Begin typing your search above and press return to search.

సినిమాటిక్ యూనివర్స్‌ల ట్రెండ్‌కు బ్రేక్!

తెలుగులో హను-మాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇత‌డు కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి భారీ ప్రకటనలు చేశాడు.

By:  Srikanth Kontham   |   2 April 2026 4:00 PM IST
సినిమాటిక్ యూనివర్స్‌ల ట్రెండ్‌కు బ్రేక్!
X

సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్‌కు బ్రేకులు పడుతున్నట్లు కనిపిస్తోంది. హాలీవుడ్ మార్వెల్ తరహాలో మన దగ్గర కూడా కథలను, పాత్రలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ భారీ ప్రాజెక్టులు నిర్మించాలని దర్శకులు ఉత్సాహం చూపించారు. అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు , బాక్సాఫీస్ సమీకరణాల నేపథ్యంలో తాజాగా అగ్ర దర్శకులంతా తమ యూనివర్స్ ఆలోచనలను పక్కన పెట్టి స్వతంత్రంగా స్టాండ్-అలోన్ చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు లోకేష్ కనగరాజ్. తన ఎల్ సీయూ ద్వారా కమల్ హాసన్, విజయ్, కార్తీ వంటి స్టార్లను ఒకే తాటిపైకి తెచ్చిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఆ త‌ర్వాత ఎల్ సీయూ ను తాత్కాలికంగా ప‌క్క‌న బెట్టాడు. సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌తో తెర‌కెక్కించిన కూలీ ఎల్‌సీయూలో భాగం కాద‌న్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం లొకేష్ న‌టుడిగా కూడా తెరంగేట్రం చేస్తున్నాడు. ఎల్ సీయూలో తీసిన సినిమాలు ఒకే తరహా డ్రగ్ మాఫియా నేపథ్యంలో కథలు చెప్పడం వల్ల ప్రేక్షకుల్లో కొంత అసహనం వచ్చే అవకాశం ఉందని భావించిన లోకేష్ వైవిధ్యమైన కథల వైపు మొగ్గు చూపుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. కెప్టెన్ కుర్చీ ప‌క్క‌న బెట్టి నటుడిగా మార‌డం వెనుక కూడా ఏదో స్ట్రాట‌జీ ఉండే ఉంటుంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

తెలుగులో హను-మాన్ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇత‌డు కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి భారీ ప్రకటనలు చేశాడు. కానీ ప్ర‌స్తుతానికి వాటిని ప‌క్క‌న‌బెట్టి జై హనుమాన్ సీక్వెల్స్ కంటే ముందుగా ఇతర స్వతంత్ర చిత్రాలను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హిట్ యూనివర్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లను అందించిన శైలేష్ కొలను కూడా ప్రస్తుతం తన రూటు మార్చారు. వరుసగా యూనివర్స్ సినిమాలు చేయడం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గించుకోవడానికి స్టాండ్-అలోన్ సినిమాలే మేలని భావిస్తున్నాడు.

అలాగే బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. షారుఖ్ ఖాన్ పఠాన్ సాధించిన ఘనవిజయంతో ఈ యూనివర్స్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. ముఖ్యంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైగర్ వర్సెస్ పఠాన్ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా నిలిపివేసారు. ఈ వార్త అభిమానుల్ని తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలకు భారీ బడ్జెట్ , స్టార్ హీరోల కాల్‌షీట్లు సర్దుబాటు చేయడం ప్రధాన సమస్యగా మారింది. ఒక సినిమా ఫలితం మరో సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉండటం వల్ల నిర్మాతలు కూడా రిస్క్ తీసుకోవడానికి వెనకాడుతున్నారు. పాత్రల మధ్య క్రాస్-ఓవర్లు పెట్టడం వల్ల కథలో సహజత్వం లోపిస్తుందనే విమర్శలు లేక‌పోలేదు. అందుకే దర్శకులు తాత్కాలికంగా యూనివ‌ర్శ్ కు బ్రేక్ ఇచ్చారు.