Begin typing your search above and press return to search.

స్టాండప్ కామెడీ పేరుతో కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్.. ఏమైందంటే?

ఇటీవల జరిగిన ఒక కామెడీ షోలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసన కామినేని, నిహారిక కొణిదెలపై అనుదీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి.

By:  M Prashanth   |   11 April 2026 4:59 PM IST
స్టాండప్ కామెడీ పేరుతో కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్.. ఏమైందంటే?
X

స్టాండప్ కామెడీ పేరుతో సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన ఘటన ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్‌ కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల ఇటీవల తన షోలో చేసిన కామెంట్లు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ చేసిన రోస్ట్ కామెడీపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతం లో జరిగిన ఒక కామెడీ షోలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఉపాసన కామినేని, నిహారిక కొణిదెలపై అనుదీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, వివాహాల గురించి ప్రస్తావించడం, అలాగే నిహారిక విడాకుల అంశాన్ని కామెడీలోకి తేవడం ఇప్పుడు మెగా అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసింది.

కామెడీలో విమర్శలు సహజమే అయినప్పటికీ, వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంబంధాలు వంటి సున్నితమైన అంశాలను ఎద్దేవా చేయడం సరైంది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ సంపాదన కంటే ఉపాసన ఆస్తి ఎక్కువ అనే వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై చేసిన జోకులు కేవలం వినోదం కంటే అవమానంగా ఉన్నాయని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.

ఆ వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. అంతేకాకుండా గతంలో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ పై కూడా అనుదీప్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో కమెడియన్ ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి. జనసేన పార్టీ నేత సందీప్ పంచకర్ల తీవ్రంగా స్పందిస్తూ.. అనుదీప్ కటికల వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో రోస్ట్ కామెడీ వివాదం మరింత వేడెక్కింది. పశ్చిమ దేశాల్లో ఆ కామెడీకి ప్రాధాన్యం ఉన్నప్పటికీ, భారతీయ సంస్కృతి, మనోభావాలకు అనుగుణంగా కొన్ని పరిమితులు ఉండాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు.

కొందరు అయితే కమెడియన్‌ పై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, కొందరు ఆర్టిస్ట్ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ, అది బాధ్యతతో కూడి ఉండాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఆ ఘటన స్టాండప్ కామెడీ పరిమితులపై మరోసారి చర్చకు దారితీసింది. ఎంటర్టైన్మెంట్ పేరుతో వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీయడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. పరిస్థితి మరింత మారకముందే అనుదీప్ కటికల స్పష్టత ఇవ్వడం లేదా క్షమాపణ చెప్పడం అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరేం జరుగుతుందో.. అనుదీప్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.