బెట్టింగ్ యాప్స్ కేసు.. సీఐడీ విచారణకు హాజరైన నిధి, శ్రీముఖి
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సీఐడీ. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు ప్రముఖులను విచారిస్తున్నారు సీఐడీ అధికారులు.
By: Sravani Lakshmi Srungarapu | 21 Nov 2025 6:17 PM ISTబెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సీఐడీ. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు ప్రముఖులను విచారిస్తున్నారు సీఐడీ అధికారులు. అందులో భాగంగానే నవంబర్ 21న లక్డీకపూల్ లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి మరియు అమృత చౌదరి.
ప్రస్తుతం సీఐడీ అధికారులు ఈ ముగ్గురినీ విచారణ చేస్తున్నారు. కాగా జీత్ విన్ అనే బెట్టింగ్ సైట్ ను ప్రమోట్ చేసినందుకు గానూ నిధి అగర్వాల్ ను, జంగిల్ రమ్మీ యాప్ ను ప్రమోట్ చేసినందుకు గానూ యాంకర్ శ్రీముఖిని, పలు గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా యాంకర్ అమృత చౌదరికి నోటీసులిచ్చిన సీఐడీ ఇప్పుడు వారిని విచారణ చేస్తోంది.
ఆరా అంతా దానిపైనే!
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి గల రీజన్స్ తో పాటూ పలు కీలక విషయాలను సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం సీఐడీ అధికారుల దృష్టంతా ఆర్థిక లావాదేవీలపైనే ఉందని తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్ కోసం వచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ అకౌంట్స్ లో జమ అయింది? హవాలా మార్గాల ద్వారా ఏమైనా పేమెంట్స్ జరిగాయా అనే అంశాలపై సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇప్పటికే పలువురిని విచారణ చేసిన సీఐడీ
కాగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు మొత్తం 29 మందిపై సీఐడీ కేసులు నమోదు చేసి విచారణ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి, విష్ణు ప్రియ, సిరి హనుమంతును విచారణ చేసిన సీఐడీ ఇవాళ నిధి అగర్వాల్, శ్రీముఖిని విచారణ చేస్తోంది. ఈ కేసులో సెలబ్రిటీలు కేవలం ప్రచార కర్తలుగానే ఉన్నారా లేదా దీంట్లో వారి పాత్ర ఎక్కువగా ఉందా అనే యాంగిల్ లో కూడా సీఐడీ దర్యాప్తు జరుపుతోంది.
