రష్మిక మందన్న మొదటి A-రేటెడ్ ఫిలిమ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో మొదటిసారి ఒక ఘాటైన రొమాంటిక్ `ఏ` రేటెడ్ సినిమాలో నటించారు.
By: Sivaji Kontham | 14 Jun 2026 10:14 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో మొదటిసారి ఒక ఘాటైన రొమాంటిక్ `ఏ` రేటెడ్ సినిమాలో నటించారు. బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన `కాక్‌టెయిల్ 2` చిత్రానికి సెన్సార్ బోర్డ్ (CBFC) తాజాగా A సర్టిఫికేట్ జారీ చేసింది. సాధారణంగా రష్మిక ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ U లేదా యుఏ సర్టిఫికేట్‌లతోనే వచ్చాయి. గతంలో `యానిమల్` చిత్రానికి `ఏ` సర్టిఫికేట్ వచ్చినా.. అది భారీ రక్తపాతం, వయలెంట్ యాక్షన్ వల్ల వచ్చింది. కానీ ఇప్పుడు రానున్న `కాక్‌టెయిల్ 2` మాత్రం పూర్తిగా ఘాటైన శృంగార సన్నివేశాలు, రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిండి ఉండటం వల్లే వయోజనులకు మాత్రమే (అడల్ట్స్ ఓన్లీ) అని సెన్సార్ బోర్డు తేల్చేసింది.
ఈ శుక్రవారం -జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే కొన్ని పరిమిత స్క్రీన్లలో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి `ఏ` సర్టిఫికేట్ లభించిన విషయం వెలుగులోకి వచ్చింది. రష్మికతో పాటు గ్లామరస్ బ్యూటీ కృతి సనన్‌కు కూడా ఇది కెరీర్‌లో మొదటి అడల్ట్ ఫిల్మ్ కావడం గమనార్హం. ఈ చిత్రంలో కృతి సనన్ మునుపెన్నడూ చూడని బోల్డ్ - గ్లామ్ లుక్‌లో కనిపించనున్నారు. `తేరే ఇష్క్ మే` చిత్రంలో ఎంతో ఇంటెన్స్ రోల్ పోషించిన కృతి.. ఇందులో ఇలాంటి పూర్తి బోల్డ్ అవతారంలోకి మారడం చూసి అభిమానులు సైతం షాక్‌కు గురవుతున్నారు.
గతంలో 2012లో వచ్చిన `కాక్‌టెయిల్` చిత్రం సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోన్, డయానా పెంటిల మధ్య నడిచే ముక్కోణపు ప్రేమకథగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. ముఖ్యంగా ఆ సినిమా దీపికా పదుకోన్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అయితే ఆ మొదటి భాగం సెకండ్ హాఫ్‌లో కాస్త మెలోడ్రామాగా మారినా... ఈ సరికొత్త సీక్వెల్ మాత్రం మొదటి నుండి చివరి వరకు చాలా కూల్‌గా, హాయిగా సాగిపోతుందని నిర్మాత దినేష్ విజన్ ట్రైలర్ లాంచ్‌లో వెల్లడించారు. అయినా థియేటర్లలో యూత్‌ను ఆకట్టుకునేలా ఇందులో బోల్డ్ సీన్స్ మోతాదు కాస్త గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
సినిమా ట్రైలర్ - కథనం చూస్తే.. 2012 నాటి మొదటి భాగం టెంప్లేట్‌నే మేకర్స్ ఫాలో అయినట్లు స్పష్టమవుతోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ విపరీతమైన స్టైల్, అందమైన సముద్ర తీరాలు, హాట్‌నెస్ - సెక్సీనెస్ కవ్విస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రోమో కేవలం గ్లామర్‌ను నమ్ముకుని కాస్త డొల్లగా ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. సినిమాలో ఏదైనా బలమైన కంటెంట్ ఉందా లేదా అనేది కేవలం ట్రైలర్ చూసి ఇప్పుడే అంచనా వేయలేం. ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉందని... ఇది ఒక క్వీర్ -స్వలింగ ప్రేమకథ అనే పుకార్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాలంటే జూన్ 19 వరకు ఆగాల్సిందే.
మొదటి భాగం `కాక్‌టెయిల్` అంతటి భారీ బ్లాక్‌బస్టర్ కావడానికి సంగీత దర్శకుడు ప్రీతమ్ అందించిన అద్భుతమైన పాటలు ఒక ముఖ్య కారణం. కానీ ఈ సీక్వెల్ చిత్రానికి సంబంధించిన ప్రోమో - సాండ్‌ట్రాక్ మొదటి భాగం అంత ఆకట్టుకునేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. షాహిద్ కపూర్‌తో పాటు కృతి సనన్, రష్మిక మందన్నల బోల్డ్ అండ్ రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ ఘాటైన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
