టికెట్ రేట్లా? పాప్‌కార్న్ రేట్లా?.. మళ్లీ అదే చర్చ..
థియేటర్ లో పాప్ కార్న్ కొనాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టమని, కానీ మూవీ చూడాలంటే మాత్రం టికెట్ కంపల్సరీగా కొనాల్సిందేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
By: M Prashanth | 7 July 2026 1:15 PM ISTసినిమా థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గడానికి అసలు కారణం ఏంటి? టికెట్ ధరలా? లేక పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ వంటి బేవరేజెస్ ధరలా? ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది. నిర్మాత నాగవంశీ చేసిన లేటెస్ట్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఆ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ప్రేక్షకులు మాత్రం సమస్య ఒక్కటే కాదని, టికెట్ ధరలు, థియేటర్ లోని ఫుడ్ రేట్లు రెండూ సామాన్యుడిపై భారం పెడుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
లెనిన్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ.. "టికెట్ రేటు ఎక్కువగా ఉందని సినిమాకు వెళ్లడం మానేసిన వాళ్లు ఎక్కువా? లేక లోపల పాప్ కార్న్, వాటర్ బాటిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో వెళ్లడం మానేసిన వాళ్లు ఎక్కువా? దీనిపై ఒక సర్వే చేస్తే అసలు విషయం తెలుస్తుంది. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నా అభిప్రాయాన్ని మాత్రమే చెబుతున్నాను" అని అన్నారు. ఆ వ్యాఖ్యలతో చర్చ మళ్లీ మొదలైంది.
సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్ లో పాప్ కార్న్ కొనాలా వద్దా అనేది ఆడియన్స్ ఇష్టమని, కానీ మూవీ చూడాలంటే మాత్రం టికెట్ కంపల్సరీగా కొనాల్సిందేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారీ సినిమాల విడుదల సమయంలో స్పెషల్ పర్మిషన్లతో టికెట్ ధరలు పెంచడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ పై ఎక్స్ ట్రా భారం పడుతోందని నెటిజన్లు చెబుతున్నారు.
ఇక మల్టీప్లెక్సుల్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ ధరలు కూడా చాలాకాలంగా విమర్శలకు గురవుతున్నాయి. బయట తక్కువ ధరకు లభించే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ థియేటర్లలో పలుమార్లు ఎక్కువ ధరకు విక్రయిస్తుండటంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబం సినిమా చూడటానికి వెళ్లితే టికెట్లతో పాటు ఆహార పదార్థాల ఖర్చు కూడా కలిపి మొత్తం వ్యయం భారీగా పెరుగుతోందని అంటున్నారు. దీంతో కొంతమంది థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీలో సినిమా వచ్చే వరకు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు థియేటర్ల యాజమాన్యాలు మాత్రం తమకు టికెట్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో పెద్ద భాగం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకే వెళ్తుందని చెబుతున్నాయి. నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతాలు, విద్యుత్ బిల్లులు వంటి వ్యయాలను భర్తీ చేయడానికి ఫుడ్ అండ్ బెవరేజెస్ విక్రయాలే మెయిన్ సోర్స్ గా మారాయని వారి వాదన. ఆ అంశంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. థియేటర్లలో బేవరేజెస్ రేట్లు తగ్గితే ఫ్యామిలీ ఆడియన్స్ మరింతగా థియేటర్లకు వస్తారని కొందరు అంటుండగా, మరికొందరు టికెట్ రేట్లు కూడా తగ్గించాలని సూచించారు.
ఏదేమైనా టికెట్ రేట్లు, పాప్ కార్న్ ధరలు అనే రెండు అంశాలూ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించాలంటే ఏ ఒక్క అంశంపైనే కాకుండా, సినిమా చూడటం మొత్తం కుటుంబానికి అందుబాటులో ఉండేలా ఖర్చు తగ్గించే దిశగా పరిశ్రమ, థియేటర్ యాజమాన్యాలు ఆలోచించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
