హిందీ పరిశ్రమలో రష్మికపై బిగ్ డిబేట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న హైదరాబాద్ టు ముంబై ప్రయాణం గురించి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన కథానాయికగా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
By: Sivaji Kontham | 22 Jun 2026 9:41 AM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న హైదరాబాద్ టు ముంబై ప్రయాణం గురించి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన కథానాయికగా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ట్యాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ సరసన నటించిన బాలీవుడ్ చిత్రం `కాక్‌టైల్ 2` విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న చెప్పిన హిందీ డైలాగ్ డెలివరీ, డిక్షన్ (ఉచ్ఛారణ)పైనా, డ్రెస్సింగ్ సెన్స్ పైనా సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. సినిమాలో రష్మిక హిందీ స్పష్టంగా లేదని, డైలాగులు సరిగ్గా పలకలేక ఇబ్బంది పడిందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అంతేకాదు డ్రెస్సింగ్ సెన్స్ పరంగా నేషనల్ క్రష్ గా పిలుచుకునే రష్మికను కృతి సనోన్ డామినేట్ చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఈ డిబేట్ లో చేరిన రష్మిక ఫ్యాన్స్ మాత్రం తనను వీలున్నంతవరకూ డిపెండ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ లో కృతి సనోన్ తన పీఆర్ స్ట్రాటజీని బలంగా మెయింటెయిన్ చేస్తోందని, రష్మికకు అది ఇంకా అలవాటు కాలేదని కొందరు సమర్థిస్తున్నారు. ఇక `కాక్ టైల్ 2` చిత్రంలో రష్మిక హైదరాబాద్ అమ్మాయిగా నటించిందని కొందరు వ్యాఖ్యానించగా, తను ఢిల్లీ అమ్మాయిగా నటించిందని మరికొందరు తప్పును సరిదిద్దే ప్రయత్నం చేసారు. ఒక నార్త్ అమ్మాయిలా మాట్లాడటంలో రష్మిక తడబడిందనే డిబేట్ కూడా నడిచింది. అయితే హైదరాబాదీ మూలాలున్న దిల్లీ అమ్మాయి డైలాగ్ డెలివరీ అలాగే ఉండాలంటూ కొందరు తనను సమర్థించారు.
బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేయాలనుకుంటే రష్మిక తన హిందీ ఉచ్ఛారణపై మరింత దృష్టి పెట్టాలని లేదా చక్కగా డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని వాడుకుంటే మంచిదని నెటిజన్లు ఉచిత సలహా ఇస్తున్నారు. అంతేకాదు.. హిందీ రివ్యూల్లో కృతి పాత్రకు ఉన్న ప్రాధాన్యత రష్మిక పాత్రకు లేకుండా పోయిందని.. రష్మికపై కుట్ర జరిగిందని ఒక వర్గం ఫ్యాన్స్ విశ్లేషించారు. మరోవైపు ఈ సినిమాలో రష్మిక పాత్ర నిడివి కూడా చాలా తక్కువగా ఉండటంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఇందులో లీడ్ హీరోయిన్‌గా కాకుండా ఒక ఎక్స్‌టెండెడ్ కామియో పాత్రలాగా మాత్రమే అనిపించిందని, ఇంత చిన్న పాత్రకు అంత పెద్ద హీరోయిన్ ఎందుకు ఓకే చెప్పిందో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఇదంతా కృతి పీఆర్ స్ట్రాటజీ అని కూడా విమర్శిస్తున్నారు. అయితే ఇటీవల ప్రమోషన్స్ లో గుంపుగా మీద పడుతున్న జనం నుంచి రష్మికను కాపాడేందుకు కృతి సనోన్ ఒక రక్షక భటుడిలా వ్యవహరించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. నిజానికి రష్మికను ఒక సోదరిలా ఆదరించే కృతి తనపై ఎలాంటి పీఆర్ ట్రిక్స్ ప్లే చేయదని కూడా కొందరు విశ్లేషించారు.
బాలీవుడ్ చిత్రాల కంటే రష్మిక సౌత్ ఇండియన్ సినిమాలు - పాన్-ఇండియా ప్రాజెక్టులలోనే అద్భుతంగా రాణిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలలో రష్మిక నటనను కొనియాడిన ఫ్యాన్స్.. ప్రస్తుతం నటిస్తున్న `ది గర్ల్‌ఫ్రెండ్`, `రణబలి`, `మైసా` వంటి క్రేజీ సౌత్ ప్రాజెక్టులతో సత్తా చాటుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌లలో మంచి పట్టున్న రష్మిక వేగంగా హిందీ నేర్చుకుని ఇక్కడా రాణించాలని కొందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
