తెలుగు సినిమాలకు చుక్కలు చూపిస్తున్న లేటెస్ట్ మూవీ.. ఈ క్రేజ్ ఏంటి స్వామి!
ఈ వీకెండ్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ముఖ్యంగా ‘వదల’, ‘రాజా ది రాజా’, ‘ఓ సుకుమారి’లైన్ లో వున్నాయి.
By: Madhu Reddy | 17 July 2026 1:30 PM ISTఈ వీకెండ్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ముఖ్యంగా ‘వదల’, ‘రాజా ది రాజా’, ‘ఓ సుకుమారి’లైన్ లో వున్నాయి. కానీ వీటన్నిటినీ పక్కనపెట్టి హైదరాబాద్ బుకింగ్ చార్ట్స్‌లో ఒక హాలీవుడ్ సినిమా టాప్‌లో దూసుకుపోతోంది. అదే గ్రేట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్ "ది ఒడిస్సీ"మూవీ. గంటకు ఏకంగా 8 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతూ ఈ చిత్రం ఇక్కడి మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను ఊపేస్తోంది. అసలు మన తెలుగు సినిమాలను కాదని, ఈ ఇంగ్లీష్ సినిమా కోసం ప్రేక్షకులు ఎందుకు ఎగబడుతున్నారు? ఇందులో అంతలా ఏముంది? ఆ విశేషాలు చూద్దాం ..
నోలన్ బ్రాండ్ ఇమేజ్ - గ్రీకు ఇతిహాసం మ్యాజిక్:
హోమర్ రాసిన జగత్ప్రసిద్ధ గ్రీకు ఇతిహాసం 'ది ఒడిస్సీ' ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ట్రోజన్ యుద్ధం తర్వాత తన సొంత రాజ్యానికి, భార్యాపిల్లల వద్దకు చేరుకోవడానికి ఒడిస్సియస్ అనే వీరుడు పదేళ్ల పాటు సముద్ర మార్గంలో చేసిన సాహసోపేతమైన పోరాటమే ఈ కథ. దీనికి నోలన్ మార్క్ స్క్రీన్ ప్లే, విజువల్స్ తోడుకావడంతో సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళింది. ఇక 'ఓపెన్‌హైమర్' సినిమా మన తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు క్లిష్టంగా అనిపించినా, ఈసారి నోలన్ పూర్తి యాక్షన్, ఎమోషన్స్ నిండిన అడ్వెంచర్ డ్రామాను ఎంచుకోవడంతో ఇక్కడి జనాలకు బాగా కనెక్ట్ అవుతోంది.
అద్భుతమైన యాక్టర్స్ :
ఈ సినిమాలో ఒడిస్సియస్ పాత్రలో హాలీవుడ్ స్టార్ హీరో మ్యాట్ డామన్ అద్భుత నటన కనబరిచారు. అతనితో పాటు మనకు బాగా తెలిసిన యాన్ హత్వే, స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హాలండ్, జెండాయా, రాబర్ట్ ప్యాటిన్సన్ లాంటి అగ్ర తారాగణం ఉండటం సినిమాకు పెద్ద అసెట్ అయింది.
ప్రపంచవ్యాప్తంగా వెర్రితలలు వేస్తున్న క్రేజ్:
ఈ సినిమా కోసం విదేశాల్లో అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.ఈ సినిమా కోసం యుఎస్‌లో ఒక మహిళ తన ప్రెగ్నెన్సీ ప్లాన్‌ను కూడా పోస్ట్‌పోన్ చేసుకుంది. దీనితో ఈ మూవీపై ఉన్న పిచ్చి ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తుంది.. అంతేకాదు, పెన్సిల్వేనియాకు చెందిన మరో అభిమాని ఈ చిత్రాన్ని పూర్తి 70MM ఐమాక్స్ వెర్షన్‌లో చూడటానికి దాదాపు 3,904 కిలోమీటర్లు ప్రయాణించి కాలిఫోర్నియా వెళ్తున్నాడట. కేవలం ఒక సినిమా కోసం ఇంతటి వెర్రి అభిమానం బహుశా నోలన్ చిత్రాలకే సాధ్యం.
సాధారణంగా మన దగ్గర పెద్ద తెలుగు సినిమాలు లేనప్పుడు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకుంటాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. మన లోకల్ సినిమాల కంటే హాలీవుడ్ విజువల్ ఎపిక్ "ది ఒడిస్సీ" వైపే ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు. ఇక టెక్నాలజీ, అద్భుతమైన కథా బలంతో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. మరి మన తెలుగు చిత్రాలు నోలన్ సృష్టించిన ఈ సునామీని తట్టుకుని ఎంతవరకు నిలబడతాయో చూడాలి.
