Begin typing your search above and press return to search.

వినాయ‌కుడితో క్రైమ్? సినిమా పిచ్చి ఉండాలి కానీ ఇలాంటి పిచ్చి త‌గ‌దు!

వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా మండపాల్లో రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది.

By:  Sivaji Kontham   |   15 Sept 2026 9:44 AM IST
వినాయ‌కుడితో క్రైమ్? సినిమా పిచ్చి ఉండాలి కానీ ఇలాంటి పిచ్చి త‌గ‌దు!
X

వినాయక చవితి వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా మండపాల్లో రకరకాల రూపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాలం మారుతున్న కొద్దీ కొందరు నిర్వాహకులు సినిమా క్రేజ్ తో హద్దులు మీరి ప్రయోగాలు చేస్తున్నారు. ఒక విగ్రహంలో `పుష్ప` సినిమా స్టైల్‌ను పోలిన భంగిమలు.. మరో విగ్రహాన్ని రణ్‌బీర్ కపూర్ భారీ మెషిన్ గన్ ఊచకోత (యానిమ‌ల్) సినిమా పోస్టర్ లేదా లుక్ స్ఫూర్తితో తీర్చిదిద్దడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దేవుడి విగ్రహాలను ఇలా సినిమా యాక్షన్ సీన్ల తరహాలో క్రైమ్ మోడ్ లో చూపించడం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సినిమా పిచ్చి ఉండటం వేరు... కానీ దేవుడిని కూడా దానిలోకి లాగడం ఎంతమాత్రం సరికాదని విమర్శకులు మండిపడుతున్నారు. వినాయకుడితో ఏకంగా క్రైమ్ చేయిస్తున్నట్లుగా విగ్రహాలను రూపొందించడం ఫన్‌గా అనిపించకపోగా.. పవిత్రమైన దేవుళ్లతో ఆటలాడుతున్న భావనను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమా తారలు, రాజకీయ నాయకుల వేషధారణలు వేయడం లేదా విగ్రహాల చేతిలో ఆయుధాలు పెట్టి గ్యాంగ్‌స్టర్ లుక్స్ ఇవ్వడం వినాయకుడిని చూసే వారికి సరదా కానేకాదు.

ఇలాంటి చెత్త ఐడియాలజీతో, పబ్లిసిటీ స్టంట్ల కోసం వినాయక విగ్రహాల రూపకల్పనను మార్చడం నిజంగా హాస్యాస్పదమని ప్రజలు భావిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజించే వినాయక మండపాలను సినిమా పోస్టర్ల ప్రదర్శనశాలలుగా మార్చడం సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేయడమే అవుతుంది. కేవలం ట్రెండింగ్ కోసం, సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దేవుడి పవిత్రతను మంటగలుపుతున్న ఈ పోకడలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి పండుగకు ఒక పవిత్రత, సాంప్రదాయ విలువలు ఉంటాయి. వినాయక చవితిని విజ్ఞానానికి, ప్రశాంతతకు ప్రతీకగా జరుపుకుంటారు. కానీ ఇలాంటి వికృత చేష్టలు... సినిమా మోజుతో కూడిన విగ్రహాల ఏర్పాటు భావితరాలకు తప్పుడు సంకేతాలను పంపుతాయి. ఇప్పటికైనా నిర్వాహకులు, యువత ఇలాంటి చారిత్రక- సాంస్కృతిక విధ్వంసకర ఆలోచనలకు స్వస్తి పలికి దేవుడి విగ్రహాలను సంప్రదాయబద్ధంగా పూజించాలని భ‌క్తులు కోరుతున్నారు.