ఆ స్టార్ హీరో కం డైరెక్టర్ ఆ చిత్రం స్పూర్తితోనా?
హాలీవుడ్‌లో కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం `కమ్ హోమ్`. ఆధునిక ప్రపంచంలో విడిపోతున్న అనుబంధాలను ప్రతిబింబించే ఒక అందమైన కథను ఇందులో చెప్పారు.
By: Srikanth Kontham | 11 March 2026 9:00 PM ISTహాలీవుడ్‌లో కుటుంబ విలువల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం `కమ్ హోమ్`. ఆధునిక ప్రపంచంలో విడిపోతున్న అనుబంధాలను ప్రతిబింబించే ఒక అందమైన కథను ఇందులో చెప్పారు. ఈ సినిమా కథ ఒక పాత విక్టోరియన్ తరహా ఇంటి చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంటి యజమాని అయిన ఒక వృద్ధ తండ్రి, తన ముగ్గురు పిల్లలు వేర్వేరు నగరాల్లో సెటిల్ అవుతారు. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా బ్రతుకుతుండటం చూసి ఆవృద్ద తండ్రి బాధ పడతాడు. తన చివరి రోజుల్లో అందరినీ ఒకే చోట చూడాలని, వారందరినీ ఏదో ఒక నెపంతో ఆ పాత ఇంటికి పిలిపిస్తాడు.
వచ్చిన ఆ ముగ్గురు తోబుట్టువుల మధ్య ఉన్న పాత గొడవలు, ఈగోలు వారి వ్యక్తిగత జీవిత సమస్యలు ఆ ఇంట్లో ఎలా బయటపడ్డాయి? తండ్రి తన తెలివితేటలతో వారి మధ్య ఉన్న దూరాన్ని ఎలా తగ్గించాడు? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం. మార్క్ రోమానెక్ ఈ చిత్రాన్ని అద్బుతంగా తీర్చిదిద్దాడు. ఆయన గతంలో మానవ సంబంధాలపై తీసిన చిత్రాలకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడీ సినిమా స్పూర్తితోనే ఓ తెలుగు సినిమా తెరకెక్కుతుందని ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఓ స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోతో ఆహ్లాదకరమైన టైటిల్ తో ఓ సినిమా ప్రారంభించారు.
ఆ సినిమా టైటిల్ వింటేనే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. కుటుంబ అనుబంధాల చుట్టు కథలు రాయడం, వాటికి అద్బుతమైన పాత్రల్ని జోడించడంలో అతడు మాస్టర్. తనదైన రైటింగ్ స్కిల్స్ తో మిరాకిల్ చేస్తాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు పాత్రల్ని డిజైన్ చేసి హైలైట్ చేయడంలో స్పెషలిస్ట్. గతంలోనూ ఓ సినిమా విషయంలో సదరు డైరెక్టర్ పై ఇలాంటి స్పూర్తి అనే ఆరోపణ వ్యక్తమైంది. ఈ సినిమా కూడా అచ్చంగా `కమ్ హోమ్` క్లాసిక్ డ్రామాగానే ఉంటుందంటున్నారు. హాలీవుడ్ చిత్రంలో ఒక పాత ఇంటిని కాపాడుకోవడానికి విడిపోయిన కుటుంబ సభ్యులందరూ మళ్ళీ ఎలా కలిశారు అనే పాయింట్ ప్రధానంగా ఉంటుంది.
మన తెలుగు సినిమాలో కూడా ఇదే పాయింట్ హైలైట్ అవుతుందా అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. ఆ ఇల్లు ఆ కుటుంబ గౌరవానికి , పాత జ్ఞాపకాలకు చిహ్నంగా కనిపిస్తుంది. ఒక ఇంటి చుట్టూ కథను అల్లడం అనేది ఈ రెండు సినిమాల్లోని అతిపెద్ద సారూప్యతగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ప్రచార చిత్రాలు రిలీజ్ అయితే క్లారిటీ వస్తుంది. సాధారణంగా ఏ కథకైనా ఓ స్పూర్తి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకునే కథలు పుడుతుంటాయి. పాత్రల విషయంలోనూ ఇలాంటివి చోటు చేసుకుంటాయి.
