కామెడీ పేరుతో చీప్ జోకులు.. స్టాండప్ కమెడియన్ అరెస్ట్
మెగా ఫ్యామిలీ మెంబర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హైదరాబాద్ కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By: M Prashanth | 15 April 2026 3:59 PM ISTమెగా ఫ్యామిలీ మెంబర్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో హైదరాబాద్ కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 14వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం విచారణ నిమిత్తం కాకినాడకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ లో స్టాండప్ కామెడీ షోల ద్వారా గుర్తింపు పొందిన అనుదీప్, ఇటీవల ది టాలీవుడ్ రోస్ట్ షో పేరిట యూట్యూబ్ లో విడుదల చేసిన వీడియోతో వివాదంలో చిక్కుకున్నారు. ఆ వీడియోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కామినేని, అలాగే నిహారిక కొణిదెల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరాలకు దారితీశాయి.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం, ఉపాసన ఆర్థిక స్థితి, నిహారిక వ్యక్తిగత అంశాలపై హాస్యం పేరుతో మాట్లాడడం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనపై జనసేన నేత బడే వెంకట కృష్ణ ఏప్రిల్ 11న కాకినాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అనుదీప్ వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత అనుదీప్ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నట్లు గుర్తించారట. కుటుంబ సభ్యులను కలవడానికి అక్కడికి వెళ్లిన అనుదీప్ ను ఒక పార్కులో ఉన్న సమయంలో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే వివాదం పెరుగుతున్న నేపథ్యంలో అనుదీప్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు తెలిపారు. తన ఉద్దేశం ఎవరినీ కించపరచడం కాదని తెలిపారు.
రోస్టింగ్ ఫార్మాట్ లో భాగంగా మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు. సమాజంలో విడాకులపై ఉన్న ధోరణిని ప్రశ్నించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే, జనసేన వర్గాలు మాత్రం హాస్యం పేరుతో వ్యక్తిగత విషయాలపై దూషణ చేయడం సమంజసం కాదని అంటున్నాయి. క్షమాపణలు చెప్పినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు చట్టపరమైన చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం తదుపరి చర్యలపై స్పష్టత రానుంది. మొత్తానికి అనుదీప్ అరెస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
