేది. రోబో శంకర్ అంటూ చాలా మంది పిలుచుకునే ఈయన ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. 46 ఏళ్ల వయసులో శంకర్ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆయన మృతికి సినిమా ఇండస్ట్రీ వర్గాల వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. స్టాండప్ కమెడియన్‌గా కెరీర్‌ను ఆరంభించిన శంకర్ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్‌గా నిలిచాడు.
వెండి తెరతో పాటు బుల్లితెరపైనా..
శంకర్ మొదట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే ప్రదర్శణల్లో డాన్స్‌లు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించేవాడు. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. ఒక వైపు టీవీ, మరో వైపు సినిమాలు చేస్తూ వచ్చిన రోబో శంకర్ చివరి రోజుల వరకు సినిమాలు చేస్తూనే బుల్లి తెరపై కనిపించాడు. సాధారణంగా వెండి తెరపై గుర్తింపు వచ్చిన వెంటనే చాలా మంది బుల్లి తెరను పక్కన పెట్టేస్తారు. కానీ ఈయన మాత్రం తనకు వచ్చిన గుర్తింపుకు కారణం బుల్లి తెర అని గుర్తు పెట్టుకున్నాడు. అందుకే సినిమాల్లో చేస్తూ కూడా బుల్లి తెరపై కనిపించాడు. ఈ ఏడాదిలోనూ టాప్ కుకు డూప్ కుకు సీజన్ 2, అతు ఇతు ఎతు సీజన్ 4 షో ల్లో కనిపించడం ద్వారా తన అభిమానులకు, ప్రేక్షకులకు కన్నుల వింధు చేశాడు.
విజయ్ బిగిల్ సినిమాలో రోబో శంకర్ కుమార్తె
రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. బిగిల్ సినిమాలో విజయ్ రెడీ చేసే ఫుట్‌బాల్ టీమ్‌లో ఒక క్రీడాకారిణిగా ఉంటుంది. జీ తమిళ్ లో ఆమె పలు షో ల్లో కనిపించింది. ఇక శంకర్ భార్య సైతం ఇండస్ట్రీలో ఉన్నారు. ఆమె నటన రంగంలో ఉండటంతో పాటు, నేపథ్య గాయినిగా కూడా కొనసాగారు. రెండేళ్ల క్రితమే శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇండస్ట్రీ వర్గాల వారు, అభిమానులు ఆందోళన చెందే స్థాయికి ఆయన ఆరోగ్య పరిస్థితి వెళ్లింది. ఆ సమయంలో చాలా బరువు తగ్గడంతో పాటు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా ఆసుపత్రి పాలు అయ్యాడు. అప్పుడే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే ఆందోళన చాలా మంది వ్యక్తం చేశారు. కానీ అదృష్టం కొద్ది ఆసమయంలో ప్రాణాలతో బయట పడ్డాడు. ఆ తర్వాత సినిమాలు, షో లు కూడా చేయడం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
గాడ్స్ జిల్లా సినిమా సెట్‌లో శంకర్‌కి అస్వస్థత
సెప్టెంబర్ 18న చెన్నైలోని గాడ్స్ జిల్లా సినిమా కోసం పని చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయాడు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు, కుటుంబ సభ్యులు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన రక్తపోటు కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స మొదలు పెట్టారు. అప్పటికే కామెర్లకు చికిత్స తీసుకుంటున్నాడు. దాంతో గత నెల రోజుల్లో చాలా బరువు తగ్గాడు. అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి, ఇదే సమయంలో ఇలా ఒక్కసారిగా బీపీ హెచ్చుతగ్గుల కారణంగా 46 ఏళ్ల వయసులోనే రోబో శంకర్ తుది శ్వాస విడిచాడు. ఆయన మృతదేహంను చెన్నైలోని వలసరవక్కంలోని ఇంటికి తరలించారు. అంత్యక్రియలను సెప్టెంబర్ 19న నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు శంకర్‌కు నివాళ్లు అర్పించేందుకు ఆయన ఇంటికి క్యూ కట్టారు.
