టాలీవుడ్ నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన రేవంత్
తెలుగు చిత్రసీమలో దశాబ్ధాలుగా నలుగుతున్న పెద్ద సమస్య కార్మికులకు సముచిత భత్యం.
By: Sivaji Kontham | 29 Oct 2025 2:58 PM ISTతెలుగు చిత్రసీమలో దశాబ్ధాలుగా నలుగుతున్న పెద్ద సమస్య కార్మికులకు సముచిత భత్యం. పెరిగిన అధిక ధరలతో ఆర్థిక భారంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇటీవల 30శాతం భత్యాల పెంపును వర్తింపజేయాలని నిర్మాతల మండలి- ఫిలింఛాంబర్ వర్గాలతో కార్మికులు పోరాటం సాగించిన సంగతి తెలిసిందే.
కార్మిక వేతనాల పెంపునకు నిర్మాతలు అంగీకరించకపోవడంతో దాదాపు నెల రోజుల పాటు పరిశ్రమలో స్థబ్ధత నెలకొంది. షూటింగులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఇండస్ట్రీ గందరగోళంలో పడింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, ఎఫ్.డి.సి.ఛైర్మన్ దిల్ రాజు సహా పలువురు సినీపెద్దల చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. 15 శాతం వేతన పెంపు సహా కొన్నిటికి నిర్మాతలు అంగీకరించడంతో కార్మిక సమాఖ్య (ఫెడరేషన్) దిగొచ్చింది. ప్రస్తుతం నిరాఠంకంగా షూటింగులు జరుగుతున్నాయి.
నిర్మాతలతో ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీకార్మికులు తమ సమస్యకు పరిష్కారం చూపే దిశగా ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించుకున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సినీకార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఉచిత ఇళ్ల స్థలాలు, 10కోట్ల సంక్షేమ నిధి సహా పలు పథకాలను ప్రకటించారు. సినీకార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పిస్తామని, కార్పొరెట్ స్కూల్ ని ప్రారంభించి కేజీ టు ఇంటర్ ఉచిత విద్యనందిస్తామని కూడా హామీనిచ్చారు.
అయితే వీటితో పాటు ముఖ్యమంత్రి ఉదారంగా చేసిన ఓ ప్రకటన నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఇకపై ఏ సినిమా రిలీజైనా లాభాల్లో 20శాతం సినీకార్మికులకు అందజేయాలని, అలా చేయని పక్షంలో టికెట్ రేట్ల పెంపునకు జీవో జారీ చేయలేమని స్పష్ఠంగా ప్రకటించారు రేవంత్. దీని అర్థం ప్రతి రూ.1,00,000 లాభంలో రూ.20,000 సినీకార్మికుల సంక్షేమ నిధికి నిర్మాతలు జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి కోటి రూపాయల లాభం నుంచి 20లక్షల నిధిని కార్మికుల కోసం కేటాయించాలి. ప్రతి 100 కోట్ల లాభాల నుంచి 20 కోట్లు సినీకార్మికులకు ఇవ్వాలి.
నిజానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన వినడానికి ఎంతో ఉదారంగా ఉన్నా కానీ, ఇది ఆచరణలో ఎలాంటి సవాళ్లను తీసుకొస్తుందో ఇప్పుడే చెప్పలేం. దీనిపై నిర్మాతల నుంచి కూడా ఒక వెర్షన్ తొందర్లోనే వినిపించక మానదు. అసలే సినిమాల నిర్మాణం తలకు మించిన భారంగా మారిందని నిర్మాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రొడక్షన్ కాస్ట్ అదుపుతప్పడం, కాస్ట్ ఫెయిల్యూర్ వంటివి పెను విపత్తుగా మారుతున్నాయి. పెరిగిన జీత భత్యాలు నిర్మాతలు రోడ్డున పడేలా చేస్తున్నాయనే ఆవేదన ఉంది. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ ప్రకటన నిజంగానే నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది.
