Begin typing your search above and press return to search.

సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్‌కు బ్రేక్ !

కొంత కాలంగా సినిమాటిక్ యూనివర్స్ అనే పదం మంత్రంలా మారిపోయింది. ఒక సినిమాలోని పాత్రలను మరొక సినిమాలో కలుపుతూ పెద్ద ప్రపంచాన్ని సృష్టించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది.

By:  Srikanth Kontham   |   7 July 2026 11:00 PM IST
సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్‌కు బ్రేక్ !
X

కొంత కాలంగా సినిమాటిక్ యూనివర్స్ అనే పదం మంత్రంలా మారిపోయింది. ఒక సినిమాలోని పాత్రలను మరొక సినిమాలో కలుపుతూ పెద్ద ప్రపంచాన్ని సృష్టించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. లోకేష్ కనగరాజ్ ఎల్‌సీయూ (LCU) , ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలను పెంచాయి. అయితే ఇప్పుడీ ట్రెండ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. మేకర్స్ యూనివర్స్ పక్కన పెట్టి స్టాండ్-అలోన్ చిత్రాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మార్పుకు ప్రధాన కారణం కంటెంట్ ఫెటీగ్.

వరుసగా యూనివర్స్ సినిమాలు రావడం వల్ల ప్రేక్షకులు అదే తరహా కథనాలకు అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల ప్రతి కొత్త సినిమా పాత కథకు కొనసాగింపులా కనిపిస్తోంది తప్ప కొత్తదనాన్ని పంచడం లేదు. అలాగే యూనివర్స్ అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతి సినిమాను మరొక దానితో ముడిపెట్టడం వల్ల దర్శకులు సృజనాత్మకతను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోతున్నారు. సినిమా విఫలమైతే మొత్తం యూనివర్స్ పై ప్రభావం చూపే ప్రమాదం ఉండటం మేకర్స్‌ను ఆలోచనలో ప‌డేస్తుంది.

లోకేష్ కనగరాజ్ భారీ యూనివర్స్ కోసం ఏళ్ల తరబడి సమయం కేటాయించాల్సి రావడం వల్ల సొంత శైలిని కోల్పోతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రశాంత్ వర్మ సైతం ఒకే యూనివర్స్ చుట్టూ తిరగడం కంటే ప్రతి ప్రాజెక్టును విభిన్నమైన జోనర్లలో ప్రయత్నించడం ద్వారా వైవిధ్యం చూపాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకే ప్రపంచంలో బంధీలు కాకుండా విడివిడిగా అద్భుతమైన కథలను చెప్పడం ద్వారా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించవచ్చని గ్రహిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

స్టాండ్-అలోన్ సినిమాల వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే? కథాంశంపై పూర్తి పట్టు సాధించడం. ఇతర సినిమాల రిఫరెన్సులతో సంబంధం లేకుండా ఆ సినిమా కథే ప్రధానంగా ఉండటం వల్ల ప్రేక్షకుడు కథలోకి త్వరగా ఇన్వాల్వ్ అవుతాడు. ఇది సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తుంది. స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను ఏ ఇతర యూనివర్స్‌తోనూ ముడిపెట్టకుండా స్వతంత్రమైన కథాంశంతో రూపొందించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది దర్శకులకు కూడా స్వేచ్ఛను ఇస్తుంది.

అయితే యూనివర్స్ ట్రెండ్ పూర్తిగా అంతరించిపోతుందని దీని అర్థం కాదు. కానీ మేకర్స్ ఇప్పుడు కథలోని లోతును, స్క్రీన్‌ప్లేలోని కొత్తదనాన్ని పక్కన పెట్టి క్రాస్-ఓవర్ల కోసం మాత్రమే యూనివర్స్ ప్లాన్ చేయకూడదని నిర్ణయించుకుంటున్నారు. ఇది ఆరోగ్యకరమైన మార్పు. ఒక సినిమా అద్భుతంగా ఉంటే దానికే ఒక సీక్వెల్ రావచ్చు. కానీ ప్రతిదాన్ని యూనివర్స్‌గా మలచాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో కథే హీరోగా నిలిచే సినిమాలదే హవా అని చెప్పొచ్చు. కాలం మారుతోన్న కొద్దీ ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. ఇప్పుడు వారికి కావాల్సింది గందరగోళం లేని బలమైన కథలు. యూనివర్స్ పేరుతో కథను సాగదీయడం కంటే చిన్న కథను కూడా గొప్పగా చెప్పడం ఇండస్ట్రీకి అవసరం.