పోకిరి కుర్రాళ్లు రౌండప్ చేస్తుంటే పెద్దక్కలా కాపాడింది!
మాల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
By: Sivaji Kontham | 14 Jun 2026 10:00 PM ISTనేషనల్ క్రష్ రష్మికకు ఎంత క్రేజ్ ఉందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన `కాక్‌టెయిల్ 2` త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండటంతో, చిత్ర బృందం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగా ఈ ముగ్గురు తారలు ఇటీవల పూణేలోని ఒక ప్రముఖ మాల్‌కు వెళ్లారు. అయితే సెలబ్రిటీలను చూసేందుకు అభిమానులు భారీగా తరలిరావడంతో ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైన ఆ ఈవెంట్ కాస్తా క్షణాల్లో తీవ్ర గందరగోళంగా మారిపోయింది. గుంపు ఒక్కసారిగా రష్మిక మందన్న వైపు దూసుకువస్తున్న సమయంలో కృతి సనన్ కాపాడేందుకు చేసిన ప్రయత్నం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మాల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో భారీ జనసందోహం నటీనటుల వైపు దూసుకురావడం.. దాంతో షాహిద్, కృతి, రష్మికలు ముందుకు కదలడానికి తీవ్రంగా ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడికి వచ్చిన కొందరు ఆకతాయిలు.. పోకిరి కుర్రాళ్లు నటీనటులకు వీలైనంత దగ్గరగా వెళ్లాలనే పిచ్చితో భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం బద్దలు కొట్టారు. జనం అదుపు తప్పి గాల్లోకి ఎగబడుతుండటంతో ఊహించని ఈ పరిణామానికి ప్రమోషనల్ ఈవెంట్‌ను మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
ఈ తోపులాట- గందరగోళం మధ్యలో షాహిద్ కపూర్ జనం గుంపు నుండి ఎలాగోలా బయటపడటానికి ప్రయత్నిస్తూ తీవ్ర అసహనంతో కనిపించాడు. అదే సమయంలో అక్కడ రష్మిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆ సమయంలో కృతి సనన్ ఏమాత్రం కంగారు పడకుండా.. రష్మిక మందన్నను గట్టిగా పట్టుకుని, నెట్టుకుంటూ వస్తున్న గుంపు నుండి ఆమెకు రక్షణ కవచంలా నిలిచింది. సెక్యూరిటీ సిబ్బంది వారిని బయటకు తీసుకువచ్చే వరకు కృతి చాలా అప్రమత్తంగా ఉంటూ రష్మికకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక పెద్ద అక్కలా ఆ జనసముద్రం నుండి జాగ్రత్తగా ముందుకు నడిపించింది.
కృతి సనన్ చేసిన ఈ గొప్ప పనిని చూసి నెటిజన్లు - అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన చిన్న చెల్లిని కాపాడుకుంటున్నట్టు కృతి రష్మికను ప్రొటెక్ట్ చేసిన విధానం అద్భుతం.. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం చాలా ప్యూర్! అని ఒకరు కామెంట్ చేయగా... కృతి నిజంగా పెద్దక్కనే తలపించింది.. పొడవాటి పర్సనాలిటీ ఉన్న అమ్మాయి పవర్ ఏంటో చూపించింది! అంటూ మరికొందరు కొనియాడారు. అయితే అదే సమయంలో మాల్‌లో సరైన భద్రతా ఏర్పాట్లు చేయని నిర్వాహకులపై- హద్దులు మీరి ప్రవర్తించిన కొంతమంది పోకిరి కుర్రాళ్ల ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న `కాక్‌టెయిల్ 2`చిత్రం 2012లో వచ్చిన సూపర్ హిట్ `కాక్‌టెయిల్` కి సీక్వెల్‌గా వస్తోంది. ఇది ఆసక్తికరమైన ముక్కోణ ప్రేమ కథతో తెరకెక్కింది. జూన్ 19న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. సినిమా స్క్రీన్‌పై షాహిద్ కపూర్ కోసం ఈ ఇద్దరు భామలు పోటీ పడబోతున్నారు కానీ... రియల్ లైఫ్‌లో మాత్రం ఒకరికొకరు తోడుగా ఉన్నారని ప్రూవైంది. నిజంగా కష్ట సమయంలో తోటి నటిని కాపాడుకుని కృతి సనన్ రియల్ హీరో అనిపించుకుంది.
