Begin typing your search above and press return to search.

మూడేళ్ల జైలు చ‌ట్టం ఉన్నా పైర‌సీ మాఫియాపై ఉదాసీన‌త‌?

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పైరసీ మాఫియా ఇంకా యథేచ్ఛగా సాగుతుండటంపై చిత్ర పరిశ్రమ ఆందోళన చెందుతోంది.

By:  Sivaji Kontham   |   17 March 2026 10:35 AM IST
మూడేళ్ల జైలు చ‌ట్టం ఉన్నా పైర‌సీ మాఫియాపై ఉదాసీన‌త‌?
X

సినిమాటోగ్రాఫ్ సవరణ బిల్లు- 2023 ప్రకారం పైరసీకి పాల్పడే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష.. సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం వరకు భారీ జరిమానా విధించే కఠినమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. థియేటర్లలో అనధికారికంగా ఆడియో-విజువల్ రికార్డింగ్ చేయడం లేదా పైరసీ కాపీలను వ్యాప్తి చేయడం వంటి చర్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని బలోపేతం చేసింది. గతంలో ఉన్న చట్టాల కంటే ఇవి ఎంతో శక్తివంతమైనవి అయినా కానీ.. క్షేత్రస్థాయిలో వీటి అమలు తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2023లోనే చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది. కానీ ఇప్ప‌టికీ దీనిపై తాత్సారం జ‌రుగుతూనే ఉంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పైరసీ మాఫియా ఇంకా యథేచ్ఛగా సాగుతుండటంపై చిత్ర పరిశ్రమ ఆందోళన చెందుతోంది. చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు విధించే అవకాశం ఉన్నా.. అధికారుల ఉదాసీనత వల్ల పైరసీదారులు పట్టుబడటం లేదని విమర్శలు వస్తున్నాయి.

అయితే ఇటీవ‌ల‌ తెలంగాణ ప్రభుత్వం పైరసీపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటిస్తున్నా.. కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. నిందితులను గుర్తించి.. చట్టంలోని మూడేళ్ల జైలు శిక్ష నిబంధనను కఠినంగా అమలు చేయడంలో ఎందుకు తాత్సారం జరుగుతుందనేది ఒక‌ ప్రశ్నగా మారింది.

పైరసీ వల్ల కేవలం నిర్మాతలే కాకుండా వేల సంఖ్యలో కార్మికులు, పంపిణీదారులు నష్టపోతున్నారు. ఈ కొత్త బిల్లులో సెన్సార్ సర్టిఫికేషన్లను వయస్సు రీత్యా వర్గీకరించడం.. సర్టిఫికేట్లకు శాశ్వత గుర్తింపు ఇవ్వడం వంటి సానుకూల మార్పులు ఉన్నా కానీ.. పైరసీని అరికట్టడమే ప్రధాన లక్ష్యం కావాలి. అధికారులు ఈ చట్టాన్ని ఆయుధంగా చేసుకుని పైరసీ నెట్‌వర్క్‌లను ఛేధించకపోతే.. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా సినిమా పరిశ్రమకు రక్షణ ఉండదు.

పైర‌సీపై నిఘా.. తెలంగాణ ప్ర‌భుత్వానికి హ్యాట్సాఫ్‌:

అయితే ఇటీవ‌లి ఈ ప‌రిస్థితిని స‌మీక్షించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా పైరసీని అరికట్టేందుకు అత్యంత కఠినమైన చర్యలు చేపట్ట‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. కొత్త సినిమాలు విడుదలైన వెంటనే ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం వల్ల నిర్మాతలు, పంపిణీదారులు ఎదుర్కొంటున్న భారీ ఆర్థిక నష్టాలను అరికట్టడమే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(సీఎస్‌బి) రంగంలోకి దిగింది. థియేటర్లలో సినిమాలను అక్రమంగా రికార్డ్ చేసినా, సోషల్ మీడియా లేదా ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా పైరసీ కాపీలను షేర్ చేసినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ నేరాలకు పాల్పడే వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 3 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తామని.. అవసరమైతే సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం వరకు జరిమానా వసూలు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పైరసీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ లో పైరసీ కంటెంట్‌ను షేర్ చేసే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఈ విభాగం నిరంతరం కన్నేసి ఉంచుతుంది. ఈ ప్రయత్నాలను మరింత బలోపేతం చేసేందుకు తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి ప్రత్యేక యాంటీ పైరసీ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. పైరసీ లింకులను వెంటనే తొలగించడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో ఈ బృందం సమన్వయం చేసుకుంటుంది. ప్రజలు కూడా పైరసీని ప్రోత్సహించకుండా.. కేవలం థియేటర్లు లేదా అధికారిక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలోనే సినిమాలు చూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అయితే 2023లోనే సినిమాటోగ్రాఫ్ బిల్లు అమ‌ల్లోకి వ‌చ్చినా ఇప్ప‌టివ‌ర‌కూ ఎందుకు తాత్సారం జ‌రిగిందో అధికారులే వెల్ల‌డించాల్సి ఉంటుంది.